17 మే, 2013

నాన్న - ప్రేమ

ప్రేమ -మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యంగా  యవ్వనదశలో  దీనిబారిన పాడని వారు  ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! ప్రేమ తప్పు కాదు కాని ప్రేమ పేరుతొ వ్యామోహంలో పడి జీవితంలో ఎన్నో సాధించవలసిన వాటిని కోల్పోతే,ప్రేమ ఫలించకపోతే అప్పుడు అది తప్పు అనిపించవచ్చు . కాని ప్రేమలో పడినవారికి ఇవేమి  కనిపించవు. 
 రాజేష్ ఇంటర్ ఫెల్ అయ్యి ఇంటిదగ్గరే వున్నాడు. ఆ రోజుల్లో పరిక్షతప్పితే 6 నెలలదాకా ఖాళీగా ఉండడమే . 
పల్లెటూరు కావడం వల్ల ఆమాత్రం చదువుకున్నవాళ్ళు తక్కువే ! ఇంక రోజంతా కాలక్షేపం కోసం రోడ్డుమీద 
కుర్చుని పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ హైస్కూల్ కి వెళ్ళే అమ్మాయిలని కామెంట్ చేస్తుండడం ,జోకులు ,వాద ప్రతివాదనలు ఇలా గడిపివేయ్యడమే !  వయసు ప్రభావం వాళ్ళ పక్కనున్న స్నేహితుల ప్రోత్సాహం వల్ల 
రజియా పై ప్రేమపుట్టుకు వచ్చింది రాజేష్ కి. ఆ అమ్మాయి కూడా రాజేష్ వంక చూడడం,నవ్వడం మరింత  ఆనందాన్ని ఇచ్చింది రాజేష్ కి . రోజు రోజుకి  ఆమె కోసం ఎక్కువ సమయం రోడ్డు దగ్గర గడపడం ,ఎదురుగుండా స్కూల్ కావడంవల్ల ,పల్లెటూరిలో స్కూల్ లో క్లాసులు ఎక్కువగా అరుగులమీదె ఉండడంతో  ఆమెని చూస్తూ  కాలం గడిపేసేవాడు . ప్రేమవిషయంలో  స్నేహితులు ప్రోత్సాహం మంచిదైన చెడ్డదైనా  ఎక్కువగానే వుంటుంది . ఇంకేముంది  ఎలాగైనా ప్రపోజ్ చెయ్యమని ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో  హీరోలా ఫీలయిపోయాడు రాజేష్ . 

  రాత్రంతా కుర్చుని పర పర పేపర్లు చిమ్పుతూ  మొత్తానికి ప్రేమలేఖ రాసేశాడు . ఎలాగైనా  ఈరోజు లెటర్ ఇచ్చెయ్యాలి . ఆమెనించి స్పందన తెలుసుకోవాలి ,ఇప్పటిదాకా ఒకవైపే , తను ఒ.కె. అంటే ఇంకా తనంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు . కులం మతం వేరైనా ప్రేమ ముందు దాని గెలుపు ముందు దేన్నైనా జయించగలననుకున్నాడు . ఇలా వూహించుకుంటూ  లెటర్ని ఫాంట్ జేబులో పెట్టుకున్నాడు . హైస్కూల్ మధ్యాహ్నం పూట వుండడం వల్ల  ఫ్రెండ్స్ తో బతాఖానికి లుంగీ తో రోడ్డుదగ్గరకి వెళ్ళిపోయాడు పొద్దున్నె. కబుర్లతో కాలం గడిచి పోయింది . వాళ్ళ నాన్నన ప్రభాకరం ఆవూరి ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాష్టర్ . మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు .  భార్య భోజనం వడ్డిస్తోంది . పెద్దాడు భోజనానికి వచ్చాడా? అడిగాడు ప్రభాకరం ,వాడు వాడి తిండి , ఎప్పుడో వస్తాడు మీరు తినండి అంది భార్య లక్ష్మి . కాదు వాడిని రమ్మను కబురు చెయ్యి, ఇద్దరం కలిసే చేస్తాం  అన్నాడు ఆయన. చిన్నబ్బాయిని  కబురు పంపింది లక్ష్మి. 

     కబురు అందుకోగానే రాజేష్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి . గబగబా ఇంటికి వెళ్ళాడు , రారా  భోన్చేద్దువుగాని ,ఈ మాటలు వినేసరికి  ఏమిచెయ్యాలో తోచలేదు , వెళ్లి కూర్చున్నాడు , లక్ష్మి వాడికి వడ్డించేసి నువ్వు బయటకు వెళ్ళు  కాసేపు అన్నాడు ప్రభాకరం . ఆవిడకి ఆశ్చర్యంగానే వుంది  ఈయన ప్రవర్తన . కాని ఆయనని ప్రశ్నించే ధైర్యం  లేదు ఆమెకి . 
 లెటర్ ఇచ్చేసావా? ... తండ్రి ప్రశ్న వింటూనే అవాక్కయ్యాడు రాజేష్ , ఎ .. ఏ .. లెటర్ .. నాకేం తెలియదు .. బిత్తరపొతూ  అన్నాడు . నాకు తెలుసుగానీ ... ఇచ్చావా లేదా?  భయపడకు చెప్పు . ఏం చెప్పాలో తోచలేదు . అసలు నాన్నగారికి  ఎలా తెలుసు  అవకాశం లేదు .. అడుగుతున్నది నిన్నే ! తుళ్ళి పడ్డాడు రాజేష్ .. ఇఇ  ఇవ్వలేదు  . సమధానం  ఎలావచ్చిందో తెలియదు . సరే . నేను చెప్పేది శ్రద్ధగావిను  మొదలుపెట్టారు ప్రభాకరం ..  
 ఇప్పుడు లెటర్ ఇస్తావు ,ఆ  అమ్మాయి కూడా   సరే అంటుంది . కలిసి తిరుగుతారు ,దేనికి పరాకాష్ట ఏమిటి? పెళ్లి .. సరే నీ వయసు  18 ఇంకా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే యోగ్యతా రాలేదు , పెళ్లి చేసుకుంటావు ,భార్యకి మూరెడుమల్లె పూలు  కొనాలన్నా నీకు సంపాదన లేదు,సినిమాకి అంటుంది , నాన్నా నా భార్యని సినిమాకి తీసుకువెళ్తాను  10 రూపాయలు ఇవ్వండి అని నన్ను అడుగుతావా? అడగ గలవా? ఇప్పుడు అందంగా కనపడిన జీవితం  , ప్రేమ  అప్పుడు కష్టంగా చిరాకుగా అని పిస్తాయి . అందుకే ముందు నువ్వు యోగ్యుడివి అవ్వు , తరువాత నీకు  నచ్చిన పిల్లని ప్రేమించు పెళ్ళిచేసుకో , ఏకులం ,మతం అని నేను అడగను . అందరి తండ్రుల్లాగా నేను ఆలోచించను  ఒక తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా నేను చెప్పాల్సింది  చెప్పాను  ఆపైన నీ ఇష్టం అంటూ  గబగబా భోజనం చేసి  వెళ్ళిపోయారు . అంతా  విన్న రాజేష్ తండ్రి చెప్పిన మాటల్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తూ  అన్యమనస్కంగానే చెయ్యి కడిగేసుకున్నాడు . అసలు విషయం నాన్నగారికి ఎలాతెలిసింది ? మధన పడిపోతున్న  రాజేష్ కి రాత్రి అమ్మ నాన్నని అడిగిన ప్రశ్న ద్వారా సమాధానం దొరికిన్ది. భోజనానికి కుర్చునేటప్పుడు ఫాంట్ హాంగర్ కి తగిలిస్తుంటే వాడి ఫాంట్ కింద  పడింది ,జేబు బరువుగావుండడం చూసి  కిరాణా బాకీ  ఇంకా కట్టకుండా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా అని చూసాను ,తీర చూస్తే లవ్ లెటర్ , పిల్లలని సరైన సమయంలో సరిగా  మంచి మాటలతో అర్ధమయ్యేలా మలచుకోగలిగితే  వాళ్ళు మానని అర్ధం చేసుకుని మంచి మార్గంలో నడుస్తారు  . అదే కటువుగా కోపంతో నాలుగు కొడితే మొండిగా తయారవుతారు ,టీచర్ గా నా పిల్లవాడిని  చక్కదిద్దుకో గలిగితే  పదిమందిని చక్కదిద్దిన వాడిని అవుతాను .. ఇంటగెలిచి  రచ్చ గెలవమన్నారు . నాకు తెలిసి వాడు జీవిత సత్యాన్ని తెలుసుకుని  మంచి మార్గంలో వెళ్తాడని నమ్మకం . ఈ మాటలువిన్న లక్ష్మి తండ్రిగా పిల్లవాడి  విషయంలో భర్త భాద్యతని చూసి ప్రశాంతంగా నిద్రకుపక్రమించింది . రాజేష్ తండ్రి మాటల్లో సత్యాన్ని గ్రహించి  నాన్న ప్రేమ లో వుండే గొప్పదనాన్ని గ్రహించి  చదువుమీద శ్రద్ధ పెట్టి  తనుకూడా ఒక టీచర్ గా పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు .  నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పది?  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి