11 సెప్టెం, 2014

పెళ్ళంటే ......

పెళ్ళంటే .....


పెళ్ళంటే నూరేళ్ళ పంట . ప్రతి ఆడపిల్లా కలలుకనే బంగారు జీవితం . ఎన్నో ఆశలతో  అత్తవారింట అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లా కొద్ది రోజులు అక్కడి వాతావరణానికి సద్దుకోవడం కష్టమే అవుతున్ది. అపురూపంగా పెంచుకున్న ఆడపిల్ల అత్తవారింటిలో ఏ కష్టాలు పడకూడదని మగ పెళ్ళివారు అడిగినదేది కాదనకుండా స్తోమతకి మించి చేస్తారు ఆడపిల్ల గలవాళ్ళు. కానీ ఆడపిల్ల ఆయుధంగా దొరికింది కదాని వియ్యాలవారిని అవమానాలపాలు చేస్తారు మగ పెళ్లి వారు . అక్కడికి ఆడపిల్లని కనడం తప్పైనట్లు ఆ అత్తగారొక ఆడది కాదన్నట్లు,తనకి ఆడపిల్లలు ఉంటె వాళ్ళుమాత్రం ఎక్కడినించో దిగివచ్చినట్టు భావిస్తుంటారు . ఎందుకీ వ్యత్యాసం? కోడలు కొడుకు సంతోషంగా వుంటే చూడలేనివాళ్ళు మరి ఆ కొడుక్కి పెళ్ళెందుకు  చెయ్యాలి. కన్న బిడ్డలా చూసుకుంటామని చెప్పి కంటకంగా ఎందుకు చూడాలి ? జీవితంలో తనకో తోడు  దొరికిందని  ఆనందించాలా ? పెళ్ళితో తనవాళ్ళ బంధాలన్నిటిని తెగతెంపులు చేసుకోవలసి వస్తున్నందుకు బాధ పడాల ? పెళ్ళంటే రెండుకుటుంబాల మధ్య బంధం . ఆప్యాయతా అనురాగాల మేళవింపు . పుట్టింటి నుంచి అందరినీ వదులుకొని వచ్చిన కోడలిని అమ్మగా అక్కున చేర్చుకొని తన కుటుంబాన్ని వృద్ది చేయడానికి వచ్చిన ఆడపిల్లని ప్రేమతో తనకు అనువుగా మలచుకొని పుట్టింటికి దూరమయ్యాననే భావన కలగ కుండా  చూడవలసిన బాధ్యత అత్తగారి పై ఉన్తున్ది. మరో ఇంటికి కోడలుగా వెళ్ళిన ఆడబిడ్డ తన జీవితంలో ఏవైనా కష్టాలు వుంటే అవి తన వదినగారికి రాకుండా చూసుకోవాలి .భర్త అన్నీవదలుకొని తనతో నూరేళ్ళ జీవితం పంచుకోడానికి వచ్చిన భార్య మాటకు కూడా విలువనిచ్చి తల్లీ భార్యా అరమరికలు లేకుండా ఉండేలా చూసుకోవాలి . ఎంతమంది కోడళ్ళు ఇలాంటి మానసిక వేదన అనుభవిస్తున్నారో ! ఆ ఆడకూతుళ్ళకి ఓర్పు సహనంతో ఉంటూ  భర్త ప్రేమని అత్తా ఆడపడుచుల ఆప్యాయతలని పొందేందుకు ఎదురుచూడమని, నిరాస నిస్పృహలకు లోను కావద్దని కన్నీటితో వేడుకొంటున్నాను . పెళ్ళంటే ఇదేనా ... అని ఆవేదన చెందవద్దు . పెళ్ళంటే ఒక నమ్మకం ఒక అనుబంధం ఒక ఆప్యాయత ఒక్కొక్క ఇటుక పేర్చుకొంటేనే అందమైన భవనం  తయారవుతుంది 
 .   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి