15 మే, 2013

ఎదురుచూపు

పెళ్లి అనగానే  ఆడపిల్ల మనసులో  కోరికలు పురివిప్పిన నెమలిలాగ నాట్యమాడుతాయి. శ్రావణి కూడా సగటు ఆడపిల్ల లాగే పెళ్లి కలలు  కంటోంది .  చిన్నాన్న తీసుకువచ్చిన సంబంధం ,పిల్లాడు అందగాడు ,సంపాదనాపరుడు,చదువు తక్కువే ఐనా వేద పండితుడిగా  గౌరవమర్యాదలు పొందుతున్నవాడు. కుటుంబం సాంప్రదాయ మైనది . మీదుమిక్కిలి అత్తగారు చాలా మంచిది . ఇంతకుమించి ఏ ఆడ పిల్లైనా కోరుకునేది ఏముంటుంది ? అమ్మ నాన్న ముందు ఒప్పుకోపోయినా అన్ని ఆలోచించి ఒ.కె. చెప్పారు .తాతగారు కాలం చెయ్యడం వల్ల పెళ్లి ,నిశ్చితార్ధం ఆగష్టు వరకు పెట్టుకోలేదు . కానీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి 
అనుమతి ఇచ్చారు పెద్దలు . ఇంకేముంది సెల్ ఫోనులో చాటింగులు  మెస్సేజ్లు . కాలం భారంగా గడుస్తుందని అనుకుంటే వేగంగానే గడుస్తోంది . 

                పెళ్ళికి కావలసిన చీరలు వస్తువులు ,పెళ్లి ఎలాచేయ్యాలి ,ఎక్కడ చెయ్యాలి అనే విషయాలలో  అమ్మ నాన్న తలమునకలు ఔతుంటే ,చీర ఎలా సింగారించుకోవాలో,అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో ,వంట ఎలా చేసి 
అత్తవారింట్లో మెప్పు పొందాలో ఇలాంటి విషయాలలో  శ్రావణి అమ్మని, నానమ్మని ,అత్తని పిన్నిని అడిగి నేర్చుకుంటోంది . ఇంతలో పెళ్ళివారి నుండి కబురు వచ్చింది వైశాఖం లో  నిశ్చితార్ధం పెట్టుకుందామని . తర్జన భర్జనల అనంతరం తాంబూలాలు ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకునేలా ఒ.కె  చెప్పాడు పిల్ల తండ్రి రామకృష్ణ . పనులు చక చక జరిగిపోతున్నాయి . పిలుపులు అందరికి అందేసాయి . మధ్యతరగతి కుటుంబమైనా ఒక్కగానొక్క ఆడపిల్ల నిశ్చితార్ధం ఏలోటు లేకుండా ఉన్నంతలో ఘనంగా చేయాలని అందరిని పిలుచుకున్నాడు రామకృష్ణ . 

                 ఇంతలో మళ్ళి పిలుపు వచ్చింది పెళ్ళికొడుకు తండ్రికి అనారోగ్యంగా వుందని ,నిశ్చితార్ధం  ఆగష్టులోనే 
పెట్టుకుందామని . ఈ సమస్య వస్తుందని అనుకుంటూనే వున్న రామకృష్ణ సరే అలాగే అన్నాడు . మళ్ళా అందరికి ఫోన్ చేసి కార్యక్రమం వాయిదా పడిందని చెప్పుకునే సరికి తాతలు దిగివచ్చారు రామకృష్ణకి . ఆఖరి ఫోన్ చేసి ఇంకా అందరికి చెప్పేసాం కదా ,ఇంకేవారిని మర్చిపోలేదు కదా అని భార్యని అడుగుతుండగా  ఫోన్ మోగింది . పెళ్లి కొడుకు బావగారు ... విషయం విని ఏమిచేయాలో పాలుపోలేదు రామకృష్ణకి . కాబోయే వియ్యంకుడి మరణవార్త ,ఆయన మరణం ఒకపక్క ,ఏడాది వరకు పెళ్లి వాయిదా పడిందనే బాధ ఒకపక్క. చిన్నబోయిన కూతిరి ముఖాన్ని చూసి ధైర్యం చెప్పడం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి . అంతా మనమంచికే ,ఆపేసిన చదువు కొనసాగించు  అని తండ్రి అంటే కాబోయే భర్త కూడా ఒక్క ఏడాదే కదా అందాక అక్కడే పీజీ లో జాయిన్ అవ్వు ఫై ఏడాది ఇక్కడ కంటిన్యు చేద్దుగాని  అనడంతో  ఏడాది కాలాన్ని ఎదురుచూపులతో గడపడానికి సిద్ధమయ్యింది శ్రావణి ......     
              
              

2 కామెంట్‌లు: