28 ఆగ, 2013

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం 


కృష్ణాష్టమి అంటే ..... కృష్ణాష్టమి అంటే ..... నిజంగా కృష్ణాష్టమి అంటే  మనకు ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మిష్టర్ పెళ్ళాం లో క్రిష్ణాష్టమే !

అసలు సృష్టిలో కృష్ణ తత్వాన్ని మించిన తత్త్వం వేరొకటి కనబడదు . పుట్టిన దగ్గరనుంచి అవతారం చాలించిన దాకా కృష్ణుడు మనకు మరలా అనేక అవతారాలలో కనిపిస్తాడు . పుట్టుకతోనే మాయని తనతోబుట్టువుగా తెచ్చుకొని అనీక సందర్భాలలో మాయను ప్రదర్శిస్తాడు . మగ బిడ్డను కన్న ప్రతి తల్లి జన్మ పునీత మయ్యేలా కృష్ణుడి బాల క్రీడలు జరుపుతాడు చిన్ని కృష్ణయ్య . ప్రతి తల్లి తన మగ బిడ్డ అల్లరిలో ఆటపాటలలో కృష్ణయ్య ను తలుచుకోకుండా వుండలేదంటే అతిశయోక్తి కాదు . చిన్నప్పుడు తన స్నేహితులతో చేసే అల్లరి, ధైర్య సాహసాలు , విద్యాబుద్దులు నేర్చినపుడు విద్యార్ధిగా , యుక్త వయసుకు వచ్చిన కన్నయ్య గా గోపా బృందముతో ఆడిన సయ్యాటలు , గోపికలపై చూపించిన తామరాకుపై నీటి బొట్టు లాంటి ప్రేమకలాపాలు ,అష్ట పట్టమహిషుల తో ఒక సంసారిగా , అన్నకు బాసటగా నిలిచే తమ్ముడిగా , శత్రువుల పాలిటి సింహస్వప్నంగా , పాండవ హితైషిగా ,అర్జునునకు ఆప్తుడిగా,బావగా, గురువుగా,రాజనీతిజ్ఞుడుగా ,దాత గా,స్త్రీ మానస చోరుడుగా-స్త్రీ మాన సంరక్షకుడుగా ధర్మ రక్షకుడుగా ,గీతా ప్రభోదకుడిగా మోక్ష ప్రదాతగా ,ఆపద్భాందవుడుగా ,పశుపాలకుడుగా, సకల కళా వల్లభుడిగా తన జీవితం లో ఆణువణువూ మనిషిగా ఎలా బ్రతకాలో తెలియచెప్పిన పరమాత్ముడు శ్రీ కృష్ణుడు . 

కృష్ణుడు ప్రబోధించిన గీత ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. బిడ్డగా,అన్నగా, తమ్ముడిగా, హితుడిగా, స్నేహితుడిగా , ప్రేమికుడుగా , భర్తగా,ఆత్మీయుడుగా ఆయన  చూపించిన త్రోవ అందరికి ఆదర్శం కావాలి. జగద్గురువు కు  జన్మదిన శుభాకాంక్షలు . జై జగద్గురు ! హరే కృష్ణ ! హరే కృష్ణ ! కృష్ణ కృష్ణ హరే హరే !!    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి