14 మే, 2015

శ్రీరామనవమి



కవితల సుమహారం (60)

శ్రీ రామ కథా శ్రవణం సర్వపాపహరణం
అయోధ్యాపురమ్మది దశరథ పాలితమ్మది
మానవాళికి మధుర చరిత మందిచినది
కౌసల్యా సుమిత్రా కైకలకు జన్మించిరి మహావిష్ణు అంశగ
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ముదిమి మీరగ
అల్లారుముద్దుగ పెరిగినారు రాకుమారులు నల్వురు
దశరథుని కంటిపాపడై నింగి చంద్రునే కోరినాడు రాముడు
వసిష్టుని కనుసన్నలలో విద్యలెన్నియోనేర్చి
విశ్వామిత్రుని ఆజ్ఞమేర యాగ సంరక్షణ నెపమున
రామలక్ష్మణులు బల అతిబల లను నేర్చి
తాటకాది రాక్షససంహారము కావించి
గురువు వెంట మిథిలకేగి స్వయంవర మంటపమున
రమణి సీతను కాంచి రాఘవుడు శివధనుర్భంగము చేసె
పరశురాముని శక్తి గొని అతని అహమడంచి
లోక కళ్యాణమునకై సీతను చేపట్టి
అయోధ్యానగర మరుదెంచి ఆనంద మొందగా
రామపట్టాభిషేక మభిలషించి దశరథుడు ఆనందముప్పొంగ
రామజన్మ సార్థకత తెలిసి మంధర కైక నొప్పించి
దశరథుని వరమడుగునట్లు చేసి
రామవనవాసమునకు శ్రీకారము చుట్టె
పతివెంట సతి అన్నవెంట సౌమిత్రి వెడలె వనాటవులకు
రామమోహమున శూర్ప్హణఖ ముక్కుచెవులను కోల్పోయి
అన్న రావణు జేరి సీతాపహరణము నకు ఆజ్యముపోసి
బంగారు లేడికై సీత మొహించునట్లు చేసే
సీతగొని రావణుడు లంకజేరుచు జటాయువు సంహరించ
సీతా విరహాగ్నిదహించు చుండ సీతాన్వేషణ కై
జటాయువు జాడ తెల్ప చిత్రకూటముజేరి
హనుమంతునక్కున చేర్చుకొని ,సుగ్రీవునకు సాయమందించి
వాలిసంహారముచేసి వానర సేన గొని
హనుమంతు సహకారమున సీత జాడగొని
వారధి బంధించి లంకాపురముజని
రావణు పీచ మడంచి విభీషణునకు రాజ్య మిచ్చి
సకల వానర సేనా సమేతుడై సీతాలక్ష్మణ విరాజితుడై
అయోధ్యా నగరవాసుల ఆనందముప్పొంగ
పట్టాభిషిక్తుడయ్యె రఘుకులతిలకుడు శ్రీరాముడు
లోకములెల్ల ఆనందమునతేలె రామరాజ్యమునుచూసి
జయజయరామ సీతారామ జయ శ్రీ రామ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి