12 జన, 2014

సంక్రాంతి

సంక్రాంతి 

ఈ రోజుల్లో అంతా బిల్డింగుల సంస్కృతిలోకి వచ్చారు కాబట్టి ఎలా ఉంటోందో తెలియదు కానీ పండుగ వస్తోందంటే పల్లెల్లో  మూడు నెలల ముందునుంచే సందడి మొదలవుతుంది . మట్టి లోగిళ్ళు నేల పొక్కుతీసి ,మట్టితో మెత్తి ,మళ్ళీ పేడతో అలికి ,గోడలకి అరుగులకి ఎర్రమన్నుతో అలికి సున్నంతో అందమైన ముగ్గులు పెట్టి , ఇంటిలో వుండే  ఇత్తడి సామాను మిలమిల మెరిసేలా తోమి ఇంటిలోపల బల్లలపై బోర్లించి , గడపలకు పచ్చని పసుపురాసి  ఇళ్ళను అలంకరిస్తారు . ఇంక రైతులు కళ్లాలలో వుండే ధాన్యాన్ని తీసుకువచ్చి గాదెల్లో నింపుతారు . పండుగకు కొద్దిరోజులు ముందుగానే నిలవ వుండే పిండివంటలు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కలిసి చేసుకుంటారు .పిండి దంపడం , అరిసలు జంతికలు సున్నుండలు లాంటి పిండివంటలను చాలా చక్కగా చేసుకుంటారు . ఇంక సంతలకు వెళ్లి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పిల్లలకి బట్టలుకొనడం కుట్టించడం , ఇంటికివచ్చే మూటలవాళ్ళ దగ్గర మిగిలిన బట్టలు కొనటం ,ఇదికూడా ఇరుగుపొరుగు కలిసి మూతలు దిమ్పించడం బేరాలు చేయడం అంతా చాలా సందడిగా వుంటుంది. ఇంక పండుగ రోజు తెల్లవారుఝామునే పిల్లాజెల్లా లేచి భోగిమంటలు వెలిగించి ఆ భోగిమంటల  దగ్గరే  వేడినీళ్ళు కాచుకుని అవి కాగేలోపున వంటికి నలుగులు పెట్టుకుని తలన్టి  స్నానాలు  చేసి కొత్తబట్టలు ధరించి మల్ల భోగిమంట దగ్గరకు వచ్చి పిడకలదండలు మంటలో వేసి ఆ బూడిదను బొట్టుగా ధరిస్తారు .కొన్త సేపు అక్కడే గడిపి ఇళ్ళకు వెళ్లి అమ్మ పెట్టిన అల్పాహారాలు తినేసరికి ఒక్కొక్కరుగా గంగిరెద్దులవాళ్ళు ,బుడబుక్కలవాళ్లు ,మొండివాళ్ళు , కొమ్మదాసరి ,ఇంకా చాలా వేషాలతో ఇంటింటికి వచ్చే వాళ్ళతో మధ్యాహ్నం దాకా కాలక్షేపం అయిపొతున్ది. నక పెద్దవాళ్ళ విషయానికి వస్తే కొత్త అల్లుళ్ళు, వాళ్లకి చేయాల్సిన మర్యాదలు ముఖ్యంగా అల్లుడికి తలంటి స్నానం చేయించడం ,ఇంటిళ్ళపాదీ సరసాలు , ఆటలు ,పాటలు కబుర్లు ఇలా గడిచిపోతుంది . ఆడవాళ్ళు భోజనాలు సిద్దం చేసేదాకా పేకాట లాంటి కాలక్షేపంతో మగవాళ్ళు గడుపుతారు . ఆడవాళ్ళకి పాపం విశ్రాన్తే  వుండదు . మరల మధ్యాహ్నానికి ముందే చేసివుంచుకున్న పిండి వంటలతో అల్పాహారాలు ఇలా చాలా ఆహ్లాదకరంగా మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచి పోతాయి . పెదపండుగ  పెద్దలకి బట్టలు పెట్టుకోవడం , గారెలు వండుకోవడం , మూడవరోజు కనుమ ... ఇది పశువుల పండుగ . ఈరోజు పసువులను ,వ్యవసాయపనిముట్లను శుభ్రంచేసి అలంకరిస్తారు . పశువుల మెడలలో పూలదండలు వెస్తారు. ఇంకా అట్లు,అరిసెలు లాంటివి కూడా వాటిమేదలలో వేళ్ళాడ కడతారు.దీనివల్ల అవి వొక దాని మెడలలో వున్నవి మరొకటి అందుకొని తింటాయి . ఆరోజు పశువులను ఏమి అనరు . ఇలా మూడురోజుల ముచటైన పండుగ  ఇప్పుడు ఎలావుందో తెలియదు ! ఎందుకంటే టి .వి. రంగప్రవేశంతో  అక్కడి వాతావరణం కూడా  సంప్రదాయమైన , సహజమైన సరదాలకు దూరమై  వీళ్ళు చూపించే పిచ్చి కార్యక్రమాలతో గడిపేస్తారేమో ! నా చిన్నతనం అంతా పల్లెటూళ్ళో   గడిపినా పల్లె వదిలి 20 ఏళ్ళు అయిపోతోంది . అక్కడ బంధువులెవరు లేకపోవడంతో  అక్కడికి వెళ్ళే అవకాశం దక్కటంలేదు . ఏదైనా పల్లెల్లో ప్రకృతి,సాంప్రదాయాలు కలుషితం కాకూడదని కొరుకున్దామ్.