26 మే, 2013

కాకినాడ-విశాఖపట్నం

ఉదయం 4. 35 ,కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఎనౌన్స్ మెంట్ . కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు మరికొద్ది సేపట్లో ప్లాట్ఫారం పైకి రాబోవుచున్నది . 4. 38 ట్రెయిన్  ప్లాట్ ఫారం మీదకి వచ్చేసింది . కొంతమంది ఆఖరి బోగీలు ఖాళీగా వుంటాయని , కొంతమంది ముందు బోగీలు ఖాళీగా ఉంటాయని, మరికొంతమంది నిలబడినచోటే ఎక్కొచ్చని సిద్ధంగావున్నారు . బండి ఆగుతుండగానే గబగాబగా సీటు కోసం ఎగబడుతున్నారు . నెమ్మదిగా ట్రైను బయలుదేరింది ,వేగం పుంజుకుంది . హమ్మయ్య ఎలాగోలా ఎక్కేసాం , భగవంతుడి దయవల్ల సీటు దొరికింది అని కొంతమంది , బాబు కొంచెం జరగండి వైజాగ్ దాకా వెళ్ళాలి అని బతిమాలి సీటు అడిగి కొంతమంది ఉపిరి పీల్చుకుంటున్నారు . ఇంతలో ట్రైన్ సామర్లకోట వచ్చేసింది . ఇంజను మారాలి , ఒక పది నిముషాలు అనుకున్న జనాలకి సరిగ్గా గంట తర్వాత బయలుదేరిన ట్రైన్ ని తిట్టుకోక తప్పలేదు . ప్రతి స్టేషన్ లో ఎక్కేవాళ్ళు బతిమాలుకొనో జబర్దాస్తిగానో ఉన్నంతలో సీటు సంపాదించుకుంటున్నారు . అదే ఇంకొకరికి సీటు ఇవ్వవలసి వచ్చేసరికి లేదండి ఖాళీ లేదు  అని చెపుతున్నారు. నోరున్నవాడిదే రాజ్యం . నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వెళ్తోంది ట్రైన్ . కాఫే,టీ ,తినుబండారాలు అమ్మేవాళ్ళు కూడా ప్రయాణికులతో పోటీపడుతూ ఎక్కుతున్నారు ,జనాలని తొక్కు కుంటూ అమ్ముకుంటున్నారు . బిచ్చగాళ్ళ సంగతి సరేసరి ,ఇలా రణగొణధ్వనులతో ప్రయాణం సాగిపోతోంది . నెమ్మదిగా రైలు అనకాపల్లి చేరింది . అప్పటిదాకా వుండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది . తట్టలు బుట్టలు పట్టుకొని కొంతమంది లంచ్ బాగ్లు పట్టుకొని ఉద్యోగస్తులు కాలేజీ పిల్లలు  ఇంకా వ్యాపారస్తులు బిలబిల లాడుతూ ఎవ్వరిని పట్టించుకోకుండా తోసుకుంటూ ఎక్కేస్తున్నారు . అడ్డంగావచ్చిన వాళ్ళని నోటితో అదిలిస్తూ బెదిరిస్తూ చోటు సంపాదించుకుంటున్నారు . కాలేజేపిల్లలు చాటింగులు చేజింగులు , ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు ,బాసులగురించి ఇలా ఎవరికితోచింది వాళ్ళు మాట్లాడే సుకుంటున్నారు . కొంతమంది మాటలు మొదట దేవుళ్ళ గురించి అక్కడినుండి మతం గురించి , కులాల గురించి రాజకీయంగురించి ఇలా ఒక్కొక్క విషయంగురించి చర్చించుకుంటూ తిట్టుకుంటూ తమ చర్చలు అందరు వింటున్నారో లేదో చూస్తూ ,ఎవడిమతిక్కివాడు తను వాదించే విషయంలో తానె పెద్ద మేధావినన్నట్లు ఫీలైపోతూ సపోర్ట్ కోసం పక్కవాళ్ళని అడుగుతూ దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్తాయనేది కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ ఆ ప్రతిభకి కూడా పొంగిపోతు వాదించు కుంటున్నారు . ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు . రోజు జరిగేదే , సభ్యసమాజంలో ఎలాప్రవర్తించాలొ తెలియని ఆ చదువుకున్న పశువులకి  జ్ఞానోదయం ఎప్పుడవుతుందో !ఏది ఎలా ఉన్నా రైలు మాత్రం తనగమ్యాన్ని  చేరుకుంది    

17 మే, 2013

నాన్న - ప్రేమ

ప్రేమ -మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యంగా  యవ్వనదశలో  దీనిబారిన పాడని వారు  ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! ప్రేమ తప్పు కాదు కాని ప్రేమ పేరుతొ వ్యామోహంలో పడి జీవితంలో ఎన్నో సాధించవలసిన వాటిని కోల్పోతే,ప్రేమ ఫలించకపోతే అప్పుడు అది తప్పు అనిపించవచ్చు . కాని ప్రేమలో పడినవారికి ఇవేమి  కనిపించవు. 
 రాజేష్ ఇంటర్ ఫెల్ అయ్యి ఇంటిదగ్గరే వున్నాడు. ఆ రోజుల్లో పరిక్షతప్పితే 6 నెలలదాకా ఖాళీగా ఉండడమే . 
పల్లెటూరు కావడం వల్ల ఆమాత్రం చదువుకున్నవాళ్ళు తక్కువే ! ఇంక రోజంతా కాలక్షేపం కోసం రోడ్డుమీద 
కుర్చుని పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ హైస్కూల్ కి వెళ్ళే అమ్మాయిలని కామెంట్ చేస్తుండడం ,జోకులు ,వాద ప్రతివాదనలు ఇలా గడిపివేయ్యడమే !  వయసు ప్రభావం వాళ్ళ పక్కనున్న స్నేహితుల ప్రోత్సాహం వల్ల 
రజియా పై ప్రేమపుట్టుకు వచ్చింది రాజేష్ కి. ఆ అమ్మాయి కూడా రాజేష్ వంక చూడడం,నవ్వడం మరింత  ఆనందాన్ని ఇచ్చింది రాజేష్ కి . రోజు రోజుకి  ఆమె కోసం ఎక్కువ సమయం రోడ్డు దగ్గర గడపడం ,ఎదురుగుండా స్కూల్ కావడంవల్ల ,పల్లెటూరిలో స్కూల్ లో క్లాసులు ఎక్కువగా అరుగులమీదె ఉండడంతో  ఆమెని చూస్తూ  కాలం గడిపేసేవాడు . ప్రేమవిషయంలో  స్నేహితులు ప్రోత్సాహం మంచిదైన చెడ్డదైనా  ఎక్కువగానే వుంటుంది . ఇంకేముంది  ఎలాగైనా ప్రపోజ్ చెయ్యమని ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో  హీరోలా ఫీలయిపోయాడు రాజేష్ . 

  రాత్రంతా కుర్చుని పర పర పేపర్లు చిమ్పుతూ  మొత్తానికి ప్రేమలేఖ రాసేశాడు . ఎలాగైనా  ఈరోజు లెటర్ ఇచ్చెయ్యాలి . ఆమెనించి స్పందన తెలుసుకోవాలి ,ఇప్పటిదాకా ఒకవైపే , తను ఒ.కె. అంటే ఇంకా తనంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు . కులం మతం వేరైనా ప్రేమ ముందు దాని గెలుపు ముందు దేన్నైనా జయించగలననుకున్నాడు . ఇలా వూహించుకుంటూ  లెటర్ని ఫాంట్ జేబులో పెట్టుకున్నాడు . హైస్కూల్ మధ్యాహ్నం పూట వుండడం వల్ల  ఫ్రెండ్స్ తో బతాఖానికి లుంగీ తో రోడ్డుదగ్గరకి వెళ్ళిపోయాడు పొద్దున్నె. కబుర్లతో కాలం గడిచి పోయింది . వాళ్ళ నాన్నన ప్రభాకరం ఆవూరి ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాష్టర్ . మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు .  భార్య భోజనం వడ్డిస్తోంది . పెద్దాడు భోజనానికి వచ్చాడా? అడిగాడు ప్రభాకరం ,వాడు వాడి తిండి , ఎప్పుడో వస్తాడు మీరు తినండి అంది భార్య లక్ష్మి . కాదు వాడిని రమ్మను కబురు చెయ్యి, ఇద్దరం కలిసే చేస్తాం  అన్నాడు ఆయన. చిన్నబ్బాయిని  కబురు పంపింది లక్ష్మి. 

     కబురు అందుకోగానే రాజేష్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి . గబగబా ఇంటికి వెళ్ళాడు , రారా  భోన్చేద్దువుగాని ,ఈ మాటలు వినేసరికి  ఏమిచెయ్యాలో తోచలేదు , వెళ్లి కూర్చున్నాడు , లక్ష్మి వాడికి వడ్డించేసి నువ్వు బయటకు వెళ్ళు  కాసేపు అన్నాడు ప్రభాకరం . ఆవిడకి ఆశ్చర్యంగానే వుంది  ఈయన ప్రవర్తన . కాని ఆయనని ప్రశ్నించే ధైర్యం  లేదు ఆమెకి . 
 లెటర్ ఇచ్చేసావా? ... తండ్రి ప్రశ్న వింటూనే అవాక్కయ్యాడు రాజేష్ , ఎ .. ఏ .. లెటర్ .. నాకేం తెలియదు .. బిత్తరపొతూ  అన్నాడు . నాకు తెలుసుగానీ ... ఇచ్చావా లేదా?  భయపడకు చెప్పు . ఏం చెప్పాలో తోచలేదు . అసలు నాన్నగారికి  ఎలా తెలుసు  అవకాశం లేదు .. అడుగుతున్నది నిన్నే ! తుళ్ళి పడ్డాడు రాజేష్ .. ఇఇ  ఇవ్వలేదు  . సమధానం  ఎలావచ్చిందో తెలియదు . సరే . నేను చెప్పేది శ్రద్ధగావిను  మొదలుపెట్టారు ప్రభాకరం ..  
 ఇప్పుడు లెటర్ ఇస్తావు ,ఆ  అమ్మాయి కూడా   సరే అంటుంది . కలిసి తిరుగుతారు ,దేనికి పరాకాష్ట ఏమిటి? పెళ్లి .. సరే నీ వయసు  18 ఇంకా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే యోగ్యతా రాలేదు , పెళ్లి చేసుకుంటావు ,భార్యకి మూరెడుమల్లె పూలు  కొనాలన్నా నీకు సంపాదన లేదు,సినిమాకి అంటుంది , నాన్నా నా భార్యని సినిమాకి తీసుకువెళ్తాను  10 రూపాయలు ఇవ్వండి అని నన్ను అడుగుతావా? అడగ గలవా? ఇప్పుడు అందంగా కనపడిన జీవితం  , ప్రేమ  అప్పుడు కష్టంగా చిరాకుగా అని పిస్తాయి . అందుకే ముందు నువ్వు యోగ్యుడివి అవ్వు , తరువాత నీకు  నచ్చిన పిల్లని ప్రేమించు పెళ్ళిచేసుకో , ఏకులం ,మతం అని నేను అడగను . అందరి తండ్రుల్లాగా నేను ఆలోచించను  ఒక తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా నేను చెప్పాల్సింది  చెప్పాను  ఆపైన నీ ఇష్టం అంటూ  గబగబా భోజనం చేసి  వెళ్ళిపోయారు . అంతా  విన్న రాజేష్ తండ్రి చెప్పిన మాటల్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తూ  అన్యమనస్కంగానే చెయ్యి కడిగేసుకున్నాడు . అసలు విషయం నాన్నగారికి ఎలాతెలిసింది ? మధన పడిపోతున్న  రాజేష్ కి రాత్రి అమ్మ నాన్నని అడిగిన ప్రశ్న ద్వారా సమాధానం దొరికిన్ది. భోజనానికి కుర్చునేటప్పుడు ఫాంట్ హాంగర్ కి తగిలిస్తుంటే వాడి ఫాంట్ కింద  పడింది ,జేబు బరువుగావుండడం చూసి  కిరాణా బాకీ  ఇంకా కట్టకుండా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా అని చూసాను ,తీర చూస్తే లవ్ లెటర్ , పిల్లలని సరైన సమయంలో సరిగా  మంచి మాటలతో అర్ధమయ్యేలా మలచుకోగలిగితే  వాళ్ళు మానని అర్ధం చేసుకుని మంచి మార్గంలో నడుస్తారు  . అదే కటువుగా కోపంతో నాలుగు కొడితే మొండిగా తయారవుతారు ,టీచర్ గా నా పిల్లవాడిని  చక్కదిద్దుకో గలిగితే  పదిమందిని చక్కదిద్దిన వాడిని అవుతాను .. ఇంటగెలిచి  రచ్చ గెలవమన్నారు . నాకు తెలిసి వాడు జీవిత సత్యాన్ని తెలుసుకుని  మంచి మార్గంలో వెళ్తాడని నమ్మకం . ఈ మాటలువిన్న లక్ష్మి తండ్రిగా పిల్లవాడి  విషయంలో భర్త భాద్యతని చూసి ప్రశాంతంగా నిద్రకుపక్రమించింది . రాజేష్ తండ్రి మాటల్లో సత్యాన్ని గ్రహించి  నాన్న ప్రేమ లో వుండే గొప్పదనాన్ని గ్రహించి  చదువుమీద శ్రద్ధ పెట్టి  తనుకూడా ఒక టీచర్ గా పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు .  నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పది?  

15 మే, 2013

ఎదురుచూపు

పెళ్లి అనగానే  ఆడపిల్ల మనసులో  కోరికలు పురివిప్పిన నెమలిలాగ నాట్యమాడుతాయి. శ్రావణి కూడా సగటు ఆడపిల్ల లాగే పెళ్లి కలలు  కంటోంది .  చిన్నాన్న తీసుకువచ్చిన సంబంధం ,పిల్లాడు అందగాడు ,సంపాదనాపరుడు,చదువు తక్కువే ఐనా వేద పండితుడిగా  గౌరవమర్యాదలు పొందుతున్నవాడు. కుటుంబం సాంప్రదాయ మైనది . మీదుమిక్కిలి అత్తగారు చాలా మంచిది . ఇంతకుమించి ఏ ఆడ పిల్లైనా కోరుకునేది ఏముంటుంది ? అమ్మ నాన్న ముందు ఒప్పుకోపోయినా అన్ని ఆలోచించి ఒ.కె. చెప్పారు .తాతగారు కాలం చెయ్యడం వల్ల పెళ్లి ,నిశ్చితార్ధం ఆగష్టు వరకు పెట్టుకోలేదు . కానీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి 
అనుమతి ఇచ్చారు పెద్దలు . ఇంకేముంది సెల్ ఫోనులో చాటింగులు  మెస్సేజ్లు . కాలం భారంగా గడుస్తుందని అనుకుంటే వేగంగానే గడుస్తోంది . 

                పెళ్ళికి కావలసిన చీరలు వస్తువులు ,పెళ్లి ఎలాచేయ్యాలి ,ఎక్కడ చెయ్యాలి అనే విషయాలలో  అమ్మ నాన్న తలమునకలు ఔతుంటే ,చీర ఎలా సింగారించుకోవాలో,అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో ,వంట ఎలా చేసి 
అత్తవారింట్లో మెప్పు పొందాలో ఇలాంటి విషయాలలో  శ్రావణి అమ్మని, నానమ్మని ,అత్తని పిన్నిని అడిగి నేర్చుకుంటోంది . ఇంతలో పెళ్ళివారి నుండి కబురు వచ్చింది వైశాఖం లో  నిశ్చితార్ధం పెట్టుకుందామని . తర్జన భర్జనల అనంతరం తాంబూలాలు ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకునేలా ఒ.కె  చెప్పాడు పిల్ల తండ్రి రామకృష్ణ . పనులు చక చక జరిగిపోతున్నాయి . పిలుపులు అందరికి అందేసాయి . మధ్యతరగతి కుటుంబమైనా ఒక్కగానొక్క ఆడపిల్ల నిశ్చితార్ధం ఏలోటు లేకుండా ఉన్నంతలో ఘనంగా చేయాలని అందరిని పిలుచుకున్నాడు రామకృష్ణ . 

                 ఇంతలో మళ్ళి పిలుపు వచ్చింది పెళ్ళికొడుకు తండ్రికి అనారోగ్యంగా వుందని ,నిశ్చితార్ధం  ఆగష్టులోనే 
పెట్టుకుందామని . ఈ సమస్య వస్తుందని అనుకుంటూనే వున్న రామకృష్ణ సరే అలాగే అన్నాడు . మళ్ళా అందరికి ఫోన్ చేసి కార్యక్రమం వాయిదా పడిందని చెప్పుకునే సరికి తాతలు దిగివచ్చారు రామకృష్ణకి . ఆఖరి ఫోన్ చేసి ఇంకా అందరికి చెప్పేసాం కదా ,ఇంకేవారిని మర్చిపోలేదు కదా అని భార్యని అడుగుతుండగా  ఫోన్ మోగింది . పెళ్లి కొడుకు బావగారు ... విషయం విని ఏమిచేయాలో పాలుపోలేదు రామకృష్ణకి . కాబోయే వియ్యంకుడి మరణవార్త ,ఆయన మరణం ఒకపక్క ,ఏడాది వరకు పెళ్లి వాయిదా పడిందనే బాధ ఒకపక్క. చిన్నబోయిన కూతిరి ముఖాన్ని చూసి ధైర్యం చెప్పడం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి . అంతా మనమంచికే ,ఆపేసిన చదువు కొనసాగించు  అని తండ్రి అంటే కాబోయే భర్త కూడా ఒక్క ఏడాదే కదా అందాక అక్కడే పీజీ లో జాయిన్ అవ్వు ఫై ఏడాది ఇక్కడ కంటిన్యు చేద్దుగాని  అనడంతో  ఏడాది కాలాన్ని ఎదురుచూపులతో గడపడానికి సిద్ధమయ్యింది శ్రావణి ......