24 మార్చి, 2013

స్వాతంత్ర్యమా నీవెక్కడ?

స్వాతంత్ర్యమా నీవెక్కడ?
ఎందరో త్యాగధనుల ఆశల ఫలానివై ,
అరవై ఆరేళ్ళ క్రితం జన్మించిన నీకు 
బాలారిష్టాలెన్నో !
ఆదిలోనే మత చందసం 
నీపై అక్కసు వెళ్ళగక్కింది 
బాపూజీ కళల సాకారానికి 
నెహృజీ నడుం కట్టి 
 నీకు నడక నేర్పితే 
వడివడిగా పరుగుపెడుతున్న నిన్ను చూసి 
ఇరుగుపొరుగుల ఈర్శ్యా ద్వేషాలకు 
నీకు తగిలిన గాయాలెన్నో !
యవ్వనాన అడుగిడిన నీ సౌందర్యానికి  ముగ్దులై
నీతో స్నేహానికి అర్రులుచాచిన వారెందరో !
అందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 
బాధ్యతల బరువుతో జీవితాన్ని గడుపుతూ 
మున్ముందుకు సాగుతూ 
స్వాతంత్ర్యమంటే  ఇదే 
ఆ ఫలాలు భావితరాలకు అందుతాయనుకుంటే ,
స్వార్థ రాజకీయాలతో, వేర్పాటు వాదాలతో 
కులాల కుళ్ళుతో,మతాల మత్సరంతో 
నీవంటి నిండా రోగాలను అంటగట్టి ,
కత్తులతో కుళ్ళ పొడిచి ,తూటాలతో తూట్లు పొడిచి 
నిను చంపేస్తారని భయపడి 
ఎక్కడికో పోయావా! 
ఒద్దు తల్లీ ఒద్దు !!
నువ్వు భయపడవద్దు!
ఈ తరం బాలలు నీ గాయాలకు మందు పూసి ,
నీ ఆశయాలకు ఊపిరులూది 
శాస్త్ర సాంకేతిక పరిజ్క్షానమ్ తో 
నీ చిద్రమైన శరీరాన్ని మరలా పునరుజ్జీవింప చేస్తారు 
నీ రుణం తీర్చుకుంటారు .  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి