24 అక్టో, 2015

ప్రేమంటే-తరువాయి భాగం -3


ప్రేమంటే-తరువాయి భాగం -3
అబ్బాయిలంతా వాళ్లకి కేటాయించిన రూములకి వెళ్ళారు.ఆడపిల్లలు వాళ్లకి కేటాయించిన అవుట్ హౌస్ కి వెళ్ళారు. వారి వెనకే అపర్ణ కూడా వెళ్ళింది.అప్పటికే ఆ అమ్మాయిలందరూ పరిచయమయిపోయారు."రాధికా ..రాధికా ! మద్యాహ్నం ఫీల్డుకి వెళ్ళేప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటావు ? నేను ఏం వేసుకోనూ ? "అంటూ చిన్న పిల్లలా రాధికని అడిగింది కోటేరు ముక్కు ,తెల్లగా మెరుపు తీగలా ఉన్న ఆ అమ్మాయి.స్వరం కూడా వీణ మీటినట్లుంది.
"అలాగే నీలహంసా ! ఇప్పుడే కదా వచ్చాము ,అయినా నీకేమి కావాలో నువ్వు చూసుకోవచ్చు కదా !అదీ నేనే చెప్పాలా!"అంది రాధిక
అదికాదే నువ్వైతే నాకేది నచ్చుతుందో కరెక్ట్ గా చెప్పగలవు.నాకేది ఇష్టమో నాకే తెలియదు"అంది బుంగమూతి పెట్టి నీలహంస.
"ఏమండోయ్ నీలహంసగారు చూడబోతే మీకు కాబోయే వాడిని కూడా మీ ఫ్రెండే సెలెక్ట్ చెయ్యలనేట్టు ఉన్నారే? "అంది అపర్ణ.
అందరూ గొల్లున నవ్వారు.పాపం నీలహంస సిగ్గుపడిపోతూ రాధికని గిల్లుతూ" ఎందుకే ఇంత రాద్ధాంతం చేశావూ ..ఉండు ఇంక నిన్నేమైనా అడుగుతానేమో చూడు "అంది.
"అయ్యో అపర్ణ గారు దానికి ఇంకా అమాయకత్వం పోలేదు.అన్ని నన్నే అడుగుతుంది.తొందరగా చిన్న బుచ్చుకుంటుంది "అందిరాధిక .
" అయ్యో సరదాకి అన్నానండి నీలహంసగారు సారీ "అంది అపర్ణ." ఫరవాలేదండీ "అంది నీలహంస.
అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.ఇంక అపర్ణ కబుర్ల నిండా వాళ్ళ బావ సురేంద్ర మీద అభిమానం ఆప్యాయత కనిపిస్తున్నాయి.ఆమె మాటల ద్వారా సురేంద్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేసేసుకున్నారు అమ్మాయిలు.
మద్యాహ్నం ఒంటిగంట కల్లా భోజనాలకి అందరూ కలిసారు.అప్పుడు అమ్మాయిలు సురేంద్ర ని తేరిపార చూసారు.అపర్ణ మాటల్లో సురేంద్ర ని ఇక్కడ సురేంద్ర ని కంపేర్ చేసుకుంటున్నారు.సురేంద్ర అందరితో కలివిడిగా మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు.రెండు కళ్ళు తననే గమనిస్తున్నాయని గుర్తించలేదతడు .భోజనాలయ్యాయి.మద్యాహ్నం మూడు గంటలకి లెక్చరర్ తొ కలిసి పొలాలవైపు వెళ్ళారు విద్యార్థులు ,కావలసిన నోటుపుస్తకాలు పట్టుకొని. అలా ప్రారంభమైన వాళ్ళ ఫీల్డ్ వర్క్ రోజూ ఉదయం టిఫిన్ల దగ్గర, భోజనాల దగ్గర తప్ప మిగతా సమయమంతా వ్రాసుకొనే పనిలో బిజీ అయిపోయింది .
కాలం విచిత్రమైనది.ఎక్కడెక్కడి వారినో ఒక్కటి చేస్తుంది.గత నాల్గురోజులుగా సురేంద్రకు దగ్గర దగ్గరగా ఉంటూ ఆ రెండు కళ్ళూ అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
5 వరోజు అందరూ టిఫిన్ల దగ్గర ఉన్నారు.సురేంద్ర లేడక్కడ.అందరూ అతనికోసం ఎదురు చూసారు.అప్పటిదాకా కళ్ళతోనే వెదుకుతున్న నీలహంస రాధికతో
" ఏమే అతను రాలేదేమిటీ? ఏమయ్యిందీ" అంది గుసగుసగా
."ఏమో నాకేం తెలుసు.అయినా నీకెందుకే ?"అంది రాధిక.
"అది కాదే రోజూ వచ్చేవాడుకదా అని ,అవును అపర్ణ కూడా లేదే! ఏమయింది "అని ఆత్రత పడిపోతోంది.ఇంతలో రంగారావుగారు "అయ్యో ఇంకా టిఫిన్లు చెయ్యలేదేమర్రా! ఓహో సురేంద్ర కోసమా ! తనకి కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఇంటిదగ్గరే ఉన్నాడు.మా అమ్మ్మాయి వెళ్ళింది చూడ్డానికి.మీరు కానివ్వండి.బాగుంటే అలా పొలాల దగ్గరకి వచ్చేస్తాడు ,మీరు తిని బయలుదేరండి నేను బయటికి వెళ్తున్నాను "అని వెళ్ళిపోయారు .
" అయ్యో ఒంట్లో బాలేదా పాపం" అంది నీల హంస."అవునట సరే రా టిఫిన్ చేద్దాం"అంది రాధిక."లేదే నాకు తినాలనిలేదు నువ్వు తినేయి"అంది నీలహంస".ఏమిటే ఇప్పడి దాకా బాగానే ఉన్నావు కాదే ".
అబ్బే ఏమిలేదే తలనొప్పిగా ఉంది నేను ఈ పూట ఫీల్డ్ కి రాలేను "అంది నీలహంస
.రాధిక పెద్దగా గమనించలేదు."సరే అపర్ణ వస్తే తనదగ్గర ఉండు "అని టిఫిన్ చేసి వెళ్లి పోయిందిరాధిక.(సశేషం)

23 అక్టో, 2015

"ప్రేమంటే " కథ 2 వ భాగం

"ప్రేమంటే " కథ 2 వ భాగం

సురేంద్ర ఆ వూరిలో చదువుకున్న వాడు ,బుద్ధిమంతుడు. ఈ కాలం కుర్రాళ్ళల్లా అల్లరి చిల్లరగా తిరిగే రకం కాదు.ఎప్పుడూ పని, లేదంటే ఏవో పుస్తకాలు తిరగేస్తుంటాడు.
సురేంద్ర కి చిన్నతనంలోనే తల్లితండ్రి చనిపోతే మేనమామ రంగారావు(సర్పంచ్ ) పెంచి పెద్ద చేసాడు.చక్కగా చదువుకున్నాడు.ఏదైనా ఉద్యోగం చెయ్యమంటే లేదు నేను ఈ పల్లెటూరిలోనే ఉండి  వ్యవసాయం చేసుకుంటానన్నాడు.
చదువు పూర్తయ్యాక తన యింట్లో తనే ఉంటూ చేతనైనట్లు వొండుకు తింటుంటాడు.అత్త ఎంత చెప్పినా "ఇన్నాళ్ళూ నిన్ను శ్రమ పెట్టాను కదా అత్తా,నేనేమన్నా చిన్న పిల్లాడినా ,ఏదైనా అవసరమైతే అడుగుతానులే అంటాడు.పోనీలే నాయనా ! చక్కని పిల్లని చూసి పెళ్లన్నాచేసుకో అంటుంది. ఆవిడ మనసులో భావం వేరు. ఎదిగిన కూతురుంది.ఇంతకన్నా బుద్దిమంతుడిని తేలేము.ఉన్నది ఒక్కగా నొక్క కూతురే.ఇంకా సురేంద్ర మనస్సులో ఏముందో తెలియదు.మేనమామ కూతురు అపర్ణ అంటే మంచి అభిమానం.మేనమామకి చేదోడు వాదోడుగా ఉంటూ ఊరందరికీ తలలో నాల్కలా  ఉంటాడు సురేంద్ర.

బయటకి వెళ్ళాక చెప్పారు సర్పంచ్ రంగారావు గారు ఈ పిల్లలకి ఇక్కడ వ్యవసాయ సంబంధమైన కొన్ని విషయాలని తెలుసుకోవడానికి తన మిత్రుడి కాలేజీ నుండి ఇక్కడికి పంపారని, కొద్ది సేపట్లో వాళ్ళ గైడ్ లెక్చరర్ కూడా వస్తారని.వాళ్లకి సహాయంగా నువ్వుకూడా ఉండాలని."సరే" అన్నాడు సురేంద్ర.
మరోగంటకి వాళ్ళు ఇంటికి చేరేసరికి కాలేజ్ పిల్లలంతా చక్కగా తయారయ్యారు.అప్పటికే ఆలస్యమయ్యిందేమో ఆవురావురుమని టిఫిన్లు లాగించేస్తున్నారు.అందరికీ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తున్నారు పనివాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తల్లీకూతుళ్ళు అపర్ణ,భానుమతి గారు.
 ఇంతలో కాలేజ్ లెక్చరర్ నరసింహంగారు  కూడా వచ్చారు.అప్పుడు అంతాకలిసి అక్కడ వాళ్ళు చెయ్యబోయే వారం రోజుల కార్యక్రమం గురించి చర్చించు కున్నారు. సురేంద్ర సహకారాన్ని కూడా కోరారు.ఎలాగూ ఈ పూటకి ఆలస్యమయ్యింది కాబట్టి మద్యాహ్నం మూడుగంటల కల్లా అందరూ ఫీల్డ్ కి వెళ్లాలని నిర్ణయించారు....(సశేషం)

22 అక్టో, 2015

ప్రేమంటే

ప్రేమంటే
ప్రశాంతతకి,ప్రకృతి అందాలకిపల్లెటూళ్ళే పట్టుకొమ్మలు.అలాంటి ఓ పల్లెటూరు.పల్లె ఎప్పుడో నిద్ర లేచింది.సూర్యుడి నునులేత కిరణాలతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ నిద్రలేచాడు సురేంద్ర.ఎంత ఆలస్యంగా పడుకున్నా సూర్యోదయానికి లేవడం అలవాటు.లేస్తూనే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ పొలం వైపు వెళ్ళడం అలవాటు.దారిలో పెద్దవాళ్ళని మర్యాదపూర్వకంగా పలకరిస్తూతనని పలకరించిన వాళ్ళని పలకరిస్తూ వెళ్తున్నాడు.
తనకిఉన్న నాల్గు ఎకరాల పొలంలో కొన్ని కొబ్బరిచెట్లు,మామిడి చెట్లు పెంచుతున్నాడు.రకరకాల కూరగాయలు కూడా పండిస్తున్నాడు. పొలంలోకి వెళ్లి స్వయంగా ప్రతి మొక్కని పలకరిస్తున్నట్టుగా తిరుగుతాడు.ఒక గంట అక్కడ శారీరిక శ్రమ చేసి మరలా ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ గా డ్రెస్ చేసుకొని గ్రామంలో ఉండే లైబ్రేరీకి వచ్చి కాసేపు పత్రికలు తిరగేస్తాడు.అక్కడే ఓ గంట గడిపి మళ్ళా పొలం వైపు వెళ్తాడు.
అలా వెళ్తుంటే ఆరోజు ఒక కాలేజీ బస్ వచ్చి ఆగింది.అందులోంచి బిల బిల లాడుతూ ఓ ఇరవై మంది అమ్మాయిలూ అబ్బాయిలూ దిగారు.దిగుతూనే సురేంద్ర ని చూసి ఒక అబ్బాయి చొరవగా " సర్ మేము వి.వి.ఎం. కాలేజ్ నుండి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాం.ఈ ఊరు సర్పంచ్ గారిని కలవాలి.మీరేమైనా సాయం చేయగలరా"- అన్నాడు. "సరే రండి సర్పంచిగారింటికి వెళ్దాం "అని బయలు దేరాడు
"రాధికా ఉండవే! నా లగేజ్ ఇంకా బస్ లోనే ఉంది. బస్ మళ్ళీ వెళ్లి పొతుందిగా ! ఒక్క నిముషం ఆగవే !" అంటూ ఒక అమ్మాయి అరిచింది."ఉన్నానే బాబూ ! మనం వచ్చింది పట్నానికి కాదు పల్లెటూరికి.బెంగ పడకు నెమ్మదిగా వెళ్ళచ్చు త్వరగా దింపుకో లగేజ్" అంది రాధిక
టీనేజ్ లో ఉన్న ఆపిల్లల్ని చూస్తుంటే స్వేచ్చగా ఎగిరే సీతాకోక చిలుకలని చూసినంత ఆహ్లాదంగా ఉంది.ఇందాకా పలకరించిన అబ్బాయితో "అవును ఇంతకీ నీ పేరు చెప్పలేదు ?అన్నాడు సురేంద్ర .
సారీ సార్ !నా పేరు విజయ్ .మేమంతా ఇక్కడ అగ్రికల్చర్ సైన్స్ సంబంధించి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాము. మా ప్రిన్సిపాల్ గారికి మీ సర్పంచ్ గారు బాగా తెలుసట అందుకే లెటర్ ఇచ్చి పంపారు.ఇంతకీ మీ పేరు సర్ ... అన్నాడు ఆ అబ్బాయి.
ఓ.కే. విజయ్ నా పేరు సురేంద్ర.అదుగో సర్పంచ్ గారి ఇంటికి వచ్చేసాం.అంటూ మావయ్యా ..మావయ్యా అని గట్టిగా పిలిచాడు సురేంద్ర
"ఏరా ! ఏమిటి ఇలా దారితప్పి వచ్చావు? ఈ టైములో పొలంలో కదా ఉంటావు?"అంటూ ఓ 50 ఏళ్ల ఆసామి బయటికి వచ్చాడు.సాదాసీదాగా పంచెకట్టు కట్టుకొని బుర్ర మీసాలు సవరించుకొంటూ వస్తున్న ఆయన్ను చూసి అందరూ నమస్తే సార్ అన్నారు.
"ఓహో ఆదా సంగతి ఈ పిల్లకాయలు నీకు తగిలారు కాబట్టి ఇలా వచ్చావన్నమాట.అంతా బాగున్నారా బాబూ! మా రాజశేఖరం చెప్పాడు పిల్లకాయల్ని పంపుతున్నానని.మీరే అన్నమాట.సరే మీరిక్కడ ఉన్నన్నాళ్ళు మీ సొంత ఇల్లే అనుకుని ఉండండి.దేనికీ లోటు లేదు ఆడ పిల్లలు అదుగో ఆ కుడిపక్కనున్న ఇల్లు వాడుకోండి .మీకు సౌకర్యంగా ఉంటుంది.మగ పిల్లలు పక్కనే పంచాయతీ ఆఫీసు ఉంది అందులో నాల్గు గదులున్డాయి.అందులో సర్దుకోండి.ఇక కాఫీలు టిఫిన్లు అన్ని ఇక్కడికే వచ్చి చెయ్యల.స్నానాలకి అక్కడే ఏర్పాట్లున్నాయి.మరి ముందుగా కాస్త కాఫీలు పుచ్చుకొని అప్పుడు మీ గదుల్లోకి చేరండి" అని చెప్పి
"ఒరే పేరిగా ఈల్లందరికీ కాఫీలు తెచ్చి ఇయ్యరా ..అని" చెప్పు సురేంద్రా ఇంకేటి విశేషాలు రా అలా పొలానికి వెళ్తూ మాటాడుకుందాం"అని బయలు దేర దీసాడు.అందరూ థాంక్ యు సర్ అని సురేంద్ర కీ సర్పంచ్ గారికీ ఎంతో ఆనందంగా నమస్కరించారు.మీరు రెడీ అవండి మేము అలా వెళ్లి వస్తాము.అన్నారు సర్పంచ్ గారు (సశేషం )
Top of Form