11 సెప్టెం, 2014

పెళ్ళంటే ......

పెళ్ళంటే .....


పెళ్ళంటే నూరేళ్ళ పంట . ప్రతి ఆడపిల్లా కలలుకనే బంగారు జీవితం . ఎన్నో ఆశలతో  అత్తవారింట అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లా కొద్ది రోజులు అక్కడి వాతావరణానికి సద్దుకోవడం కష్టమే అవుతున్ది. అపురూపంగా పెంచుకున్న ఆడపిల్ల అత్తవారింటిలో ఏ కష్టాలు పడకూడదని మగ పెళ్ళివారు అడిగినదేది కాదనకుండా స్తోమతకి మించి చేస్తారు ఆడపిల్ల గలవాళ్ళు. కానీ ఆడపిల్ల ఆయుధంగా దొరికింది కదాని వియ్యాలవారిని అవమానాలపాలు చేస్తారు మగ పెళ్లి వారు . అక్కడికి ఆడపిల్లని కనడం తప్పైనట్లు ఆ అత్తగారొక ఆడది కాదన్నట్లు,తనకి ఆడపిల్లలు ఉంటె వాళ్ళుమాత్రం ఎక్కడినించో దిగివచ్చినట్టు భావిస్తుంటారు . ఎందుకీ వ్యత్యాసం? కోడలు కొడుకు సంతోషంగా వుంటే చూడలేనివాళ్ళు మరి ఆ కొడుక్కి పెళ్ళెందుకు  చెయ్యాలి. కన్న బిడ్డలా చూసుకుంటామని చెప్పి కంటకంగా ఎందుకు చూడాలి ? జీవితంలో తనకో తోడు  దొరికిందని  ఆనందించాలా ? పెళ్ళితో తనవాళ్ళ బంధాలన్నిటిని తెగతెంపులు చేసుకోవలసి వస్తున్నందుకు బాధ పడాల ? పెళ్ళంటే రెండుకుటుంబాల మధ్య బంధం . ఆప్యాయతా అనురాగాల మేళవింపు . పుట్టింటి నుంచి అందరినీ వదులుకొని వచ్చిన కోడలిని అమ్మగా అక్కున చేర్చుకొని తన కుటుంబాన్ని వృద్ది చేయడానికి వచ్చిన ఆడపిల్లని ప్రేమతో తనకు అనువుగా మలచుకొని పుట్టింటికి దూరమయ్యాననే భావన కలగ కుండా  చూడవలసిన బాధ్యత అత్తగారి పై ఉన్తున్ది. మరో ఇంటికి కోడలుగా వెళ్ళిన ఆడబిడ్డ తన జీవితంలో ఏవైనా కష్టాలు వుంటే అవి తన వదినగారికి రాకుండా చూసుకోవాలి .భర్త అన్నీవదలుకొని తనతో నూరేళ్ళ జీవితం పంచుకోడానికి వచ్చిన భార్య మాటకు కూడా విలువనిచ్చి తల్లీ భార్యా అరమరికలు లేకుండా ఉండేలా చూసుకోవాలి . ఎంతమంది కోడళ్ళు ఇలాంటి మానసిక వేదన అనుభవిస్తున్నారో ! ఆ ఆడకూతుళ్ళకి ఓర్పు సహనంతో ఉంటూ  భర్త ప్రేమని అత్తా ఆడపడుచుల ఆప్యాయతలని పొందేందుకు ఎదురుచూడమని, నిరాస నిస్పృహలకు లోను కావద్దని కన్నీటితో వేడుకొంటున్నాను . పెళ్ళంటే ఇదేనా ... అని ఆవేదన చెందవద్దు . పెళ్ళంటే ఒక నమ్మకం ఒక అనుబంధం ఒక ఆప్యాయత ఒక్కొక్క ఇటుక పేర్చుకొంటేనే అందమైన భవనం  తయారవుతుంది 
 .   

7 సెప్టెం, 2014

గణేశా

మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన చి త్ర క వి త – 50 – ‘గణపతి నవరాత్రులు’ పోటీ లో మొదటి (1) ద్వితీయ విజేతగా నిలిపిన  కవిత
 ::

గణేశా 

అమ్మ చేతి నలుగు పిండితో ప్రాణంబు పోసుకొని
నాన్న చేతి త్రిశూలపు వేటుతో ప్రాణంబు పోగొట్టుకొని
గజముఖ రూపుడవై గణనాదునిగా ప్రతిష్టితుడవై
విఘ్నములతొలగించు విఘ్నేశ్వరుడవై వెలుగొంది
ముజ్జగాల మన్ననలంది గుజ్జురూపుడవై నిలచి
భాద్రపద మాసాన శుక్లపక్ష చతుర్ధి నాడు భువిలోన
ఇంటింట కొలువై పచ్చనైన పత్రీ పూజలందుకొని
కుడుములున్డ్రాళ్ళు నవకాయ పిండివంటలతో
బొజ్జనిమ్పుకొని నవరాత్రులందు సేవలందుకొని
భక్తులందరి కోర్కెలు తీర్చుచు భజనలందుకొని
పదవ దినమునందు పరిపూర్ణ అలంకారములతో
పురవీదులందు కనులవిందుగా ఊరేగుచును
నిమజ్జనమునకు నీవు వెడలుచుండ,
ప్రకృతిలోన పుట్టి ప్రకృతిలోన కలయు
విఘ్నేశ్వరా ! రంగు రంగుల హంగులు లేకుండ
నిమజ్జనమై పర్యావరణమును కాపాడు గణాధిపా !

తెలుగోడు



తెలుగోడు



త్యాగధనుల కలల రూపమా
చారిత్రక కళల అపురూపమా
సంస్కృతీ సాహిత్య ప్రాభవమా
సమతా మమతల మాతృమూర్తి
భాషా ప్రయుక్త రాష్ట్రానివిగా
తొలితాంబూలం అందుకున్నదానివి
ఆంధ్రమాతగా ,తెలుగు తల్లిగా
అ గ్ర తాంబూలం అందుకున్నదానివి

ఇన్నేళ్ళలో ఏ సామాన్యుడు
నేను తెలంగాణా వాడినని,
నేను రాయల సీమ వాడినని
కోస్తా వాడినని ఎప్పుడూ అనుకోలేదు
విడిపోవడమంటే మనసులు
ముక్కలు చేసుకోవడమేనని
కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమేనని
అనాదిగా మానవుడు నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం

కానీ ఇప్పుడేమిటి తల్లీ నీ కళ్ళముందే
కాపురాలు కుల్చాలనే కుళ్ళు ఆలోచనలు
కడుపుకింత తినడానికి తిండి దొరకాలన్నా
తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకాలన్నా
కలిసుంటేనే కలలు సాకారమని
రాబోయే తరాలతలరాతలు మార్చాలనుకునే
ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు తెలియదా
నేటి బిడ్డల నోళ్ళలో రేపు మన్ను పడుతుందని

తలుచుకుంటే మాకే గుండె తరుక్కుపోతోంది
కన్నపేగును రెండుగా చీల్చుతుంటే
ఒకకంటిలో అల్లం మరోకంటిలో బెల్లం పెడుతుంటే
ఏమిచేయాలో పాలుపోని నిర్వేదంలో ఓ తెలుగుతల్లీ
కన్నీరు కార్చకు మలచుకొంటారు మన రాజకీయ కీచకులు
సామాన్యుడు నిస్సహాయుడుగా నిలబడే లోకంలో
అమాత్యుల పైసాచికత్వానికి బలైపోతున్న తెలుగుతల్లీ

నీకోసం రెండు కన్నీటి చుక్కలు కార్చడంతప్ప
ఏమీ చేయలేని అసహాయుడు

నా శ్రీమతి కోసం

నా శ్రీమతి కోసం
 
సిరివెన్నెల జలతారు ముసుగులో 
మరుమల్లెల పరిమళాలు రువ్వుతూ 
మన్మధ బాణాలు నా ఎదలో గుచ్చుతూ 
నడయాడుతూ వచ్చిన రాగ మాలికా !

నీ కనుదోయిలో వెలిగే ప్రేమదీపాలు
నీ చిరు మోవిపై పలికే విరహ గీతాలు 
నను కవ్వించే సమ్మోహన సౌందర్యాలు 
నను మైమరపించే నీ కురుల అందాలు 

కనులు మూసినా తెరిచినా 
స్వప్న సుందరిలా 
నా కనుల ముందు నిలిచే నువ్వు 
నిర్మల ఝరి లా వినిపించే నీ నవ్వు 

నిను శిల్పంగా మలచేందుకు 
నీ హృదయం కరగని శిల కాదు 
నిను చిత్రంగా గీచేందుకు 
నువ్వు కరిగి పోయే రంగువి కావు 

అందుకే ప్రియా!

నా హృదయమనే కాన్వాసుపై 
మమతలనే రంగులు కలిపి 
ప్రేమ అనే కుంచెతో గీసిన
అపురూప చిత్రం నీవు !

ఉగాది

ఉగాది -మన తెలుగు మన సంస్కృతీ గ్రూపులో నన్ను విజేతనుచేసిన కవిత 


భావ కవుల కల్పనా కల్పవల్లీ 
ప్రకృతి రమణీయ శోభల కళామతల్లీ 
చిగురాకుపచ్చచీరను చుట్టి 
చిరునగవు లే చిగుళ్ళను అలముకొని 
కొమ్మలమాటున కోయిల కూజితాలతో 
వేపపూల పరిమళాల సోయగాలతో 
గున్నమామి వగరు మామిళ్ళ అందాలతో 
నీ నునులేత స్పర్సతో నవ యుగాదిని తోడ్కొని వచ్చి 
మానవునిలో దాగియున్నఅరిషడ్వర్గాలను
షడ్రుచుల మేళవింపుతో తొలగించి 
రంగు కన్న రాగమే మిన్నయను అనురాగ భావమును
కోయిల గానామృతము వినిపించి మా కనులు తెరిపించి 
తేటతెలుగు అమృతాల పంచాగ శ్రవణము గావించి
ఈ వత్సరమునకు మా రాశి ఫలితాలను తెల్ప
జయనామ సంవత్సరానివై జయము కూర్చ 
ఉషోదయాన మా హ్రుదయోదయము చేయవచ్చిన
వసంతయామినీ నీకిదే స్వాగతము సుస్వాగతము
శుభము శుభము !జయము జయము !!

జయ నామ ఉగాది




జయ నామ ఉగాది -కృష్ణా తరంగాలు గ్రూపులో నన్ను విజేతగా నిలిపిన కవిత 


నవనవోన్మేష నవమోహన సమ్మోహన ఉగాది కన్యకా 
నవరస సంగీత సాహిత్య సమ్మిళిత రాగ సారికా 
ప్రక్రుతి రమణీయ కమనీయ సౌందర్య మాలికా
సరస శృంగార చైత్రమాస సుశోభిత వసంత గీతికా
ఉషోదయాన చెరకువిల్లు పట్టిన మన్మధ రాణి వలె 
మధురమైన మావి చివురుల మెసవిన కోయిల రాగంతో 
గుబురు మావిళ్ళ చిరు ధరహాసాల మేళవింపుతో 
మత్తెక్కించే వేపపూల పరిమళాల గుభాళింపు తో 
జీవన సారపు షడ్రుచుల మధించిన పచ్చళ్ళతో 
సంవత్సర ఫలితాలతెలుపు పంచాగ శ్రవణాల తో 
తెలుగు వారి ఇల్లిల్లు వెలుగొందు దివ్య శోభతో 
ప్రతి మది నిండు మృదుల తరంగ భావాలతో 
నడయాడ వచ్చిన నవ వసంత యామినీ 
జయ నామ రూప ధారిణీ జయము జయము 
నీ క్రీగంటి చూపులో ప్రజలెల్లరకు కలుగు శుభము

నవ తెలంగాణ


నవ తెలంగాణ 

నవ తెలంగాణం నవ్యభావాల మాగాణం 
నర నరాల జీర్ణించుకున్నపౌరుషాగ్ని బాణం 
కాకతీయ వనిత రుద్రమదేవి ధీరతకు తార్కాణం 
రామప్ప శిల్పకళా చాతుర్యానికి ప్రమాణం 
వెలుగుజిలుగుల జానపద జీవ మాధుర్యం 
సంస్కృతీ సాహిత్యాల మేళవింపుల ఆహార్యం
బతుకమ్మ,సమ్మక్క సారక్కలే ఆరాధ్యం 
తెలుగు కొమ్మకు పూచిన మల్లెల సౌరభం
ఆంద్ర తెలంగాణల అన్యోన్యతల సరాగం 
ఎగురవేయాలి తెలుగు జాతి కీర్తి పతాకం

ఆంధ్ర -తెలంగాణ


ఆంధ్ర -తెలంగాణ


తెలుగుతల్లికి పుట్టిన అక్కచెల్లెళ్ళు అల్లారుముద్దుగా పెరిగినారు
పుణ్య పురుషులేన్దరికో జన్మనిచ్చి పునీత భూమిగా వినుతి కెక్కినారు పరాయి పాలకుల గుళ్ళకు గుండె నెదురు చూపె నొక్కడు
పౌరుషాగ్ని రగిలించి తెల్లమూకల తోక తెగకొసేనొ క్కడు 
స్త్రీ జాతి శిరోమణి అయ్యి కాకతీయ రాజ్యమేలె నొక్కరు
సమైక్యాంద్ర నిర్మాణమున కై అసువులే అర్పించే నొక్కడు 
తనది కాని తెలుగు నుద్ధరించుటకై తెగువ చేసె నొక దొర బిడ్డడు 
తెలుగు తల్లికి పచ్చని చీర చుట్ట శ్రమించే మరొక్క దొరబిడ్డడు 
సారస్వత సేవకై సర్వమూడ్చి తపన చెందె నొక్కడు
జాతి కీర్తి నినుమడింప మువ్వన్నెల పతాకమిచ్చే మరొక్కడు 
ఇంత ఘనకీర్తి పొందిన తెలుగుతల్లి ముద్దుబిడ్డలార
విడిపోతి మని వగచ వలదు విధి వంచితులమని తలవ వలదు 
సాకారమగును తెలుగువాని కలలెల్ల త్వరలోనే వేచిచూడు 
భారతజాతి కీర్తి కిరీటాన రెండు కీర్తి చంద్రికలు వెలుగ గలవు 
జై తెలుగు తల్లీ ,జై నవ్యాంద్ర సోదరీ,జై నవ తెలంగాణ చెల్లీ


నేను -స్వాతంత్ర్యం


నేను -స్వాతంత్ర్యం 


నా కన్నా పద్దెనిమిదేళ్ళ పెద్దది మన స్వాతంత్రం
ఏడాది కోసారి పుట్టినరోజు చేసుకుంటూ 
ఏళ్ళు గడిపేసింది నాలాగే తనూ 
వయసు పెరిగింది కానీ నాకూ ఎదుగుదల లేదు 
ఎదో జీవితమన్నాక చిన్న చిన్న ముచ్చట్లు 
కష్టాల అనారోగ్యాలు ,వోడిదుడుకుల సంఘర్షణలు 
కొందరి స్వార్ధపరుల మోసాలు దిగజార్చే ప్రయత్నం చేస్తే 
కొందరి స్నేహ హస్తాలు పైకి ఎదిగేందుకు దోహదంచేశాయి 
ఎదోకొన్ని విషయాలలో జీవితాన్ని సుస్థిర పరచుకొన్నా 
ఇంకా ముందుకు సాగవలసిన విషయాలెన్నో 
ఏదేమైనా మన స్వాతంత్రానికి మరోసారి శుభాకాంక్షలు 
"
నమో" సహకారంతో మరిన్ని విజయాలు సాధించాలని 
ఆ విజయాలలో మనమంతా ఆనందాన్ని అనుభవించాలని 
ప్రతి భారతీయునికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


స్వాతంత్రదినోత్సవం (68)

 స్వాతంత్రదినోత్సవం (68)


భారతీయ సంస్కృతీ సౌరభం మన త్రివర్ణ పతాకం 
భాషలేన్ని వున్నా భావమొకటే భారతీయత ఒకటే 
కులాలేన్ని వున్నా మనకులం మానవులం 
మతాలేన్ని వున్నా మనమతం సమ్మతం 
కాషాయం ప్రతిబింబించే త్యాగం హైందవ మైతే
తెల్లదనం ప్రతిబింబించే శాంతి క్రైస్తవమైతే 
పచ్చదనం ప్రతిబింబించే సౌభాగ్యం ఇస్లామైతే 
అన్ని మతాలలో ఉన్న సారమే ఈ మూడు భావాలై 
త్రివర్ణా లతో అలరారే భారతం ప్రపంచ శాంతికి బావుటా 
మన సంస్కృతి కల్మషరహితమైన గంగా ప్రవాహమైతే 
ప్రపంచం లోని మతాలన్నీ ఇందులో కలిసే నదులే 
మతం మన అభిమతం మతం మనకు దిశా నిర్దేశం 
కృష్ణుడు అల్లా ఏసు బుద్దుడు మహావీరుడు భోదనల సారం 
శాంతి అహింస త్యాగం పరోపకారం నిస్వార్ధపరత్వం 
మానవాళి మనుగడకివే ఆదర్శ సూత్రాలు మహా మంత్రాలు

12 జన, 2014

సంక్రాంతి

సంక్రాంతి 

ఈ రోజుల్లో అంతా బిల్డింగుల సంస్కృతిలోకి వచ్చారు కాబట్టి ఎలా ఉంటోందో తెలియదు కానీ పండుగ వస్తోందంటే పల్లెల్లో  మూడు నెలల ముందునుంచే సందడి మొదలవుతుంది . మట్టి లోగిళ్ళు నేల పొక్కుతీసి ,మట్టితో మెత్తి ,మళ్ళీ పేడతో అలికి ,గోడలకి అరుగులకి ఎర్రమన్నుతో అలికి సున్నంతో అందమైన ముగ్గులు పెట్టి , ఇంటిలో వుండే  ఇత్తడి సామాను మిలమిల మెరిసేలా తోమి ఇంటిలోపల బల్లలపై బోర్లించి , గడపలకు పచ్చని పసుపురాసి  ఇళ్ళను అలంకరిస్తారు . ఇంక రైతులు కళ్లాలలో వుండే ధాన్యాన్ని తీసుకువచ్చి గాదెల్లో నింపుతారు . పండుగకు కొద్దిరోజులు ముందుగానే నిలవ వుండే పిండివంటలు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కలిసి చేసుకుంటారు .పిండి దంపడం , అరిసలు జంతికలు సున్నుండలు లాంటి పిండివంటలను చాలా చక్కగా చేసుకుంటారు . ఇంక సంతలకు వెళ్లి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పిల్లలకి బట్టలుకొనడం కుట్టించడం , ఇంటికివచ్చే మూటలవాళ్ళ దగ్గర మిగిలిన బట్టలు కొనటం ,ఇదికూడా ఇరుగుపొరుగు కలిసి మూతలు దిమ్పించడం బేరాలు చేయడం అంతా చాలా సందడిగా వుంటుంది. ఇంక పండుగ రోజు తెల్లవారుఝామునే పిల్లాజెల్లా లేచి భోగిమంటలు వెలిగించి ఆ భోగిమంటల  దగ్గరే  వేడినీళ్ళు కాచుకుని అవి కాగేలోపున వంటికి నలుగులు పెట్టుకుని తలన్టి  స్నానాలు  చేసి కొత్తబట్టలు ధరించి మల్ల భోగిమంట దగ్గరకు వచ్చి పిడకలదండలు మంటలో వేసి ఆ బూడిదను బొట్టుగా ధరిస్తారు .కొన్త సేపు అక్కడే గడిపి ఇళ్ళకు వెళ్లి అమ్మ పెట్టిన అల్పాహారాలు తినేసరికి ఒక్కొక్కరుగా గంగిరెద్దులవాళ్ళు ,బుడబుక్కలవాళ్లు ,మొండివాళ్ళు , కొమ్మదాసరి ,ఇంకా చాలా వేషాలతో ఇంటింటికి వచ్చే వాళ్ళతో మధ్యాహ్నం దాకా కాలక్షేపం అయిపొతున్ది. నక పెద్దవాళ్ళ విషయానికి వస్తే కొత్త అల్లుళ్ళు, వాళ్లకి చేయాల్సిన మర్యాదలు ముఖ్యంగా అల్లుడికి తలంటి స్నానం చేయించడం ,ఇంటిళ్ళపాదీ సరసాలు , ఆటలు ,పాటలు కబుర్లు ఇలా గడిచిపోతుంది . ఆడవాళ్ళు భోజనాలు సిద్దం చేసేదాకా పేకాట లాంటి కాలక్షేపంతో మగవాళ్ళు గడుపుతారు . ఆడవాళ్ళకి పాపం విశ్రాన్తే  వుండదు . మరల మధ్యాహ్నానికి ముందే చేసివుంచుకున్న పిండి వంటలతో అల్పాహారాలు ఇలా చాలా ఆహ్లాదకరంగా మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచి పోతాయి . పెదపండుగ  పెద్దలకి బట్టలు పెట్టుకోవడం , గారెలు వండుకోవడం , మూడవరోజు కనుమ ... ఇది పశువుల పండుగ . ఈరోజు పసువులను ,వ్యవసాయపనిముట్లను శుభ్రంచేసి అలంకరిస్తారు . పశువుల మెడలలో పూలదండలు వెస్తారు. ఇంకా అట్లు,అరిసెలు లాంటివి కూడా వాటిమేదలలో వేళ్ళాడ కడతారు.దీనివల్ల అవి వొక దాని మెడలలో వున్నవి మరొకటి అందుకొని తింటాయి . ఆరోజు పశువులను ఏమి అనరు . ఇలా మూడురోజుల ముచటైన పండుగ  ఇప్పుడు ఎలావుందో తెలియదు ! ఎందుకంటే టి .వి. రంగప్రవేశంతో  అక్కడి వాతావరణం కూడా  సంప్రదాయమైన , సహజమైన సరదాలకు దూరమై  వీళ్ళు చూపించే పిచ్చి కార్యక్రమాలతో గడిపేస్తారేమో ! నా చిన్నతనం అంతా పల్లెటూళ్ళో   గడిపినా పల్లె వదిలి 20 ఏళ్ళు అయిపోతోంది . అక్కడ బంధువులెవరు లేకపోవడంతో  అక్కడికి వెళ్ళే అవకాశం దక్కటంలేదు . ఏదైనా పల్లెల్లో ప్రకృతి,సాంప్రదాయాలు కలుషితం కాకూడదని కొరుకున్దామ్.