29 ఆగ, 2013

ఏమి జరుగుతోంది

ఏమి జరుగుతోంది 

త్యాగధనుల కలల రూపమా 
చారిత్రక కళల అపురూపమా 
సంస్కృతీ సాహిత్య ప్రాభవమా 
సమతా మమతల మాతృమూర్తి 
భాషా ప్రయుక్త రాష్ట్రానివిగా 
తొలితాంబూలం అందుకున్నదానివి 
 ఆంధ్రమాతగా ,తెలుగు తల్లిగా 
అ గ్ర తాంబూలం అందుకున్నదానివి 

ఇన్నేళ్ళలో ఏ సామాన్యుడు 
నేను తెలంగాణా వాడినని,
నేను  రాయల సీమ వాడినని
కోస్తా వాడినని ఎప్పుడూ అనుకోలేదు
విడిపోవడమంటే మనసులు
ముక్కలు చేసుకోవడమేనని
కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమేనని
అనాదిగా మానవుడు నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం

కానీ ఇప్పుడేమిటి తల్లీ నీ కళ్ళముందే
కాపురాలు కుల్చాలనే కుళ్ళు ఆలోచనలు
కడుపుకింత తినడానికి తిండి దొరకాలన్నా
తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకాలన్నా
కలిసుంటేనే కలలు సాకారమని
రాబోయే తరాలతలరాతలు మార్చాలనుకునే
ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు తెలియదా
నేటి బిడ్డల నోళ్ళలో రేపు మన్ను పడుతుందని

తలుచుకుంటే మాకే గుండె తరుక్కుపోతోంది
కన్నపేగును రెండుగా చీల్చుతుంటే
ఒకకంటిలో అల్లం మరోకంటిలో బెల్లం పెడుతుంటే
ఏమిచేయాలో పాలుపోని నిర్వేదంలో ఓ తెలుగుతల్లీ
కన్నీరు కార్చకు , దానినికుడా రాజకీయం చేస్తారు
ఓట్లుగా మలచుకొంటారు మన రాజకీయ కీచకులు
సామాన్యుడు నిస్సహాయుడుగా నిలబడే లోకంలో
అమాత్యుల పైసాచికత్వానికి బలైపోతున్న తెలుగుతల్లీ

నీకోసం రెండు కన్నీటి చుక్కలు కార్చడంతప్ప

ఏమీ చేయలేని అసహాయుడు ... ......... ఆంధ్రుడు    

  
  

28 ఆగ, 2013

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం 


కృష్ణాష్టమి అంటే ..... కృష్ణాష్టమి అంటే ..... నిజంగా కృష్ణాష్టమి అంటే  మనకు ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మిష్టర్ పెళ్ళాం లో క్రిష్ణాష్టమే !

అసలు సృష్టిలో కృష్ణ తత్వాన్ని మించిన తత్త్వం వేరొకటి కనబడదు . పుట్టిన దగ్గరనుంచి అవతారం చాలించిన దాకా కృష్ణుడు మనకు మరలా అనేక అవతారాలలో కనిపిస్తాడు . పుట్టుకతోనే మాయని తనతోబుట్టువుగా తెచ్చుకొని అనీక సందర్భాలలో మాయను ప్రదర్శిస్తాడు . మగ బిడ్డను కన్న ప్రతి తల్లి జన్మ పునీత మయ్యేలా కృష్ణుడి బాల క్రీడలు జరుపుతాడు చిన్ని కృష్ణయ్య . ప్రతి తల్లి తన మగ బిడ్డ అల్లరిలో ఆటపాటలలో కృష్ణయ్య ను తలుచుకోకుండా వుండలేదంటే అతిశయోక్తి కాదు . చిన్నప్పుడు తన స్నేహితులతో చేసే అల్లరి, ధైర్య సాహసాలు , విద్యాబుద్దులు నేర్చినపుడు విద్యార్ధిగా , యుక్త వయసుకు వచ్చిన కన్నయ్య గా గోపా బృందముతో ఆడిన సయ్యాటలు , గోపికలపై చూపించిన తామరాకుపై నీటి బొట్టు లాంటి ప్రేమకలాపాలు ,అష్ట పట్టమహిషుల తో ఒక సంసారిగా , అన్నకు బాసటగా నిలిచే తమ్ముడిగా , శత్రువుల పాలిటి సింహస్వప్నంగా , పాండవ హితైషిగా ,అర్జునునకు ఆప్తుడిగా,బావగా, గురువుగా,రాజనీతిజ్ఞుడుగా ,దాత గా,స్త్రీ మానస చోరుడుగా-స్త్రీ మాన సంరక్షకుడుగా ధర్మ రక్షకుడుగా ,గీతా ప్రభోదకుడిగా మోక్ష ప్రదాతగా ,ఆపద్భాందవుడుగా ,పశుపాలకుడుగా, సకల కళా వల్లభుడిగా తన జీవితం లో ఆణువణువూ మనిషిగా ఎలా బ్రతకాలో తెలియచెప్పిన పరమాత్ముడు శ్రీ కృష్ణుడు . 

కృష్ణుడు ప్రబోధించిన గీత ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. బిడ్డగా,అన్నగా, తమ్ముడిగా, హితుడిగా, స్నేహితుడిగా , ప్రేమికుడుగా , భర్తగా,ఆత్మీయుడుగా ఆయన  చూపించిన త్రోవ అందరికి ఆదర్శం కావాలి. జగద్గురువు కు  జన్మదిన శుభాకాంక్షలు . జై జగద్గురు ! హరే కృష్ణ ! హరే కృష్ణ ! కృష్ణ కృష్ణ హరే హరే !!    

26 ఆగ, 2013

మూగజీవి

మూగజీవి 

అమ్మా ! ఆకలిగా ఉందమ్మా ! అన్న పిల్లల మాటకి తల్లడిల్లిపోయింది ఆ తల్లి హృదయం ! పిల్లల కోసం ఏదైనా తేవాలి ,వాళ్ళ ఆకలి తీర్చాలని ఒక వైపు ఆతృత , ఈ సమయంలో బయటకి వెళ్ళితే తిరిగి రాగలనా అన్న ఆందోళన మరొక వైపు !ప్రాణ భయం కన్నా పిల్లలపై ప్రేమే గెలిచింది . ఇటు అటు చూసుకుంటూ బయటకి వచ్చింది ఆ తల్లి . ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళింది . చిమ్మ చీకటి , ఆ చీకటిలోనే వెతుకులాట ప్రారంభించింది . ఎవరో అటుగా వచ్చిన చప్పుడుకి ఒకమూలగా నక్కి నిలబడింది . వచ్చిన వ్యక్తి లైట్ వేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు . అప్పటిదాకా బిగపట్టిన ఊపిరి ఒక్కసారిగా వదిలి అంతకుముందు లైట్ వెలుతురులో తనకళ్ళకి కనబడ్డ ఆహారంవైపు కదిలింది . ఎలాగు పిల్లలకు ఆహారం దొరికింది కదా అని దొరికిన దానిలో కొంత ఆహారాన్ని తను తిని మిగిలినది పిల్లలకు పత్తికెల్దామనుకున్ది  ఆ పిచ్చి తల్లి . ఎందుకో తలతిరుగుతున్నట్టుగా వళ్ళు తూలుతున్నట్టుగా కడుపంతా గాబరాగా అనిపిస్తుంటే గుండె దిటవు చేసుకొని నెమ్మదిగా తన పిల్లల దగ్గరకు అడుగులు వేస్తోంది . ఇంతలో ఏ ప్రమాదాన్నైతే శంకించిన్దొ  ఆ ప్రమాదం కళ్ళ ముందుకి  వచ్చేసింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని భగవంతుడి మీద భారంవేసి ఒక్క గెంతు గెంతి పిల్లల దగ్గరకి వచ్చి పడింది . కానీ ఏదో కీడు జరగబోతుందని పిస్తోంది . తల తిరగడం ఎక్కువైంది . పిల్లలు తల్లి తెచ్చిన ఆహారం కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే అర్థమయ్యింది . తను తెచ్చిన ఆహారం విషమని  తను కాసేపటిలో మరణించ బోతోందని . తన పిల్లలను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్యానికి చింతిస్తూ ప్రాణాలు వదిలింది పాపం ఆ మూగ జీవి ఎలుక . 
             
మనం మనకు హానిచేస్తాయని ప్రాణాలు తీసే ఎలుకలు వాటి జీవనపోరాటం గురించి తలుచుకున్నప్పుడు మనం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో కనీసం వాటి వేదననైనా ఇలా తలుచుకుంటే మనం చేసే  పాపాన్ని కొంతైనా బాధ రూపంలో ప్రక్షాళన చేసుకోవచ్చు కదా అని  నేను పొందిన భావన