13 నవం, 2013

పుట్టిందొక శాంతి కపోతం

పుట్టిందొక  శాంతి కపోతం 

పుట్టిందొక శాంతి కపోతం 
ఎగిరింది  నింగిలోన శ్వేత  కేతనం

భరతమాత కన్న బిడ్డ జవహరాయెను 
భారతావని పులకించి మురిసిపోయెను
 రత్నమంటి బిడ్డనిచ్చి భరత రత్న మాయెను
పంచశీల సూత్రమిచ్చి ధన్యజీవిఆయెను ॥ పుట్టిందొక ॥ 

బాలలన్న అతనికెంతో  మక్కువాయెను 
గులాబులన్నమరిఎంతో ప్రీతి ఆయెను
సత్యమునే ధర్మమని చాటిచెప్పెను 
చాచాజీ నెహ్రుయై మన మదిని నిలచెను॥ పుట్టిందొక  ॥ 

మమత సమత మానవతని మనకు నేర్పెను 
భరతజాతి జాగృతికై పోరుసల్పెను 
భయములేని సైనికుడై ముందుకురికెను 
శాంతి దూతయై ఆతడు ఖ్యాతి నొందెను ॥ పుట్టిందొక ॥ 

14 సెప్టెం, 2013

శీర్షిక మీదే

శీర్షిక మీదే

దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి . మన దేశ ప్రధాని రాజధాని విశాఖపట్నంలో డాల్ఫిన్స్ హిల్స్ పై ఎప్పటిలాగే సప్తవర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేసించి ప్రసంగించ నున్నారు. ప్రతివారు తమతమ అండర్ గ్రౌండ్ డెన్ ల నుండి ఈ కార్యక్రమాన్ని మైక్రో టాప్ లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని శాటిలైట్ న్యూస్ ఇప్పుడే వెలువడింది . ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించడానికి ఆటో సోలార్ ప్రొటెక్టెడ్ కాప్సుల్స్ ద్వారా తెల్లవారుఝామున 5గంటలనుండి 6 గంటలవరకు ఆకాశం లో వుండి  వీక్షించవచ్చని, ప్రధాని హయ్ ప్రొటెక్టెడ్ మోనో కాప్సుల్  లో వచ్చి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగం చేస్తారు . కోస్తా దేశ  పౌరులందరూ కార్యక్రమానికి రావాలనుకుంటే తమతమ రక్షణ తో తామే రావాలని తప్పనిసరిగా సరిపడా ఆక్సిజన్ కూడా తెచ్చుకోవాలని రద్దీ కారణం గా  స్కై ఆక్సి టెర్మినల్స్ వద్ద సరిపడా ఇంధనం ఉండక పోవచ్చునని ,అత్యవసర సేవల కోసం 801 బజర్ సర్వీసెస్ కి బజార్ పంపవలసిందని తెలియ చేయడమైనది . దీనితో పాటు కాకినాడ రాజమండ్రి శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ,తుని పెద్దాపురం మొదలైన రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెండా ఎగురవేస్తారని తగిన ఏర్పాట్ల పర్యవేక్షణ ,ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయని ప్రధాని తెలియ జేశారు . కోస్తా దేశం ఈ సందర్భంగా కాకినాడ నుండి కొన్నిప్రాంతలను వేరుచేస్తూ సముద్రగర్భ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ మంగళం పార్టీ అధ్యక్షురాలు రోబో చండీ గారు ప్రకటించారు . సముద్రగర్భ రాష్ట్రానికి కాకినాడ కేంద్రం గా ఉంటుందని సముద్రం మీద జీవించే వాళ్ళ పెట్టుబడితోనే కాకినాడ అభివృద్ధి చెందిందని కాబట్టి కాకినాడ లో కాకినాడ ప్రజలెవరికి హక్కులు లేవని కావాలంటే హొప్ ఐలాండ్ లో ఏ ప్రాంతన్ననియా కాకినాడకి రాజధానిగా చేసుకోవచ్చని దీనిపై ఎవరు ఏ అభ్యంతరాలు చెప్పరాదని ప్రకటించడమైనది . కాకినాడ రాష్ట్ర ప్రజలు ఆందోళన బాట పట్టనున్నారు . (కోస్తా దేశం 2037 డిసెంబర్ 31 న ఏర్పడింది ,కోస్తా దేశం రాజధానిగా విశాఖపట్నం ,మిగిలిన ప్రముఖ నగరాలన్నీ రాష్ట్రాలుగా 2038 జనవరి 1 న ఏర్పడ్డాయి . సముద్రగర్భ రాష్ట ఏర్పాటు నిర్ణయాన్ని 2047 డిసెంబరు 30 న వెలువడింది .) మన కోస్తా దేశానికి పొరుగున వున్న ఒరిస్సా దేశం కృష్ణ గుంటూరు దేశం తో రక్షణ సంబంధాలను మెరుగు పరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు . తెలంగాణా దేశాన్ని పాలకులు ముక్కలు ముక్కలుగా చేసి  పోరుగుదేసాలకు అమ్మేసుకుని పోరుగుదేసాలలో కర్రీ పాయింట్లు,టిఫిన్ సెంటర్ లు పెట్టుకుని బతుకుతున్న్నారు  . ప్రజలు మాత్రం రాయలసీమ కోస్తా దేశాలలోని తమ పూర్వీకులతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు  ఈ రెండు దేశాలలో ప్రజలు సముద్ర గర్భ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పై తమ పూర్వ అనుభవాన్ని  గుర్తుచేసుకుని విడిపోతే జరిగే నష్టాల గురించి వివరించారు . 
(నోట్ : ఇది కేవలం రాష్ట్ర విభజన పై ఆవేదనే కాని ఎవరిని కించ పరచాలని కాదు )   

29 ఆగ, 2013

ఏమి జరుగుతోంది

ఏమి జరుగుతోంది 

త్యాగధనుల కలల రూపమా 
చారిత్రక కళల అపురూపమా 
సంస్కృతీ సాహిత్య ప్రాభవమా 
సమతా మమతల మాతృమూర్తి 
భాషా ప్రయుక్త రాష్ట్రానివిగా 
తొలితాంబూలం అందుకున్నదానివి 
 ఆంధ్రమాతగా ,తెలుగు తల్లిగా 
అ గ్ర తాంబూలం అందుకున్నదానివి 

ఇన్నేళ్ళలో ఏ సామాన్యుడు 
నేను తెలంగాణా వాడినని,
నేను  రాయల సీమ వాడినని
కోస్తా వాడినని ఎప్పుడూ అనుకోలేదు
విడిపోవడమంటే మనసులు
ముక్కలు చేసుకోవడమేనని
కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమేనని
అనాదిగా మానవుడు నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం

కానీ ఇప్పుడేమిటి తల్లీ నీ కళ్ళముందే
కాపురాలు కుల్చాలనే కుళ్ళు ఆలోచనలు
కడుపుకింత తినడానికి తిండి దొరకాలన్నా
తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకాలన్నా
కలిసుంటేనే కలలు సాకారమని
రాబోయే తరాలతలరాతలు మార్చాలనుకునే
ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు తెలియదా
నేటి బిడ్డల నోళ్ళలో రేపు మన్ను పడుతుందని

తలుచుకుంటే మాకే గుండె తరుక్కుపోతోంది
కన్నపేగును రెండుగా చీల్చుతుంటే
ఒకకంటిలో అల్లం మరోకంటిలో బెల్లం పెడుతుంటే
ఏమిచేయాలో పాలుపోని నిర్వేదంలో ఓ తెలుగుతల్లీ
కన్నీరు కార్చకు , దానినికుడా రాజకీయం చేస్తారు
ఓట్లుగా మలచుకొంటారు మన రాజకీయ కీచకులు
సామాన్యుడు నిస్సహాయుడుగా నిలబడే లోకంలో
అమాత్యుల పైసాచికత్వానికి బలైపోతున్న తెలుగుతల్లీ

నీకోసం రెండు కన్నీటి చుక్కలు కార్చడంతప్ప

ఏమీ చేయలేని అసహాయుడు ... ......... ఆంధ్రుడు    

  
  

28 ఆగ, 2013

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం 


కృష్ణాష్టమి అంటే ..... కృష్ణాష్టమి అంటే ..... నిజంగా కృష్ణాష్టమి అంటే  మనకు ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మిష్టర్ పెళ్ళాం లో క్రిష్ణాష్టమే !

అసలు సృష్టిలో కృష్ణ తత్వాన్ని మించిన తత్త్వం వేరొకటి కనబడదు . పుట్టిన దగ్గరనుంచి అవతారం చాలించిన దాకా కృష్ణుడు మనకు మరలా అనేక అవతారాలలో కనిపిస్తాడు . పుట్టుకతోనే మాయని తనతోబుట్టువుగా తెచ్చుకొని అనీక సందర్భాలలో మాయను ప్రదర్శిస్తాడు . మగ బిడ్డను కన్న ప్రతి తల్లి జన్మ పునీత మయ్యేలా కృష్ణుడి బాల క్రీడలు జరుపుతాడు చిన్ని కృష్ణయ్య . ప్రతి తల్లి తన మగ బిడ్డ అల్లరిలో ఆటపాటలలో కృష్ణయ్య ను తలుచుకోకుండా వుండలేదంటే అతిశయోక్తి కాదు . చిన్నప్పుడు తన స్నేహితులతో చేసే అల్లరి, ధైర్య సాహసాలు , విద్యాబుద్దులు నేర్చినపుడు విద్యార్ధిగా , యుక్త వయసుకు వచ్చిన కన్నయ్య గా గోపా బృందముతో ఆడిన సయ్యాటలు , గోపికలపై చూపించిన తామరాకుపై నీటి బొట్టు లాంటి ప్రేమకలాపాలు ,అష్ట పట్టమహిషుల తో ఒక సంసారిగా , అన్నకు బాసటగా నిలిచే తమ్ముడిగా , శత్రువుల పాలిటి సింహస్వప్నంగా , పాండవ హితైషిగా ,అర్జునునకు ఆప్తుడిగా,బావగా, గురువుగా,రాజనీతిజ్ఞుడుగా ,దాత గా,స్త్రీ మానస చోరుడుగా-స్త్రీ మాన సంరక్షకుడుగా ధర్మ రక్షకుడుగా ,గీతా ప్రభోదకుడిగా మోక్ష ప్రదాతగా ,ఆపద్భాందవుడుగా ,పశుపాలకుడుగా, సకల కళా వల్లభుడిగా తన జీవితం లో ఆణువణువూ మనిషిగా ఎలా బ్రతకాలో తెలియచెప్పిన పరమాత్ముడు శ్రీ కృష్ణుడు . 

కృష్ణుడు ప్రబోధించిన గీత ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. బిడ్డగా,అన్నగా, తమ్ముడిగా, హితుడిగా, స్నేహితుడిగా , ప్రేమికుడుగా , భర్తగా,ఆత్మీయుడుగా ఆయన  చూపించిన త్రోవ అందరికి ఆదర్శం కావాలి. జగద్గురువు కు  జన్మదిన శుభాకాంక్షలు . జై జగద్గురు ! హరే కృష్ణ ! హరే కృష్ణ ! కృష్ణ కృష్ణ హరే హరే !!    

26 ఆగ, 2013

మూగజీవి

మూగజీవి 

అమ్మా ! ఆకలిగా ఉందమ్మా ! అన్న పిల్లల మాటకి తల్లడిల్లిపోయింది ఆ తల్లి హృదయం ! పిల్లల కోసం ఏదైనా తేవాలి ,వాళ్ళ ఆకలి తీర్చాలని ఒక వైపు ఆతృత , ఈ సమయంలో బయటకి వెళ్ళితే తిరిగి రాగలనా అన్న ఆందోళన మరొక వైపు !ప్రాణ భయం కన్నా పిల్లలపై ప్రేమే గెలిచింది . ఇటు అటు చూసుకుంటూ బయటకి వచ్చింది ఆ తల్లి . ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళింది . చిమ్మ చీకటి , ఆ చీకటిలోనే వెతుకులాట ప్రారంభించింది . ఎవరో అటుగా వచ్చిన చప్పుడుకి ఒకమూలగా నక్కి నిలబడింది . వచ్చిన వ్యక్తి లైట్ వేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు . అప్పటిదాకా బిగపట్టిన ఊపిరి ఒక్కసారిగా వదిలి అంతకుముందు లైట్ వెలుతురులో తనకళ్ళకి కనబడ్డ ఆహారంవైపు కదిలింది . ఎలాగు పిల్లలకు ఆహారం దొరికింది కదా అని దొరికిన దానిలో కొంత ఆహారాన్ని తను తిని మిగిలినది పిల్లలకు పత్తికెల్దామనుకున్ది  ఆ పిచ్చి తల్లి . ఎందుకో తలతిరుగుతున్నట్టుగా వళ్ళు తూలుతున్నట్టుగా కడుపంతా గాబరాగా అనిపిస్తుంటే గుండె దిటవు చేసుకొని నెమ్మదిగా తన పిల్లల దగ్గరకు అడుగులు వేస్తోంది . ఇంతలో ఏ ప్రమాదాన్నైతే శంకించిన్దొ  ఆ ప్రమాదం కళ్ళ ముందుకి  వచ్చేసింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని భగవంతుడి మీద భారంవేసి ఒక్క గెంతు గెంతి పిల్లల దగ్గరకి వచ్చి పడింది . కానీ ఏదో కీడు జరగబోతుందని పిస్తోంది . తల తిరగడం ఎక్కువైంది . పిల్లలు తల్లి తెచ్చిన ఆహారం కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే అర్థమయ్యింది . తను తెచ్చిన ఆహారం విషమని  తను కాసేపటిలో మరణించ బోతోందని . తన పిల్లలను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్యానికి చింతిస్తూ ప్రాణాలు వదిలింది పాపం ఆ మూగ జీవి ఎలుక . 
             
మనం మనకు హానిచేస్తాయని ప్రాణాలు తీసే ఎలుకలు వాటి జీవనపోరాటం గురించి తలుచుకున్నప్పుడు మనం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో కనీసం వాటి వేదననైనా ఇలా తలుచుకుంటే మనం చేసే  పాపాన్ని కొంతైనా బాధ రూపంలో ప్రక్షాళన చేసుకోవచ్చు కదా అని  నేను పొందిన భావన   

26 మే, 2013

కాకినాడ-విశాఖపట్నం

ఉదయం 4. 35 ,కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఎనౌన్స్ మెంట్ . కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు మరికొద్ది సేపట్లో ప్లాట్ఫారం పైకి రాబోవుచున్నది . 4. 38 ట్రెయిన్  ప్లాట్ ఫారం మీదకి వచ్చేసింది . కొంతమంది ఆఖరి బోగీలు ఖాళీగా వుంటాయని , కొంతమంది ముందు బోగీలు ఖాళీగా ఉంటాయని, మరికొంతమంది నిలబడినచోటే ఎక్కొచ్చని సిద్ధంగావున్నారు . బండి ఆగుతుండగానే గబగాబగా సీటు కోసం ఎగబడుతున్నారు . నెమ్మదిగా ట్రైను బయలుదేరింది ,వేగం పుంజుకుంది . హమ్మయ్య ఎలాగోలా ఎక్కేసాం , భగవంతుడి దయవల్ల సీటు దొరికింది అని కొంతమంది , బాబు కొంచెం జరగండి వైజాగ్ దాకా వెళ్ళాలి అని బతిమాలి సీటు అడిగి కొంతమంది ఉపిరి పీల్చుకుంటున్నారు . ఇంతలో ట్రైన్ సామర్లకోట వచ్చేసింది . ఇంజను మారాలి , ఒక పది నిముషాలు అనుకున్న జనాలకి సరిగ్గా గంట తర్వాత బయలుదేరిన ట్రైన్ ని తిట్టుకోక తప్పలేదు . ప్రతి స్టేషన్ లో ఎక్కేవాళ్ళు బతిమాలుకొనో జబర్దాస్తిగానో ఉన్నంతలో సీటు సంపాదించుకుంటున్నారు . అదే ఇంకొకరికి సీటు ఇవ్వవలసి వచ్చేసరికి లేదండి ఖాళీ లేదు  అని చెపుతున్నారు. నోరున్నవాడిదే రాజ్యం . నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వెళ్తోంది ట్రైన్ . కాఫే,టీ ,తినుబండారాలు అమ్మేవాళ్ళు కూడా ప్రయాణికులతో పోటీపడుతూ ఎక్కుతున్నారు ,జనాలని తొక్కు కుంటూ అమ్ముకుంటున్నారు . బిచ్చగాళ్ళ సంగతి సరేసరి ,ఇలా రణగొణధ్వనులతో ప్రయాణం సాగిపోతోంది . నెమ్మదిగా రైలు అనకాపల్లి చేరింది . అప్పటిదాకా వుండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది . తట్టలు బుట్టలు పట్టుకొని కొంతమంది లంచ్ బాగ్లు పట్టుకొని ఉద్యోగస్తులు కాలేజీ పిల్లలు  ఇంకా వ్యాపారస్తులు బిలబిల లాడుతూ ఎవ్వరిని పట్టించుకోకుండా తోసుకుంటూ ఎక్కేస్తున్నారు . అడ్డంగావచ్చిన వాళ్ళని నోటితో అదిలిస్తూ బెదిరిస్తూ చోటు సంపాదించుకుంటున్నారు . కాలేజేపిల్లలు చాటింగులు చేజింగులు , ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు ,బాసులగురించి ఇలా ఎవరికితోచింది వాళ్ళు మాట్లాడే సుకుంటున్నారు . కొంతమంది మాటలు మొదట దేవుళ్ళ గురించి అక్కడినుండి మతం గురించి , కులాల గురించి రాజకీయంగురించి ఇలా ఒక్కొక్క విషయంగురించి చర్చించుకుంటూ తిట్టుకుంటూ తమ చర్చలు అందరు వింటున్నారో లేదో చూస్తూ ,ఎవడిమతిక్కివాడు తను వాదించే విషయంలో తానె పెద్ద మేధావినన్నట్లు ఫీలైపోతూ సపోర్ట్ కోసం పక్కవాళ్ళని అడుగుతూ దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్తాయనేది కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ ఆ ప్రతిభకి కూడా పొంగిపోతు వాదించు కుంటున్నారు . ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు . రోజు జరిగేదే , సభ్యసమాజంలో ఎలాప్రవర్తించాలొ తెలియని ఆ చదువుకున్న పశువులకి  జ్ఞానోదయం ఎప్పుడవుతుందో !ఏది ఎలా ఉన్నా రైలు మాత్రం తనగమ్యాన్ని  చేరుకుంది    

17 మే, 2013

నాన్న - ప్రేమ

ప్రేమ -మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యంగా  యవ్వనదశలో  దీనిబారిన పాడని వారు  ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! ప్రేమ తప్పు కాదు కాని ప్రేమ పేరుతొ వ్యామోహంలో పడి జీవితంలో ఎన్నో సాధించవలసిన వాటిని కోల్పోతే,ప్రేమ ఫలించకపోతే అప్పుడు అది తప్పు అనిపించవచ్చు . కాని ప్రేమలో పడినవారికి ఇవేమి  కనిపించవు. 
 రాజేష్ ఇంటర్ ఫెల్ అయ్యి ఇంటిదగ్గరే వున్నాడు. ఆ రోజుల్లో పరిక్షతప్పితే 6 నెలలదాకా ఖాళీగా ఉండడమే . 
పల్లెటూరు కావడం వల్ల ఆమాత్రం చదువుకున్నవాళ్ళు తక్కువే ! ఇంక రోజంతా కాలక్షేపం కోసం రోడ్డుమీద 
కుర్చుని పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ హైస్కూల్ కి వెళ్ళే అమ్మాయిలని కామెంట్ చేస్తుండడం ,జోకులు ,వాద ప్రతివాదనలు ఇలా గడిపివేయ్యడమే !  వయసు ప్రభావం వాళ్ళ పక్కనున్న స్నేహితుల ప్రోత్సాహం వల్ల 
రజియా పై ప్రేమపుట్టుకు వచ్చింది రాజేష్ కి. ఆ అమ్మాయి కూడా రాజేష్ వంక చూడడం,నవ్వడం మరింత  ఆనందాన్ని ఇచ్చింది రాజేష్ కి . రోజు రోజుకి  ఆమె కోసం ఎక్కువ సమయం రోడ్డు దగ్గర గడపడం ,ఎదురుగుండా స్కూల్ కావడంవల్ల ,పల్లెటూరిలో స్కూల్ లో క్లాసులు ఎక్కువగా అరుగులమీదె ఉండడంతో  ఆమెని చూస్తూ  కాలం గడిపేసేవాడు . ప్రేమవిషయంలో  స్నేహితులు ప్రోత్సాహం మంచిదైన చెడ్డదైనా  ఎక్కువగానే వుంటుంది . ఇంకేముంది  ఎలాగైనా ప్రపోజ్ చెయ్యమని ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో  హీరోలా ఫీలయిపోయాడు రాజేష్ . 

  రాత్రంతా కుర్చుని పర పర పేపర్లు చిమ్పుతూ  మొత్తానికి ప్రేమలేఖ రాసేశాడు . ఎలాగైనా  ఈరోజు లెటర్ ఇచ్చెయ్యాలి . ఆమెనించి స్పందన తెలుసుకోవాలి ,ఇప్పటిదాకా ఒకవైపే , తను ఒ.కె. అంటే ఇంకా తనంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు . కులం మతం వేరైనా ప్రేమ ముందు దాని గెలుపు ముందు దేన్నైనా జయించగలననుకున్నాడు . ఇలా వూహించుకుంటూ  లెటర్ని ఫాంట్ జేబులో పెట్టుకున్నాడు . హైస్కూల్ మధ్యాహ్నం పూట వుండడం వల్ల  ఫ్రెండ్స్ తో బతాఖానికి లుంగీ తో రోడ్డుదగ్గరకి వెళ్ళిపోయాడు పొద్దున్నె. కబుర్లతో కాలం గడిచి పోయింది . వాళ్ళ నాన్నన ప్రభాకరం ఆవూరి ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాష్టర్ . మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు .  భార్య భోజనం వడ్డిస్తోంది . పెద్దాడు భోజనానికి వచ్చాడా? అడిగాడు ప్రభాకరం ,వాడు వాడి తిండి , ఎప్పుడో వస్తాడు మీరు తినండి అంది భార్య లక్ష్మి . కాదు వాడిని రమ్మను కబురు చెయ్యి, ఇద్దరం కలిసే చేస్తాం  అన్నాడు ఆయన. చిన్నబ్బాయిని  కబురు పంపింది లక్ష్మి. 

     కబురు అందుకోగానే రాజేష్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి . గబగబా ఇంటికి వెళ్ళాడు , రారా  భోన్చేద్దువుగాని ,ఈ మాటలు వినేసరికి  ఏమిచెయ్యాలో తోచలేదు , వెళ్లి కూర్చున్నాడు , లక్ష్మి వాడికి వడ్డించేసి నువ్వు బయటకు వెళ్ళు  కాసేపు అన్నాడు ప్రభాకరం . ఆవిడకి ఆశ్చర్యంగానే వుంది  ఈయన ప్రవర్తన . కాని ఆయనని ప్రశ్నించే ధైర్యం  లేదు ఆమెకి . 
 లెటర్ ఇచ్చేసావా? ... తండ్రి ప్రశ్న వింటూనే అవాక్కయ్యాడు రాజేష్ , ఎ .. ఏ .. లెటర్ .. నాకేం తెలియదు .. బిత్తరపొతూ  అన్నాడు . నాకు తెలుసుగానీ ... ఇచ్చావా లేదా?  భయపడకు చెప్పు . ఏం చెప్పాలో తోచలేదు . అసలు నాన్నగారికి  ఎలా తెలుసు  అవకాశం లేదు .. అడుగుతున్నది నిన్నే ! తుళ్ళి పడ్డాడు రాజేష్ .. ఇఇ  ఇవ్వలేదు  . సమధానం  ఎలావచ్చిందో తెలియదు . సరే . నేను చెప్పేది శ్రద్ధగావిను  మొదలుపెట్టారు ప్రభాకరం ..  
 ఇప్పుడు లెటర్ ఇస్తావు ,ఆ  అమ్మాయి కూడా   సరే అంటుంది . కలిసి తిరుగుతారు ,దేనికి పరాకాష్ట ఏమిటి? పెళ్లి .. సరే నీ వయసు  18 ఇంకా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే యోగ్యతా రాలేదు , పెళ్లి చేసుకుంటావు ,భార్యకి మూరెడుమల్లె పూలు  కొనాలన్నా నీకు సంపాదన లేదు,సినిమాకి అంటుంది , నాన్నా నా భార్యని సినిమాకి తీసుకువెళ్తాను  10 రూపాయలు ఇవ్వండి అని నన్ను అడుగుతావా? అడగ గలవా? ఇప్పుడు అందంగా కనపడిన జీవితం  , ప్రేమ  అప్పుడు కష్టంగా చిరాకుగా అని పిస్తాయి . అందుకే ముందు నువ్వు యోగ్యుడివి అవ్వు , తరువాత నీకు  నచ్చిన పిల్లని ప్రేమించు పెళ్ళిచేసుకో , ఏకులం ,మతం అని నేను అడగను . అందరి తండ్రుల్లాగా నేను ఆలోచించను  ఒక తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా నేను చెప్పాల్సింది  చెప్పాను  ఆపైన నీ ఇష్టం అంటూ  గబగబా భోజనం చేసి  వెళ్ళిపోయారు . అంతా  విన్న రాజేష్ తండ్రి చెప్పిన మాటల్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తూ  అన్యమనస్కంగానే చెయ్యి కడిగేసుకున్నాడు . అసలు విషయం నాన్నగారికి ఎలాతెలిసింది ? మధన పడిపోతున్న  రాజేష్ కి రాత్రి అమ్మ నాన్నని అడిగిన ప్రశ్న ద్వారా సమాధానం దొరికిన్ది. భోజనానికి కుర్చునేటప్పుడు ఫాంట్ హాంగర్ కి తగిలిస్తుంటే వాడి ఫాంట్ కింద  పడింది ,జేబు బరువుగావుండడం చూసి  కిరాణా బాకీ  ఇంకా కట్టకుండా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా అని చూసాను ,తీర చూస్తే లవ్ లెటర్ , పిల్లలని సరైన సమయంలో సరిగా  మంచి మాటలతో అర్ధమయ్యేలా మలచుకోగలిగితే  వాళ్ళు మానని అర్ధం చేసుకుని మంచి మార్గంలో నడుస్తారు  . అదే కటువుగా కోపంతో నాలుగు కొడితే మొండిగా తయారవుతారు ,టీచర్ గా నా పిల్లవాడిని  చక్కదిద్దుకో గలిగితే  పదిమందిని చక్కదిద్దిన వాడిని అవుతాను .. ఇంటగెలిచి  రచ్చ గెలవమన్నారు . నాకు తెలిసి వాడు జీవిత సత్యాన్ని తెలుసుకుని  మంచి మార్గంలో వెళ్తాడని నమ్మకం . ఈ మాటలువిన్న లక్ష్మి తండ్రిగా పిల్లవాడి  విషయంలో భర్త భాద్యతని చూసి ప్రశాంతంగా నిద్రకుపక్రమించింది . రాజేష్ తండ్రి మాటల్లో సత్యాన్ని గ్రహించి  నాన్న ప్రేమ లో వుండే గొప్పదనాన్ని గ్రహించి  చదువుమీద శ్రద్ధ పెట్టి  తనుకూడా ఒక టీచర్ గా పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు .  నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పది?  

15 మే, 2013

ఎదురుచూపు

పెళ్లి అనగానే  ఆడపిల్ల మనసులో  కోరికలు పురివిప్పిన నెమలిలాగ నాట్యమాడుతాయి. శ్రావణి కూడా సగటు ఆడపిల్ల లాగే పెళ్లి కలలు  కంటోంది .  చిన్నాన్న తీసుకువచ్చిన సంబంధం ,పిల్లాడు అందగాడు ,సంపాదనాపరుడు,చదువు తక్కువే ఐనా వేద పండితుడిగా  గౌరవమర్యాదలు పొందుతున్నవాడు. కుటుంబం సాంప్రదాయ మైనది . మీదుమిక్కిలి అత్తగారు చాలా మంచిది . ఇంతకుమించి ఏ ఆడ పిల్లైనా కోరుకునేది ఏముంటుంది ? అమ్మ నాన్న ముందు ఒప్పుకోపోయినా అన్ని ఆలోచించి ఒ.కె. చెప్పారు .తాతగారు కాలం చెయ్యడం వల్ల పెళ్లి ,నిశ్చితార్ధం ఆగష్టు వరకు పెట్టుకోలేదు . కానీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి 
అనుమతి ఇచ్చారు పెద్దలు . ఇంకేముంది సెల్ ఫోనులో చాటింగులు  మెస్సేజ్లు . కాలం భారంగా గడుస్తుందని అనుకుంటే వేగంగానే గడుస్తోంది . 

                పెళ్ళికి కావలసిన చీరలు వస్తువులు ,పెళ్లి ఎలాచేయ్యాలి ,ఎక్కడ చెయ్యాలి అనే విషయాలలో  అమ్మ నాన్న తలమునకలు ఔతుంటే ,చీర ఎలా సింగారించుకోవాలో,అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో ,వంట ఎలా చేసి 
అత్తవారింట్లో మెప్పు పొందాలో ఇలాంటి విషయాలలో  శ్రావణి అమ్మని, నానమ్మని ,అత్తని పిన్నిని అడిగి నేర్చుకుంటోంది . ఇంతలో పెళ్ళివారి నుండి కబురు వచ్చింది వైశాఖం లో  నిశ్చితార్ధం పెట్టుకుందామని . తర్జన భర్జనల అనంతరం తాంబూలాలు ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకునేలా ఒ.కె  చెప్పాడు పిల్ల తండ్రి రామకృష్ణ . పనులు చక చక జరిగిపోతున్నాయి . పిలుపులు అందరికి అందేసాయి . మధ్యతరగతి కుటుంబమైనా ఒక్కగానొక్క ఆడపిల్ల నిశ్చితార్ధం ఏలోటు లేకుండా ఉన్నంతలో ఘనంగా చేయాలని అందరిని పిలుచుకున్నాడు రామకృష్ణ . 

                 ఇంతలో మళ్ళి పిలుపు వచ్చింది పెళ్ళికొడుకు తండ్రికి అనారోగ్యంగా వుందని ,నిశ్చితార్ధం  ఆగష్టులోనే 
పెట్టుకుందామని . ఈ సమస్య వస్తుందని అనుకుంటూనే వున్న రామకృష్ణ సరే అలాగే అన్నాడు . మళ్ళా అందరికి ఫోన్ చేసి కార్యక్రమం వాయిదా పడిందని చెప్పుకునే సరికి తాతలు దిగివచ్చారు రామకృష్ణకి . ఆఖరి ఫోన్ చేసి ఇంకా అందరికి చెప్పేసాం కదా ,ఇంకేవారిని మర్చిపోలేదు కదా అని భార్యని అడుగుతుండగా  ఫోన్ మోగింది . పెళ్లి కొడుకు బావగారు ... విషయం విని ఏమిచేయాలో పాలుపోలేదు రామకృష్ణకి . కాబోయే వియ్యంకుడి మరణవార్త ,ఆయన మరణం ఒకపక్క ,ఏడాది వరకు పెళ్లి వాయిదా పడిందనే బాధ ఒకపక్క. చిన్నబోయిన కూతిరి ముఖాన్ని చూసి ధైర్యం చెప్పడం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి . అంతా మనమంచికే ,ఆపేసిన చదువు కొనసాగించు  అని తండ్రి అంటే కాబోయే భర్త కూడా ఒక్క ఏడాదే కదా అందాక అక్కడే పీజీ లో జాయిన్ అవ్వు ఫై ఏడాది ఇక్కడ కంటిన్యు చేద్దుగాని  అనడంతో  ఏడాది కాలాన్ని ఎదురుచూపులతో గడపడానికి సిద్ధమయ్యింది శ్రావణి ......     
              
              

18 ఏప్రి, 2013

రాముడు

రాముడతడు - కౌసల్య రాముడతడు 
రాముడతడు - దశరథ తనయుడతడు
రాముడతడు - గురు భక్తి పరాయణుడతడు
రాముడతడు -సకలవిద్యా పారంగతుడతడు
రాముడతడు -యాగరక్షణా ధర్మ నిరతుడతడు
రాముడతడు-రాక్షస సంహార దురంధరుడతడు
రాముడతడు -అహల్యా శాప విమోచనుడతడు
రాముడతడు -కళ్యాణ గుణాభిరాముడతడు
రాముడతడు -శివ ధనుర్భంగ చతురుడతడు
రాముడతడు -సీతా ప్రియవల్లభుడతడు 
రాముడతడు -అయోధ్యా జన ప్రియ భాంధవుడతడు 
రాముడతడు -కైకా వర శాపగ్రస్తుడతడు 
రాముడతడు -పితృ వాక్య పరిపాలనాభిలాషియతడు
రాముడతడు -సౌమిత్రీ పరివేష్టితుడతడు
రాముడతడు-సీతా సమేత వనసంచారి యతడు 
రాముడతడు - దైత్య జన నిర్జనుడతడు
రాముడతడు -సీతా వియోగ శోకితుడతడు 
రాముడతడు -హనుమసేవితుడతడు 
రాముడతడు -సుగ్రీవ ప్రియ స్నేహితుడతడు
రాముడతడు -వాలి సంహారకుడతడు
రాముడతడు -వారధి బందనుడతడు
రాముడతడు -దశకంఠ మర్ధనుడతడు
రాముడతడు -విజయ రాముడతడు 
రాముడతడు -సకలగుణాభి రాముడతడు                    

14 ఏప్రి, 2013

నేను

ఒకప్పుడు నేను ధీరుడిని
కానీ నేడు భీరువుని !

కొండంత సమస్యను సైతం 
గుండె నిబ్బరం తో ఎదుర్కొనే నాకు 
గుండెలోతుల్లో నేడు భయం 
పడగవిప్పి బుసకోడుతోంది

మండే ఎండను సైతం
లెక్కచేయని నేను
మంచు బిందువుని సైతం
మోయలేక పోతున్నాను

చిరునవ్వు చిద్విలాసమైన నన్ను
గరళకంఠునిలా
కక్కలేక మింగలేక
ఈతిబాధల విషం బాధిస్తోంది

ఏ క్షణాన ఏమిజరుగుతుందో
తెలియని భయంతో
ఓర్పుతో అన్నీ సహించిన నేను
ఓదార్పుకోసం ఎదురు చూస్తున్నాను.

అందుకే
ఒకప్పుడు నేను ధీరుడిని !
కానీ నేడు భీరువుని!!

11 ఏప్రి, 2013

ఉగాది

ఉదయకాంత  నునులేత స్పర్శతో 
కనులు తెరిచిన నాకు
ఉగాది వచ్చిందంటే 
ఆశ్చర్యమేసింది 
ఏది ?ఎక్కడ? అని ఇల్లంతా వెతికాను
ఎక్కడా కనిపించలేదు !

పెరిగిన ధరల ముసుగులో 
తీపి,పులుపు ,ఉప్పు ,కారం 
కాలుష్యపు కోరలలో 
వేపపువ్వు ,మామిడికాయ 
ముఖం చాటేసాయి 

షడ్రుచులు నోరూరించే రుచులుకావని ,
షడ్చక్రం లో  నలిగిన జీవనరసాలని ,
ఉగాది కావాలంటే ధనం గాది కావాలని ,
తెలియని పసిమనసుకు ఏదో రుచి చూపించి 
ఇదే ఉగాది పచ్చడని ,ఉగాది వచ్చిందని ,
వచ్చి వెళ్లిపోయిందని 
సర్ది చెప్పి ,సమాదానపరచుకొని 
కాసేపలా కళ్ళు మూసుకున్న నాకు 
కనులు తెరిచి చూస్తే 
నిజంగానే ఉగాది వెళ్లి పోయింది ! 

24 మార్చి, 2013

స్వాతంత్ర్యమా నీవెక్కడ?

స్వాతంత్ర్యమా నీవెక్కడ?
ఎందరో త్యాగధనుల ఆశల ఫలానివై ,
అరవై ఆరేళ్ళ క్రితం జన్మించిన నీకు 
బాలారిష్టాలెన్నో !
ఆదిలోనే మత చందసం 
నీపై అక్కసు వెళ్ళగక్కింది 
బాపూజీ కళల సాకారానికి 
నెహృజీ నడుం కట్టి 
 నీకు నడక నేర్పితే 
వడివడిగా పరుగుపెడుతున్న నిన్ను చూసి 
ఇరుగుపొరుగుల ఈర్శ్యా ద్వేషాలకు 
నీకు తగిలిన గాయాలెన్నో !
యవ్వనాన అడుగిడిన నీ సౌందర్యానికి  ముగ్దులై
నీతో స్నేహానికి అర్రులుచాచిన వారెందరో !
అందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 
బాధ్యతల బరువుతో జీవితాన్ని గడుపుతూ 
మున్ముందుకు సాగుతూ 
స్వాతంత్ర్యమంటే  ఇదే 
ఆ ఫలాలు భావితరాలకు అందుతాయనుకుంటే ,
స్వార్థ రాజకీయాలతో, వేర్పాటు వాదాలతో 
కులాల కుళ్ళుతో,మతాల మత్సరంతో 
నీవంటి నిండా రోగాలను అంటగట్టి ,
కత్తులతో కుళ్ళ పొడిచి ,తూటాలతో తూట్లు పొడిచి 
నిను చంపేస్తారని భయపడి 
ఎక్కడికో పోయావా! 
ఒద్దు తల్లీ ఒద్దు !!
నువ్వు భయపడవద్దు!
ఈ తరం బాలలు నీ గాయాలకు మందు పూసి ,
నీ ఆశయాలకు ఊపిరులూది 
శాస్త్ర సాంకేతిక పరిజ్క్షానమ్ తో 
నీ చిద్రమైన శరీరాన్ని మరలా పునరుజ్జీవింప చేస్తారు 
నీ రుణం తీర్చుకుంటారు .  

ఊహ -నిజం

జీవితం గురించి ఎన్నికలలో !
ప్రకృతి లో పరవశమై పవ్వళించడం 
వెండి గిన్నెలో పెరుగన్నం 
వెండి వెన్నెల ఆస్వాదనం 
మల్లెపందిరి నీడలో 
మది దోచిన కాంతతో ఏకాంతం !
కానీ నిజ జీవితం !
నిశీధి ముసుగు తీయడం తో మొదలై 
నిశీధి దుప్పటి కప్పుకొని గురక పెట్టాకే 
ఇంటికి చేరడం !
కంటికి నిదుర కరువై 
కడుపుకి ఆకలి ఘనమై 
 పక్క పై దోమల సాంగత్యంతో 
తెల్లవారడం !

అనుకున్నా - అనుకుంటున్నా


చిన్నతనంలో  వానాకాలంలో
చిన్ని చిన్ని కాల్వలలో 
కాగితం పడవలు వేస్తూ 
అవి మునిగినా తేలినా 
ఉల్లాసంగా కేరింతలు కొట్టడమే 
జీవితం అనుకున్నా 
కానీ పెద్దతనంలో 
బాధ్యతల సుడిగుండాలలో 
జీవితమనే ఈ పడవను 
మునగకుండా సురక్షితంగా 
ఎలా దరికి చేర్చాలో తెలియక 
జీవితం గురించి తెలుసుకోవాలని  అనుకుంటున్నా   

17 మార్చి, 2013

బంధాలు-అనుబంధాలు


తల్లి కడుపులో ఊపిరులు పోసుకున్నది మొదలు ఈ భూమితో మనుషులతో ప్రకృతి తో జీవికి అనుబంధం ఏర్పడుతుంది. తన తల్లి కడుపులో వున్నా ప్రకృతిలో వుండే వాతావరణం బిడ్డ పై ప్రభావాన్ని చూపుతుంది . పెరుగుతున్న బిడ్డ పై తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ ఇలా అందరు అనుభందాన్ని పెంచుకుంటారు . బిడ్డ భూమి మీద పడిన దగ్గరినించి మరింతగా బంధాలను పెంచుకుంటాడు . రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ ఇవి మరింత పెరుగుతాయి . ఇరుగు పొరుగువారు, బదువులు, స్నేహితులు ఇలా కొత్త కొత్త బంధాలను పెంచుకుంటాడు . వేలు పుచుకుని నడిచే స్థాయి నుంచి వేలు విడిపించుకుని నడవాలనే స్థాయికి వస్తాడు అక్కడి నుండి నేను నాది అనే భావనతో ముందుకు వెళతాడు . నెమ్మదిగా ప్రేమ వైపుకి మరలుతాడు . పెంచిన తల్లి తండ్రి వీళ్ళకన్నా ప్రేమించిన వారితోనే తన అనుబంధాన్ని పెంచుకుంటాడు . అక్కడి నుండి కొత్త లోకంలోకి అడుగు పెట్టి అక్కడ మరికొన్ని కొత్త బంధాలను ఏర్పరచుకుంటాడు . తనకంటూ ఒక కుటుంబం , మరల తన భార్య పిల్లలు  మరో కొత్త బంధాని కి తెరతీస్తాడు . ఇలా ఇన్ని బంధాలు ఏర్పరచుకున్న మనిషి ఒక్క క్షణం లో అన్నిటిని తెంపుకొని పోతాడు .  ఈ ప్రకృతిగాని తల్లి తండ్రులు గాని బంధువులు గాని స్నేహితులుగాని ఎవ్వరిని పట్టించుకోకుండా నిర్వికారంగా నిస్తేజంగా వెళ్ళిపోతాడు . మిగిలినవాళ్ళు మాత్రం ఆ బంధాలను అనుబంధాలను తెంచుకోలేక పోయిన వారికోసం శోకిస్తూ వుంటారు . ఎంతైనా బంధాలకు అనుబంధాలకు బందీలం కదా! 
నా ఆత్మీయులైన వారిని ఒక్కొక్కరిని కోల్పోయినప్పుడు నా మనసులో కలిగిన భావాలివి. పుట్టిన వాడు మరణించక తప్పదు కానీ ఒక్క ఏడాది లో 5గురు ఐన  వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలావుంటుందో అనుభవించి వ్రాస్తున్న భావాలు .     

16 మార్చి, 2013

స్వాతంత్ర దినోత్సవం


బక్క పేగుల డొక్కలంటిన 
బడుగు బ్రతుకు  జీవుడా  
ఒక్కసారిగా చుక్కలంటేను 
ధరలజండా చూడరా!

జాతి జాగృతి జరిగెనంటు 
జండా లాగెను నేడురా!
మధ్యతరగతి బ్రతుకులంటు 
బండిలాగర సోదరా!

సిలుకు చొక్కా దొరలచేతుల 
నలిగిపోయిన తమ్ముడా 
చిలుకపలుకులు పలుకుతున్న 
దొరల బ్రతుకులు చూడరా!

తిండి కలిగితే కండ కలదని 
పెద్దలన్నా మాటరా 
కలిగినోడే తిండితింటే
 ఎంగిలాకులే మిగిలెరా 

నేడు భారతి భగ్న హృదయం 
భగ్గుమన్నది చూడరా 
భావి యువతకు భరత ఖండం 
బుగ్గి బూడిద బాటరా!

 


13 మార్చి, 2013

గిరిజన ప్రాంతం


తూర్పుగోదావరి జిల్లాలో 7మండలాలు గిరిజన ప్రాంతంగా గుర్తించ బడ్డాయి . అడ్డతీగల,రంపచోడవరం,రాజవొమ్మంగి,మారేడుమిల్లి ,దేవీపట్నం,గంగవరం,వై రామవరమ్. ఈ ప్రాంతమంతా కల్మష రహితమైన ప్రకృతికి,మనసులకు నిలయమ్. ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో అడ్డ తీగలకు దగ్గర లో 4కి. మి. దూరంలో పింజరి కొండ జలపాతం ఒకటి . ఇక్కడ n.t.r. పాదుకా పట్టాభిషేకం అనే సినిమా తీసారు,ఇంకా చిరంజీవిశోభన్ బాబు సినిమాలుకూడా ఈ ప్రాంత అందాలను తెరకెక్కించారు. ఇంక రంపచోడవరం దగ్గరలో రంప అనెఅ ఊరు వుంది,ఇక్కడ కొండపైశివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతున్ది. ఇక్కడకూడా జలజల జారే జలపాతాలు కోకల్లలు . ఇంక మారేడు మిల్లి గురించి వర్మగారు పోస్ట్లో చూసాం . వనసంపద కి గని ఈ ప్రాంతం . శివరాత్రికి గిరిజనప్రాంతం లో చాలా చోట్ల ఘనంగా ఉత్సవాలు చేస్తారు . నీను పుట్టిన వూరు దుప్పులపాలెం . నాన్నగారి ఉద్యోగ రీత్యా 1963 నుండి ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో గిరిజనులకి చాలామందికి ఏది ఎలా తినాలో తెలియదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మేమే.పనసకాయని పచ్చి గా వుండగానే కోసి తొనలు తీసి ఒక కుండలో వేసి ఉప్పు కారం వేసి ఉడికించేవారు. ఉడికాక తినెవారు. సీతాఫలం ఐతే పరువుకి వచ్చిన కాయలు ఆకులలో చుట్టి మంటలో వేసి కాల్చెవారు. ఇలా వారి ఆహారపు అలవాట్లు వుండేవి . చేపలని పట్టుకొని నిప్పులో కాల్చుకొని తినేవారు నెమ్మదిగా వారు నాగరికత వైపు అడుగులు వేస్తున్నారు . ఆ పచ్చని అడవులలో హాయిగా ఆనందం గా గడిపే వాళ్ళం . ఇలా ఎంత రాసినా నేను పుట్టిపెరిగిన ప్రాంతం గురించి తరగదు, తనివి తీరదు ... మీ అందరి ప్రోత్సాహం తో వ్రాయడానికి సాహసించాను . తప్పులుంటే సరిదిద్ది నన్ను ముందుకి నడిపిస్తారని ఆశిస్తూ   


11 మార్చి, 2013

కవిత నిద్దరోయింది



ఇన్నాళ్ళూ కవిత నిద్దరోయింది 
నేడు కలత నిద్దురలో లేచింది 
జగతిని జాగృతం చేయాలని 
చేతిలోవున్న కలాన్ని ఝళిపించి 
సిరాలో ముంచి శివమెత్తిమ్చి
శరపరంపరలా  పరపరా రాసేసి 
ఆకలి తీర్చుకొని ఆవులిస్తూ 
హాయిగా ఇన్నాళ్లు  కవిత నిద్దరోయింది   

సాగాలి ఈ పయనం



చెలిమి కలంలో మేలిమిముత్యాలు 
అక్షర సరాలుగా అభిమానధనాలుగా 
నా అణువణువులో పులకింతలు రేపి 
నా హృదయం లో చెలిమి సెలయేరులు 
లావణ్య నిదులై కారుణ్య నదులై 
హిమనదాల స్నేహ ప్రవాహంలా 
జీవన గమ్యం కడలి చేరేవరకు 
జీవనదిలా మాలిన్య రహితమై 
మనుగడ సాగిద్దాం 

9 మార్చి, 2013

కొవ్వొత్తి

కరిగి పోతాను కాలం కౌగిలిలో 
మిగిలిపోతాను వెలుగునై జిలుగునై 
నేనున్నంతవరకు ఈధరిత్రిలో 
మలిగి పోతాను కడసారి నీ సేవలో 
               
సాహితీసరాలు పేరుతో నా బ్లాగుని ప్రారంభిస్తున్నాను. నా బ్లాగుకు స్వాగతం.