24 మార్చి, 2013

స్వాతంత్ర్యమా నీవెక్కడ?

స్వాతంత్ర్యమా నీవెక్కడ?
ఎందరో త్యాగధనుల ఆశల ఫలానివై ,
అరవై ఆరేళ్ళ క్రితం జన్మించిన నీకు 
బాలారిష్టాలెన్నో !
ఆదిలోనే మత చందసం 
నీపై అక్కసు వెళ్ళగక్కింది 
బాపూజీ కళల సాకారానికి 
నెహృజీ నడుం కట్టి 
 నీకు నడక నేర్పితే 
వడివడిగా పరుగుపెడుతున్న నిన్ను చూసి 
ఇరుగుపొరుగుల ఈర్శ్యా ద్వేషాలకు 
నీకు తగిలిన గాయాలెన్నో !
యవ్వనాన అడుగిడిన నీ సౌందర్యానికి  ముగ్దులై
నీతో స్నేహానికి అర్రులుచాచిన వారెందరో !
అందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 
బాధ్యతల బరువుతో జీవితాన్ని గడుపుతూ 
మున్ముందుకు సాగుతూ 
స్వాతంత్ర్యమంటే  ఇదే 
ఆ ఫలాలు భావితరాలకు అందుతాయనుకుంటే ,
స్వార్థ రాజకీయాలతో, వేర్పాటు వాదాలతో 
కులాల కుళ్ళుతో,మతాల మత్సరంతో 
నీవంటి నిండా రోగాలను అంటగట్టి ,
కత్తులతో కుళ్ళ పొడిచి ,తూటాలతో తూట్లు పొడిచి 
నిను చంపేస్తారని భయపడి 
ఎక్కడికో పోయావా! 
ఒద్దు తల్లీ ఒద్దు !!
నువ్వు భయపడవద్దు!
ఈ తరం బాలలు నీ గాయాలకు మందు పూసి ,
నీ ఆశయాలకు ఊపిరులూది 
శాస్త్ర సాంకేతిక పరిజ్క్షానమ్ తో 
నీ చిద్రమైన శరీరాన్ని మరలా పునరుజ్జీవింప చేస్తారు 
నీ రుణం తీర్చుకుంటారు .  

ఊహ -నిజం

జీవితం గురించి ఎన్నికలలో !
ప్రకృతి లో పరవశమై పవ్వళించడం 
వెండి గిన్నెలో పెరుగన్నం 
వెండి వెన్నెల ఆస్వాదనం 
మల్లెపందిరి నీడలో 
మది దోచిన కాంతతో ఏకాంతం !
కానీ నిజ జీవితం !
నిశీధి ముసుగు తీయడం తో మొదలై 
నిశీధి దుప్పటి కప్పుకొని గురక పెట్టాకే 
ఇంటికి చేరడం !
కంటికి నిదుర కరువై 
కడుపుకి ఆకలి ఘనమై 
 పక్క పై దోమల సాంగత్యంతో 
తెల్లవారడం !

అనుకున్నా - అనుకుంటున్నా


చిన్నతనంలో  వానాకాలంలో
చిన్ని చిన్ని కాల్వలలో 
కాగితం పడవలు వేస్తూ 
అవి మునిగినా తేలినా 
ఉల్లాసంగా కేరింతలు కొట్టడమే 
జీవితం అనుకున్నా 
కానీ పెద్దతనంలో 
బాధ్యతల సుడిగుండాలలో 
జీవితమనే ఈ పడవను 
మునగకుండా సురక్షితంగా 
ఎలా దరికి చేర్చాలో తెలియక 
జీవితం గురించి తెలుసుకోవాలని  అనుకుంటున్నా   

17 మార్చి, 2013

బంధాలు-అనుబంధాలు


తల్లి కడుపులో ఊపిరులు పోసుకున్నది మొదలు ఈ భూమితో మనుషులతో ప్రకృతి తో జీవికి అనుబంధం ఏర్పడుతుంది. తన తల్లి కడుపులో వున్నా ప్రకృతిలో వుండే వాతావరణం బిడ్డ పై ప్రభావాన్ని చూపుతుంది . పెరుగుతున్న బిడ్డ పై తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ ఇలా అందరు అనుభందాన్ని పెంచుకుంటారు . బిడ్డ భూమి మీద పడిన దగ్గరినించి మరింతగా బంధాలను పెంచుకుంటాడు . రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ ఇవి మరింత పెరుగుతాయి . ఇరుగు పొరుగువారు, బదువులు, స్నేహితులు ఇలా కొత్త కొత్త బంధాలను పెంచుకుంటాడు . వేలు పుచుకుని నడిచే స్థాయి నుంచి వేలు విడిపించుకుని నడవాలనే స్థాయికి వస్తాడు అక్కడి నుండి నేను నాది అనే భావనతో ముందుకు వెళతాడు . నెమ్మదిగా ప్రేమ వైపుకి మరలుతాడు . పెంచిన తల్లి తండ్రి వీళ్ళకన్నా ప్రేమించిన వారితోనే తన అనుబంధాన్ని పెంచుకుంటాడు . అక్కడి నుండి కొత్త లోకంలోకి అడుగు పెట్టి అక్కడ మరికొన్ని కొత్త బంధాలను ఏర్పరచుకుంటాడు . తనకంటూ ఒక కుటుంబం , మరల తన భార్య పిల్లలు  మరో కొత్త బంధాని కి తెరతీస్తాడు . ఇలా ఇన్ని బంధాలు ఏర్పరచుకున్న మనిషి ఒక్క క్షణం లో అన్నిటిని తెంపుకొని పోతాడు .  ఈ ప్రకృతిగాని తల్లి తండ్రులు గాని బంధువులు గాని స్నేహితులుగాని ఎవ్వరిని పట్టించుకోకుండా నిర్వికారంగా నిస్తేజంగా వెళ్ళిపోతాడు . మిగిలినవాళ్ళు మాత్రం ఆ బంధాలను అనుబంధాలను తెంచుకోలేక పోయిన వారికోసం శోకిస్తూ వుంటారు . ఎంతైనా బంధాలకు అనుబంధాలకు బందీలం కదా! 
నా ఆత్మీయులైన వారిని ఒక్కొక్కరిని కోల్పోయినప్పుడు నా మనసులో కలిగిన భావాలివి. పుట్టిన వాడు మరణించక తప్పదు కానీ ఒక్క ఏడాది లో 5గురు ఐన  వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలావుంటుందో అనుభవించి వ్రాస్తున్న భావాలు .     

16 మార్చి, 2013

స్వాతంత్ర దినోత్సవం


బక్క పేగుల డొక్కలంటిన 
బడుగు బ్రతుకు  జీవుడా  
ఒక్కసారిగా చుక్కలంటేను 
ధరలజండా చూడరా!

జాతి జాగృతి జరిగెనంటు 
జండా లాగెను నేడురా!
మధ్యతరగతి బ్రతుకులంటు 
బండిలాగర సోదరా!

సిలుకు చొక్కా దొరలచేతుల 
నలిగిపోయిన తమ్ముడా 
చిలుకపలుకులు పలుకుతున్న 
దొరల బ్రతుకులు చూడరా!

తిండి కలిగితే కండ కలదని 
పెద్దలన్నా మాటరా 
కలిగినోడే తిండితింటే
 ఎంగిలాకులే మిగిలెరా 

నేడు భారతి భగ్న హృదయం 
భగ్గుమన్నది చూడరా 
భావి యువతకు భరత ఖండం 
బుగ్గి బూడిద బాటరా!

 


13 మార్చి, 2013

గిరిజన ప్రాంతం


తూర్పుగోదావరి జిల్లాలో 7మండలాలు గిరిజన ప్రాంతంగా గుర్తించ బడ్డాయి . అడ్డతీగల,రంపచోడవరం,రాజవొమ్మంగి,మారేడుమిల్లి ,దేవీపట్నం,గంగవరం,వై రామవరమ్. ఈ ప్రాంతమంతా కల్మష రహితమైన ప్రకృతికి,మనసులకు నిలయమ్. ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో అడ్డ తీగలకు దగ్గర లో 4కి. మి. దూరంలో పింజరి కొండ జలపాతం ఒకటి . ఇక్కడ n.t.r. పాదుకా పట్టాభిషేకం అనే సినిమా తీసారు,ఇంకా చిరంజీవిశోభన్ బాబు సినిమాలుకూడా ఈ ప్రాంత అందాలను తెరకెక్కించారు. ఇంక రంపచోడవరం దగ్గరలో రంప అనెఅ ఊరు వుంది,ఇక్కడ కొండపైశివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతున్ది. ఇక్కడకూడా జలజల జారే జలపాతాలు కోకల్లలు . ఇంక మారేడు మిల్లి గురించి వర్మగారు పోస్ట్లో చూసాం . వనసంపద కి గని ఈ ప్రాంతం . శివరాత్రికి గిరిజనప్రాంతం లో చాలా చోట్ల ఘనంగా ఉత్సవాలు చేస్తారు . నీను పుట్టిన వూరు దుప్పులపాలెం . నాన్నగారి ఉద్యోగ రీత్యా 1963 నుండి ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో గిరిజనులకి చాలామందికి ఏది ఎలా తినాలో తెలియదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మేమే.పనసకాయని పచ్చి గా వుండగానే కోసి తొనలు తీసి ఒక కుండలో వేసి ఉప్పు కారం వేసి ఉడికించేవారు. ఉడికాక తినెవారు. సీతాఫలం ఐతే పరువుకి వచ్చిన కాయలు ఆకులలో చుట్టి మంటలో వేసి కాల్చెవారు. ఇలా వారి ఆహారపు అలవాట్లు వుండేవి . చేపలని పట్టుకొని నిప్పులో కాల్చుకొని తినేవారు నెమ్మదిగా వారు నాగరికత వైపు అడుగులు వేస్తున్నారు . ఆ పచ్చని అడవులలో హాయిగా ఆనందం గా గడిపే వాళ్ళం . ఇలా ఎంత రాసినా నేను పుట్టిపెరిగిన ప్రాంతం గురించి తరగదు, తనివి తీరదు ... మీ అందరి ప్రోత్సాహం తో వ్రాయడానికి సాహసించాను . తప్పులుంటే సరిదిద్ది నన్ను ముందుకి నడిపిస్తారని ఆశిస్తూ   


11 మార్చి, 2013

కవిత నిద్దరోయింది



ఇన్నాళ్ళూ కవిత నిద్దరోయింది 
నేడు కలత నిద్దురలో లేచింది 
జగతిని జాగృతం చేయాలని 
చేతిలోవున్న కలాన్ని ఝళిపించి 
సిరాలో ముంచి శివమెత్తిమ్చి
శరపరంపరలా  పరపరా రాసేసి 
ఆకలి తీర్చుకొని ఆవులిస్తూ 
హాయిగా ఇన్నాళ్లు  కవిత నిద్దరోయింది   

సాగాలి ఈ పయనం



చెలిమి కలంలో మేలిమిముత్యాలు 
అక్షర సరాలుగా అభిమానధనాలుగా 
నా అణువణువులో పులకింతలు రేపి 
నా హృదయం లో చెలిమి సెలయేరులు 
లావణ్య నిదులై కారుణ్య నదులై 
హిమనదాల స్నేహ ప్రవాహంలా 
జీవన గమ్యం కడలి చేరేవరకు 
జీవనదిలా మాలిన్య రహితమై 
మనుగడ సాగిద్దాం 

9 మార్చి, 2013

కొవ్వొత్తి

కరిగి పోతాను కాలం కౌగిలిలో 
మిగిలిపోతాను వెలుగునై జిలుగునై 
నేనున్నంతవరకు ఈధరిత్రిలో 
మలిగి పోతాను కడసారి నీ సేవలో 
               
సాహితీసరాలు పేరుతో నా బ్లాగుని ప్రారంభిస్తున్నాను. నా బ్లాగుకు స్వాగతం.