5 జూన్, 2015

ఏమి తెలుసు ...



ఏమి తెలుసు .......

ఉదయానికి ఏమి తెలుసు చీకటిరాబోతుందని?
జననానికి ఏమితెలుసు మరణం పొంచి వుందని ?
పచ్చని పైరు కేమితెలుసు గొంతుకోయబడుతుందని ?
కెరటానికి ఏమి తెలుసు ఎగిసి కిందపడుతుందని?
జాబిల్లికి ఏమితెలుసు అమావాస్య అలుముకుంటుందని ?
గగనానికి ఏమితెలుసు నల్లమబ్బు కమ్ముకుంటుందని ?
అందానికి ఏమితెలుసు వార్ధక్యం వాటేస్తుందని ?
పూలబాలకేమితెలుసు చిరునగవు వాడిపోతుందని?
భూమాతకుఎమి తెలుసు గుండె చీలిపోతుందని?
వృక్షానికి ఏమితెలుసు ఆణువణువూ అంకితమివ్వాలని?

ధరిత్రీ -క్షమా దాత్రీ

ధరిత్రీ -క్షమా దాత్రీ ( నేడు పర్యావరణ దినోత్సవం )

కన్నబిడ్డలపై ఎంత కనికరమమ్మా
నీ వంటినిండా చెత్త చెదారాలు నింపుతున్నా
నీశరీరం లో రసాయనాలు నింపుతున్నా
నీ స్తన్య సమానమైన నదీజలాలు కలుషితం చేస్తున్నా
నీ పచ్చదనాల ఆభరణాలు చెట్లను నాశనం చేస్తున్నా
నీ రోమ్ములనే పర్వతాలను చిదిమి చిద్రం చేస్తున్నా
చూస్తూ ఎలా భరిస్తున్నావు తల్లీ ?
క్షమయా ధరిత్రీ అన్నారు గానీ ఇంత క్షమ అవసరమా ?
నీక్షమా గుణాన్ని అలుసుగా తీసుకుంటున్నారు
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు
నువ్వు కన్నెర్రచేస్తే భూకంపాలు ,ప్రళయాలు వస్తాయని తెలుసు
ఐనా మానవాళికి నీ విలువ తెలియకుంది ముప్పు పొంచి వుంది
మరొక్కసారి క్షమించు తల్లీ ! కళ్ళు తెరుచుకునేలా చెయ్యి