30 మే, 2015

కలగానే






చల్లగ ఏదోభావన నా ఎద తాకినది
మెల్లగ నామదినే మేల్కొలిపినది
కల్లకపట మెరుగని నిను కలిపినది
కలల లోకమున నను తిప్పినది
మల్లెల పరిమళమే వ్యాపించినది
మధురిమ నామదిలో కలిగినది
కోకిల రాగం కొత్తగ మారినది
ఝుంటి తేనియ జాలువారినది
కంటి కాటుక కొన చెరిగినది
రాతిరి ఊసులు నాకే తెలిపినది
కమ్మని నిదురే మరి కరిగినది
కాలం ఎంతగ నిను మార్చినది
కలగానే నా కల మిగిలినది

28 మే, 2015

పచ్చదనం



పచ్చదనం పంచుకోర

ఆయుష్షును పెంచుకోర

పదితరాలకు వెలుగు బాట

పరిసరాలు పరిశుభ్రం

పశు పక్షులు మరి పదిలం

మేలుకొనగ మేలైన సమయము

కనులు తెరవకుంటే దరిలోనే నరకము

చెట్టు చేమలేకపోతే నీరు లేదు గాలి లేదు

నీరు లేక గాలి లేక నీవే లేవు

ఒక్క మొక్కనాటి చూడు

ఆత్మ తృప్తి పొంది చూడు

నేడు నీకు ఫలము లేకపోవు

భావి తరాలకు మేలు కూర్చు

స్వార్ధాన్ని విడనాడు స్వర్గాన్ని పొంది చూడు

14 మే, 2015

ఏక వాక్యాలు –ఏకతారాలు -6



149.ఒద్దికగా కూర్చుంటావు- ముద్దిమ్మంటే ఒద్దంటూ
150.మనసంతా మౌనభాష్యాలే -మరో ప్రేమకావ్యాన్ని ఆవిష్కరిస్తూ

151.కళ్ళల్లో నీళ్ళు -మమకారం ఇంత కారమని తెలియదు
152.వేసవి తాపంపెరుగుతోంది -మనమధ్య దూరంలా
153.నా దాహం పెరుగుతోంది-నీ ప్రేమ మరీచికల వెంట పరిగెడుతుంటే
154.కాలం కరిగిపోతోంది-నాకౌగిలిలో నీలా

155.కోయిలమ్మలకు కొదవలేదు -కొత్తరాగాలే కొరవడ్డాయి
156.కోయిలమ్మకు జ్వరమొచ్చింది -కాలుష్యపు మావిచిగురుతిని
157.కాకులకు వేడుక -కోయిలమ్మ మూగబోయిందని
158 .రాజకీయం నేర్చింది పంచాగం -ఎవరికి నచ్చినట్లు వారికిచెపుతూ
159.ఉగాది పచ్చడి -ఎలాగోచేసుకుతిన్నాము చచ్చి చెడి
160.కోయిలమ్మకు కులుకు -తన గొంతులో తెనేలోలుకుతాయని

161.మన్మధుడు ముస్తాబవుతున్నాడు -మనందరినీ అలరించడానికి
162.మదిలో ఎదో అలజడి -మన్మధ ఆగమనానికి నందిగా
163.నిశా కాంత నిషా నిండినకళ్ళతో -ఉషాకాంత వెలుగు వాకిళ్ళలో

164.కన్నెల కలలు తీరుతాయి -వచ్చింది మన్మధ కదా
165.అన్నీ నీ పడకగదులే -గుండెలో నాల్గు గదులున్నాయి
166.కనులు నిండిన నీరూపం -రెప్పవాల్చలేకపోతున్నా
167.నిత్యం నీరూరుతూ -చెలమల లాంటి నీకళ్ళు
168.కలలు కరిగిపోతున్నాయి -కన్నీటికి అర్ధం చెపుతూ

169 చేదు కనబడదెందుకనో - .అనుభూతుల షడ్రుచులలో

170.వేప జాతికి ద్రోహం -.ఉగాది నెపంతో
171.సిగ్గు వదిలి విచ్చుకుంటున్నాయి -ముడుచుకున్న మల్లెలు
172 .సన్నజాజులు కుళ్ళుకుంటున్నాయి -సన్నని నీనడుము చూసి
173.తాకుతూనే వుండిపోతారలా -ఈ సబ్బు రుద్దుకోవాలంటే సిగ్గేస్తోంది బాబూ

174.మన ఏక్ తారలు -సీతారాముల ముత్యాలతలంబ్రాలుగా

175.స్త్రీని చెరపట్టినా నీతితప్పలేదు -రావణుడు రాక్షసుడే
176.దేవుళ్ళనీ విడదీసారు విభజన పేరుతో -మనుషులనే కాదు
177.హృదయం ఖాలీఅయిపోయింది -నీకైప్రేమంతా ఒలకపోసా
178.భళ్లు మన్న శబ్దం -పగిలింది గ్లాసుకాదు నాహృదయం

179.రాజధాని అమరావతి అట -ఇం (చం) ద్రు ని కొలువులో ఇక రంభా ఊర్వశులే
180.మూగనై పోయా -నువ్వే మాట్లాడేస్తుంటే
181.ఏక తారలంటూనే -శత సహస్ర తారా శర ధారలు
182.అరుంధతి -వసిష్టుని పక్కన ఏక్ తార
183.హిమాలయంకరుగుతుంది - నీహృదయంలా కాదు
184.ఆనందాన్ని పంచుతూనే వుంటుంది మృదంగం -రెండుచెంపలూ వాయిస్తున్నా
185.పేదల సమాధులపై పునాదులు-నవరాజ్య నిర్మాణానికి
186.పరీక్షలకాలం -అమ్మానాన్నలకి
187.లోతుతో పనేముంటుంది -ఈత వచ్చినవాడికి
188.తల ఎత్తకుండా తలపై గంగ -శివుడికి సిగ్గనుకుంటోంది పార్వతి

189.చంద్రుని సరసన రోజూ ఒక్కతారే -మనకి మాత్రం రోజూ పంచ ఏక్ తారలు
190.నింగి నిండా నక్షత్రాలే -చంద్రుని నఖ క్షతాల్లా
191.చల్లని వెన్నెల పంచుతాడు -వొళ్ళంతా మండించు కుంటూ
192.పున్నమినాడు మురిపిస్తూ -అమాసకు ముఖం చాటేస్తాడు
193.సవతి పోరు ఎక్కువే -తారా మణులకు !

194.నా గుండె లయతప్పుతోంది -నీ అడుగులసవ్వడులకే

195 మొగ్గలా విచ్చుకుంటావు -కనపడని ముళ్ళు గుచ్చుతూ
196.ఎంతకాలమిలా - ఒకరికి ఒకరం దూరంగా
197 దారిచూపిన దేవతవు- .దారితెలియని నాకు
198. తెరచాపవు నీవే -సుడిగుండాల నడిసంద్రంలో
199.అమ్మ -సృష్టి కర్త బ్రహ్మకు ప్రతిరూపం

200.అమ్మ అమ్మే -కోటీశ్వరుడికైనా కూటికి లేని వాడికైనా



201.అనాధలనుకన్నది అమ్మే -తాను అన్యాయమైపోతూ
202.ఆడదానికి వరం -అమ్మగా మారగలగడం
203.అమ్మతనానికి దూరంకాకు -అనుచితంగా ప్రవర్తించి
204.ఎడారిలో మొక్కల్లా బట్టతలపై జుట్టు -అంతేనా నీభావన
205.హాస్య తారలాట రాయమని కితకితలు పెట్టేస్తూ -ఏమిటీ తమాషా
206.మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ తారలు రాసెయ్యడమే -అంతే అనుకున్నా
207.మాయ చేయకలా -అమాయకమైన నా మనసుని
208.కలలుకంటాయి -నిదుర రాని కనులు కూడా
209.కవ్విస్తుంటాయి- వాలుచూపు వాలుజడ వీలున్నప్పుడల్లా

ఏక వాక్యాలు –ఏకతారాలు -5



101.అమ్మ ఒడి ఒక్కటే -అలసిన మనసును సేదతీర్చేది
102.ఆ రాధను అడిగా -నిను ఆరాధించేదెలా అని
103.పడతి మోములో పరవశం -పతిదేవుని సమాగమం లో
104..ఇంకా ముద్దొస్తోంది -అలసిన నీమోము
105.అలలు ఆరాటపడుతున్నాయి –పడిలేవడానికి
106.విరబూసిన పువ్వుకు తెలుసు -వాడిపోనున్నతన జీవితం

107 .నాకు మరణం లేదు-గొంతు నిండా ప్రేమామృతమే
108..నీ తలపులే -నావలపు తలుపులు
109..నీ ఓరచూపుతెలిపింది -ఓణీలు వేసే వయసొచ్చిందని
110.ఎంతదూరమైనా ఎదురీదుతా –నీప్రేమప్రవాహంలో

111.మారాకు వేసింది కొమ్మ -నీమనసులో కొత్త ఊహల్ల్లా
112.మన సరాగాలు -మానస రాగాలు
113.ఆనంద పారవశ్యంలో నేను -ఆరునొక్కరాగంతో నీవు
114.అగరుధూపం గదినిండా -ఆత్మీయ భావం మదినిండా
115.అలకెందుకో అలుక -భూమాత అక్కునచేర్చుకోలేదనేమో

116.మరులుగొలుపుతూ -మల్లెలువిరబూస్తున్నాయి
117.మాధుర్యం నీ మాటల్లో-మధువులూరుతున్న పెదవులతో
118.మధువును గ్రోలేది ఒక్కటే-పువ్వుచుట్టూ భ్రమరాలెన్ని తిరిగినా
119.మంజీరనాదాలు మ్రోగుతున్నాయి -మంగళకర సమయంలో
120.మానసచోరుడే -మరో కాంతను వశపరచుకున్నాడు

121.అమ్మని,ఆలిని గౌరవించు -వేదికలెక్కి ఉపన్యాసాలక్కరలేదు
122.అమ్మచనుబాలే ఆడతనం -ఆత్రంగా వెతకక్కరలేదు
123.చనిపోయాకే దినాలు -ఇంకా ఆడది బతికుంది
124 అంబరాన్నే గెలిచింది -అలుపెరుగని పోరాటంచేస్తూ 7Mar 15
125.మగువల దినోత్సవం -మగవారి అద్యక్షతన
126.మహిళా రక్షణ చట్టం -అడుగడుగునా రాక్షసఘట్టం
127.విషపు గుటకలు మింగుతున్నా -పెదవులపై చిరునవ్వు తనస్వంతం
128.వేటగాళ్ళే తనచుట్టూ -బెదురుచూపులతో అలసిన లేడికూన
129.మనసెప్పుడూ పవిత్రమే -నీనామ స్మరణతో 7Mar 15
130.కట్టినబట్ట కాదు -అర్ధనగ్నంగా నీమనసు
131.సభల్లో స్త్రీ సన్మానం -నడిరోడ్డుపై దోపిడీ చేయబడ్డ మానం
132.స్త్రీ జనోద్దరణకు అత్తగారి ఉపన్యాసం-ఇంట్లో కోడలి నిత్య ఉపవాసం
133.కోడలు కలలుకంటోంది -అత్తగారిని ఎప్పుడవుతనా అని

134.నువ్వు ఎదుటేవున్నావు -నీ ఊపిరి తగులుతోంది నాకు
135.మరణిస్తామని తెలుసుగా-మమకారం వదల మెందుకని
136.మల్లెలు నవ్వుకుంటున్నాయి -నీ కొంటె చూపులకు మైమరుస్తూ
137.నువ్వు నేను మౌనం -మనిద్దరిదీ ఒకటే ప్రాణం
138.ప్రతిక్షణం నీ జపం -పరీక్షించడం ఎందుకు పరవసించక
139. నింగి నేల తాకే చోటు -చుమ్బించిన అధరాల తీరు
140.పచ్చా పచ్చని పైరు -పల్లెమ్మ చుట్టిన కోకతీరు
141.జలజల పారే సెలయేరు -జవ్వని నవ్వుల తీరు

142.ఆరాధిస్తూనే ఉంటానిన్ను -అలా కళ్ళల్లోకి చూస్తూ
143.కోయిలకొత్తగా కూస్తోంది -మావిచిగురు మత్తులో
144.జవనాశ్వం లా నువ్వు ఆశలున్నా జవసత్వాలు ఉడిగి నేను
145.మెత్తగా గుచ్చుకుంటూ -కొత్త ఆశల పచ్చిక
146.నీ పెదవిపై చిరునవ్వు -తొలికిరణం తాకిన తుషారంలా
147.ఈ జన్మలోనూ నను వెంటాడుతూ నువ్వు -జన్మజన్మల బంధమేమో
148.పాట వై వస్తావు -పూటకో పల్లవితో పరవశింప చేయడానికి

ఏక వాక్యాలు –ఏకతారాలు -4



76 మనసులో ఏకాంతం తప్పదు- .మౌనం వీడనంతకాలం
77..మాట మారుస్తావు నువ్వు -నేను ఏమరుపాటుగా వుంటే

78.ఓటమి కూడా ఆనందంగానే వుంది -నీ తో ఓడిపోతున్నప్పుడల్లా

,79 .ఊరంతా వూహా గానాలే -నువ్వు నేను ఒకటయ్యామని

80 మొల్లలన్నీ విచ్చుకున్నాయి- ఎల్లలు లేని మన ప్రేమకు చిహ్నంలా

81.మదిలో ఎదో అలజడి -నీ సవ్వడి వింటూనే

82.మినుకు మినుకు మంటున్నానని తార కెంత గర్వమో
83..అలకే ఒక ఆభరణం -నీకులుకులు దాచుకోడానికి
84.సూర్యునితో పోటీ పడుతూ -పట్టపగలు వీధి దీపాలు
85.మౌనం రాజ్యమేలుతోంది -అమావాస్య చీకట్లో
86.ఒదిగిపోవడం మంచిది -ఓడిపోతామనుకున్నప్పుడు
87.ఓటమి నాచివరి మజిలీ -నీ ఒయారానికి తలవొగ్గి
88..ఒయారం వొలకబోస్తూ నువ్వు -జారిపడి ఓటమి అంచులలో నేను
89.ప్రేమమందిరం చివరిమజిలీ - ఓటమి ఎరుగని బహుదూరపు బాటసారికి
90చీపురు నడుంబిగించింది - సమాజంలో పెరిగిన చెత్త ఊడ్చ డానికి

91.ప్రేమ మైకంతో చదవలేక పోతున్నా - మన ప్రేమకావ్యాన్ని
92.కలలే కంటినిండా -అలలుఅలలుగా
93.ముద్దడిగా - ముగ్ధమనోహరంగా ముద్దమందారంలా వున్నావని
94.చిరుజల్లులా నీప్రేమ -ఐనా తడిసిముద్దవుతున్నాను



95.మూతి ముడుచుకోకలా -ముని మాపు వేళకు వస్తాగా
96..అందనంత ఎత్తులో నీవు -నిన్నల్లుకోవాలని నేను
97.ఆరాధన విలువెంతో -ఆ రాధకు తెలుసు
98. వేలెంటైన్ నంటాడు -వేలెడంత లేడు
99.అనుభవించాలని వుంది -ఆనందానుభూతిని
100.ఉన్నజ్ఞాపకాలు కొట్టుకు పోతాయి- జడివాన మాత్రం కురిపించకు

ఏక వాక్యాలు –ఏకతారాలు -3



51.మబ్బులన్నీ మాటువేసాయి -జాబిల్లి పై దాడిచేయడానికి
52.మనిషి మీద ఎంత ప్రేమో -రక్తంమరిగిన దోమ కి
53.మయూరానికి తెలుసు -కరిమబ్బులు కమ్ముకుంటాయని
54.రాత్రినిదురోయింది -సడి చేస్తే చంటోడు ఉలిక్కిపడతాడని

55..తగువెందుకు నీకు నాకూ -తూరుపు తెల్లారి పోతుంటే
56.ఎదురుచూసిన క్షణాన్నడుగు -నీకై ఎంత పరితపించానో
57.వణికి పోతోంది పాపం -ప్రేమ మంచులోతడిసిన మనసు
58.పూజకు పాత్రంకావాలని -పూసిన ప్రతి పువ్వూ
59..కొంటెగా చూస్తున్నా -కొంగుచాటు కృష్ణుడిలా

60.బండిలాగుతూనే వున్నా -బ్రతుకు జీవుడా అని
61.కాలి బూడిదై పోతున్నాయి కోరికలు-భోగి మంటల్లో పిడకల్లా
62.కొండెక్కి కూర్చుంటున్నాయి ధరలు -కొత్త అల్లుడి కోర్కేల్లా
63.దోసిలి పట్టా -నీనవ్వుల ముత్యాలు ఏరుకున్దామని
64.వాడిపోయాయి పూలన్నీ -నీనవ్వులు లేని నా జడలా

65..బృందావనం సిగ్గుతో ఎర్రబారింది-రాధామాధవుల ఊసులు వింటూ
66.చిత్తరువునైపోయాను-చిత్రంలోచెలి చేతులుచాచిరమ్మంటే
67. ఒక్కసారీ తిరిగిరావు-జన్మజన్మలబంధమైవుండిపోతానన్నా
68. చెలీచెలీ అంటున్నారు చలికివణుకుతున్నవారంతా
69 .ప్రేమసందేశాన్నిపంపా-శాంతిగీతమాలపిస్తూ
70. విశ్వ శాంతికోసమే- .ప్రేమ సందేశమైనా శాంతి సందేశమైనా
71.ముళ్ళు గుచ్చుకున్నా మనసునొచ్చుకున్నా -సందేశమే నా సంతోషం
72..చాచా కిష్టం -గులాబులన్నా శాంతి కపోతమన్నా
73.ఆకాశ మంతా విహరిస్తాయి -కోర్కెలే రెక్కల గుర్రాలయినప్పుడు
74..కొంటె కోర్కెలు నామదిలో -క్రొంగొత్త అందాలు నీలో విరిసినప్పుడు
75..కన్నీటిపొర నీ కళ్ళలో -తదేకంగా తమకంతో నా వైపు చూసినప్పుడు

ఏక వాక్యాలు –ఏకతారాలు 2



26 .కసిరి దూరం చేస్తావు కొసరి దగ్గరవుతావు -అర్ధంకాని చిత్రానివినీవు
27. వేణు గానానికి లోకం మైమరిస్తే - నీ ప్రేమ గానానికి తరిస్తుంది నా

28. గువ్వనై వొదిగి పోనీ గుడికట్టిన నీగుండెలో
29.నువ్వింతచోటిచ్చావు -నీగుండెంతా నిండిపోయాను నేను
30.ఎందుకీ పరవశం -ఎదనిండిన నారూపానికే
31.పల్లవించనీ నీ పరువాన్ని-కోయిలకూజితాలకై
32..చలికెందుకో చెలిమీద అలుక -వెచ్చని దుప్పటిలా ,కప్పుకొంటాననేమో
33.నిన్న లేని భావం నేడు ఎందుకో -నీ వైపు పదే పదే
34.మొక్కలా మొదలయ్యింది -మానులా ఎదిగింది మనప్రేమ
35.చర్వితచరణమే అయినా నీ చరణారవిందములు తప్ప ఏమెరుగను

36.నా గుండె జారిగల్లన్తవుతుంది -నీ కంట గోదారి పొంగుతుంటే
37.దోచుకోవాలనిపిస్తుంది -నువ్వు దాచుకొన్నకొద్దీ
38.ముప్పిరిగొన్న ఊహలు-మురిపిస్తూనువ్వు
39.జలతారు వోణీ వేసుకున్నజాణవులే -జామురాతిరి జోల పాడవస్తావు
40.వేణువు ఊదితే మధుర గీతాలు -నీమేనుతాకితే సుమధుర భావాలు
41.నీ పెదవి కందింది -పంటిగాటు పడిందేమో
42.ఆత్మీయత ఔషధం లాంటిది -మనసు రుగ్మతలను తొలగించడానికి
43..ఎందుకో నువ్వలా నేనిలా-సందె పోద్దుపోయినా
44.వొంటరి గా ఉండలేక పోతున్నా-ఎన్నిజన్మలనుంచి కలిసున్నామో
45..అరవిరిసిన మొగ్గలానువ్వు -అల్లరితుమ్మెదలా నేన
46..చెరిగిపోని పచ్చబొట్టు -నీ పెదవి పై నా తొలి సంతకం
47.ఇప్పటికీ పదహారేళ్ళే -నీతో బంధం పెనవేసుకున్న నా మనసుకు
48.నీ నవ్వుల వసంతం వస్తోంది -నా ఎద కోయిలకూస్తోంది
49.నా కొంటె తనాన్ని కవ్విస్తోంది -నీ వాలు జడ కులుకు

50.. రాచిలక కులుకు చూసా - రామచక్కని దాన నీలో

ఏక వాక్యాలు –ఏకతారాలు



ఏక వాక్యాలు –ఏకతారాలు

1.అందమైన కల చెదిరింది -కలత నిదురతో

2.ఆమని వచ్చింది -నీ ప్రేమ గీతంలా

3.శివుని తలపై గంగలా -నిరంతరం తడిపేస్తున్నావు నీప్రేమతో

4.ఆవలితీరాన నువ్వు ఈవలితీరాన నేను-ప్రేమ వంతెన వేద్దామా

5.రెండు పున్నములు ఒక్కసారి-నింగిపై జాబిల్లి ఇలపై నువ్వు

6.తనివితీరా చూడనీ -కాంక్షలు తీరిన నీ మోము

7.మాధుర్యం నీమాటల్లో కాఠిన్యం నీచూపులలో
8.నిదురపుచ్చ లేను నా మనసుని -నీ ప్రేమజోల పాటలేనిదే

9.ఎంతని వెదికానో నిన్ను- నా ఎదలోతుల్లో దాగున్నావనితెలియక

10.గోరంత దీపానివి నువ్వు -నా జీవితంలో కొండంత కాంతిని నింపావు

11.మందు పూసినకొద్దీ గాయం పెద్దదవుతోంది -నీ స్పర్స లేక

12.కాలుష్యపు కార్చిచ్చు లో కాలిపోతోంది అందమైన నందన

13.రాశి పోసిన సౌందర్యం- రామకోటికి ఇంకెక్కడ సమయం
14.రవ్వల దుద్దులు తెచ్చా- నువ్విచ్చే ముద్దులకోసం
15.కలానికిపదునెక్కువవుతోంది -ఏకవాక్యాలు నూరి నూరి
16.కోటి వీణలు మోగుతున్నాయి నీ మధుర గాత్రంలో
17.కోరికలు చెలరేగుతాయి -కొంటెగా అలా చూడకు

18.నాకిష్టమైనది ప్రతీది నీకిష్టమంటావు -నాయిష్టం నువ్వేగా మరి
19.దుప్పటినై కప్పుకోవాలనివుంది -చెలి చలి కి వెచ్చగా
20.ఊసులాడే వేళ-ఊర్మిళాదేవిలానీ నిద్ర
21.ఇంకెందుకు ముత్యాలసరం- నువ్వే నాకొక వరం
22.ఊపిరి తీయడం మానేసా -నువ్వేనావూపిరని తెలిసాక

23.మేనికి పూసిన సుగంధం -మనసున పలికిన ప్రబంధం
,24.నీ ప్రేమ స్పర్సతో నిదుర లేస్తా -నీ మోవి స్పర్సతో నిదురపోతా
25.నీకెంత దగ్గరవ్వాలనుకున్నా-అందనంత దూరంలో ఆకాశాన నువ్వు

సిరిమువ్వలు



(కవితల సుమహారం-72)

సిరిమువ్వలు నీ పాదములపై పరవశించినవి
సరిగమలతో రాగం నీ పెదవులపై పలికినది
నీ నవ్వులలోసిరిమల్లెలె విరిసినవి
ఆ పరిమళమే మందపవనమై ననుతాకినది
నీ నడుమేవయ్యరంగా వూగుతువుంటే
నాగుండెల లో మృదంగమే మోగినది
నీగాజులగలగల లే నను నిదురలేపుతూ
తీయనికలలకు రూపంనీవని తెలిపినది
జాబిలి వెన్నెల చల్లగతడుముతువుంటే
మదనుని తాపం నాలో విరిసినది
కాటుకకన్నులు నను కలవరపెడితే
గీతాలకు భావం ఉబికి వస్తున్నది


ప్రేముందని తెలిసింది

(కవితల సుమహారం-71 )
నాగుండెల్లో ప్రేముందని నిన్ను చూసాకే తెలిసింది
నా మనసుకి కూడ భావముందని నిను కలిసాకే తెలిసింది
నా జీవితంలో విరిపూలు పూస్తాయని నీ నవ్వు చూసాకే తెలిసింది
నామాటల్లో తేనెలొలుకుతాయని నీ పలకరింపు చూసాకే తెలిసింది
నాకంటూ ఒక జీవితముందని నీతో ఎడడుగులువేసాకే తెలిసింది
నాకంటూ ఒకతోడుందని నీ చేతిలో చెయ్యి వేసాకే తెలిసింది
నా ప్రతిరూపం నీలో వుందని నీకంటి వెలుగు చూసాకే తెలిసింది
నా జీవననావకు చుక్కానివి నీవని నీ దరిచేరాకే తెలిసింది
నాకంటూ ఏముందని నా దంతా నీదేనని నీ ప్రేమ రుచి చూసాకే తెలిసింది
నాహృదినిండా ప్రభాత సమీరాలు నీ ఎద తడిమాకే తెలిసింది

భూమాత -విలాపం



(కవితల సుమహారం-70 )

బరువెక్కిన భూమాత గుండె
ఒక్క సారిగా నెర్రలు వారింది
నిలువునా కుంగి పోయింది
ఎందరినో తన ఒడిలోకి చేర్చుకుంది
గుండెల్లోకి పొదువుకుంది
ఈ భారం ఎంతో కాలంమోయలేనని
బాధాకరమైనా తనబిడ్డలని
ఇలా శిక్షించక తప్పటం లేదని
గుండెలపై బరువు తొలగించకుంటే
ఇంకా విలయం తప్పదని
తానుచేసిన పని తప్పుకాదని
రాబోయే తరాలకు కనీసం
నిలువ నీడ ఇవ్వడంకోసం
కొందరు అభాగ్యులను తీసుకుపోకతప్పదని
సంతాపం తెలుపుతూ కన్నీరు కారుస్తూ భూమాత ఇలా !

కన్నీరు



(కవితల సుమహారం-69 )

గుండె పొరల నుండి అలలు అలలుగా
కంటి కొలకులనుండి చినుకు చినుకులా
చెక్కిలి పైనుండి చిన్నాగా
ఎక్కిళ్ల మధ్య మొదలై ధారగా
కారే కన్నీరు ,కారణమేమో మరి
తట్టుకోలేని భాధతో,తడి నిండిన మనసు
ఎవరితోనూ పంచుకోలేని వేదనకు ప్రతిరూపం
కన్నీరే కదా అని తుడిచేయాలనుకోకు
పొంగుతున్న లావా లాంటిది ఆ ద్రవం
వదిలేస్తే అదే ఒక మహా సంద్రం
కన్నీరు తుడవాలంటే కారణం తెలుసుకోవాలి
ప్రేమతో ఒదార్చాలి,ఆత్మీయత ను అడ్డుకట్టగావేయాలి
నువ్వే ఆకన్నీటికి కారణమైతే ఆ వరదలో కొట్టుకుపోతావు
సీతమ్మ కన్నీరు కారిన లంక సర్వ నాశన మయ్యింది
ద్రౌపది కార్చిన కన్నీటి కార్చిచ్చు కురువంశాన్ని తుడిచిపెట్టేసింది
అందుకే కలకంటి కంట కన్నీరు కారనివ్వకు

మిణుగురులు



(కవితల సుమహారం68 )

మన తెలుగు మన సంస్కృతి చిత్ర- క వి త – 81 లో ద్వితీయ విజేత
మిణుగురులు
నేత్రాలున్నాచూడలేని అందాలెన్నో సృష్టిలో
జ్ఞాన నేత్ర మిచ్చె ఈ మిణుగురులకుభగవంతుడే
కామందులు, జ్ఞానాన్ధులు అహంకారాన్ధుల లోకంలో
లోకంపోకడ చూడని జ్ఞాన ప్రకాశులు వీరు
సంగీత కళా కోవిదులు ,సూక్ష్మగ్రాహ్య ప్రతిభాశాలురు
చూపులేనివారని చిన్నచూపుచూడ తగదు
బ్రెయలీ మహాశయుడే అక్షర రూపకర్తగా
ఆధునిక పరిజ్ఞానంతో ఎన్నోవిజయాలకు ఆనవాళ్ళు
క్రమశిక్షణతో దారితప్పని జీవితాలువీరివి
జాలిచూపడంకన్నా చేతనైన చిన్న సాయం మిన్న
చిరుసహకారం వుంటే స్వయంప్రకాశం తో శోభించే
ఈ మిణుగురులు సమాజానికి స్పూర్తి ప్రదాతలు

యువతరం



(కవితల సుమహారం-67 )

యువతరం నరనరం ఉరకలేస్తోంది
భారతజాతి నవ నిర్మాణానికి
కండ బలం గుండె బలం పెంచుకొంటూ
కొండలనైనా పిండిచేసి
అడ్డంకులు అధిగమిస్తూ
ఉద్యమాలే ఊపిరులుగా మున్ముందుకు సాగుతూ
ఇది ఒకప్పటి యువతరం
శరీరధారుడ్యం ఇప్పుడొక అవసరం
పెరుగుతున్న నాగరికత ముసుగులో
పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్ వ్యామోహంతో
పెరుగుతున్న ఊబకాయం
వీధినపడి ఉదయపునడకలు సాయంత్రపు నడకలు
ఉరేగిమ్పులా ఒకళ్ళని చూసి ఒకళ్ళు
ఆహారనియమాలతో శరీరశుష్కింపులు
ఆడ మగ చిన్నా పెద్దా తేడా లేదు
ఎందఱో వ్యాపారులు
బలహీనతలను సొమ్ముచేసుకుంటూ
ఇదీ నేటి భారతం

సాయినాధా !



(కవితల సుమహారం-66 )

సాయినాధా ! శిరిడీ గ్రామ నివాసా !
సకలలోక పుణ్య ప్రకాశా
నీ నామమే కడు పావనమై
పతితుల నుద్ధరించు పరమౌషధము కాదా
కనులముందు నీ రూపమే కనిపించు
కలనైన నీవే అగుపించు
కోరి ఎవరినైన తన దరి కీడ్చి
కష్ట నష్టములనుండి దరి చేర్చు
శ్రద్ధ సాబురిలే నీకు సమర్పింతు
శ్రవణమధుర మే నీకీర్తనము
సతతము నీపాదములే శరణని నమ్మి
సమాధి నుండి నీ సమాధానములు విని
సర్వాంతర్యామివని కోరి కొలిచేము సాయినాధా
కులమతాలకతీతుడవై దర్శన భాగ్యమిచ్చి
కూలదోసినావు అడ్డుగోడల నన్నిటిని
కుష్టు రోగి నైన కోటీశ్వరు నైన ఒక్కరీతిగా చూచి
సకల జీవరాసులందు నిన్ను నీవుగాచూపి
జీవకోటి ఆకలి తీర్చ వెలసినావు ఇలలోన
బిక్షాటన చేసి ఆదర్శ మైనావు మానవాళికి
నిను నిరతము నమ్మి కొలతు సాయీశ్వరా

చెక్కిట చెయ్యి చేర్చి



(కవితల సుమహారం-65 )

చెక్కిట చెయ్యి చేర్చి ఊహల ఊయలలో
నింగివేపు నిక్కిచూసి చల్లని వెన్నెలలో
పసిపాపనై అమ్మవొడిలో పారాడనా
పాలబువ్వలకై అమ్మనే ఆడించనా
పసితనపు భావనలు మది నిండ
చందమామ కథలెన్నో ఆలకించి
నాన్న గుండె పై ఆదమరచి నిదురించిన
తీపి జ్ఞాపకాల పొరలెన్నో తరచి చూడనా
యవ్వనపు తొలినాళ్ళలో జాబిల్లి రూపులో
వలపు నవ్వులురువ్వే ప్రియురాలి రూపమే
పిండారబోసినట్లున్న వెండి వెన్నెలలో
శ్రీమతితో పంచుకున్న పరిష్వంగన లే
దాచుకున్న మధురోహాలు ముప్పిరిగొంటూ
అందాల చందురిని చూసి మైమరస్తూ
నెమ్మదిగా జారుకొంటున్నా ని....దు ....ర......లో......కి

ర అక్షర కవిత



(కవితల సుమహారం-64 )

రక్షించుమనుచు గజేంద్రుడు నీ
రజనాభుని ఎలుగెత్తి పిలువ
రమావినోది ఒక్క పలుకైన పలుకక
రయమున ఆయుధమ్మైన ధరియించక
రమ్మని గరుత్మంతునైన పిలువక వెడలుచుండ
రవంతయు అవగతముకాక హరివెంట కదలె,సు
రలెల్ల ఏమి జరిగెనోయనుచు ఒకరివెనుకనొకరు
రక్త మోడుచు బలహీనమగుచు కరి మకరి చె
ర విడిపిమ్పుమనుచు శ్రీహరి రాకకై ,అ
రమోడ్పు కనులతో నిరీక్షించు చుండ ,క
రమున సుదర్సనముతోడ ప్రత్యక్షమాయె
రమాకాంతుడు మోక్షమిచ్చె గజేంద్రునకు

ల -అక్షర కవిత



(కవితల సుమహారం-63 )

లక్షణముగ నుదుట తిలకము దిద్ది ,నీలా
ల ముంగురులను దువ్వి
లలనామణి మంగళకర మౌ
లక్ష్మీ దేవిని స్తుతించుచూ తన జీవితమున
లక్ష్యమును సాధించు దిశగా
లవ లేశమైన ఆటంకములు కలగకుండ
లలిత పల్లవ కోమల కుసుమము
లను కోసి పూజించి కోరెను
లఘువ్రతా విధానమున
లతాంగి వినమ్రత వుట్టిపడగ ,విరు
లన్నియు ఏర్చి కూర్చి అందమైన మాల
లనుగుచ్చి ముదము మీరగ అమ్మకుఅర్పించె
లబ్ది చేకూరు నటంచు విప్రులెల్ల ఆశీర్వచనము
లనందించె , శుభములు కలుగ
లయకరుడు శుభకరుడు దీవించె

భావనలు



కవితల సుమహారం-(62)

సలలితముగ నామది పొంగు భావనలు
ఆలలిత లావణ్య భారతి పదఘట్టనములు
తలచినంతనే తనువు పులకించి
మొలక లెత్తు కవితా విత్తనములు
అలవోకగా ఆనందాంబుధి చేర్చు
కలనైన నేమరువజాలను కవి
తల సౌరభము,నిరతము మదినింపు కొందు
మాలతీ లతల సొగసువోలె మురిపెముగాను
ఆలమందలు వేణు గానమునకు
తలలూచినటుల ,వాగ్దేవి వీణియకు
కలము కదిలించి కవితా రసాధారల
వెలయింతు వరముగాను
పాలసంద్రమ్మున పొంగిన అమృత ధారవోలె

మృగ రాజమా



(కవితల సుమహారం-61 )
మన తెలుగు మన సంస్కృతిచి త్ర క వి త – 79

ధీరగంభీర మృగ రాజమా
నీ చూపులో క్రౌర్యం
నీనడకలో రాజసం
నిను స్వప్నాన చూచినంతనే
చెల్లిపోవు గజరాజు కాలం
అడవిమొత్తం నీకు దాసోహం
కేసరిగా నీ రూప విలాసం
భగవంతుని రూపంగా దర్సనం
భారతావనిలో తరుగుతున్న నీ జాతి ,
సంరక్షణకోసం జరుగుతున్న మహోద్యమం
వేటకు రారాజువు నువ్వు
అయినా వేటలో నీకొక నియమం
ఆకలైతేనే వేటాడే నైజం
రాచఠీవి కి నిదర్సనం "సింహా"సనం
అందుకే మృగజాతి కి నువ్వు గర్వకారణం

శ్రీరామనవమి



కవితల సుమహారం (60)

శ్రీ రామ కథా శ్రవణం సర్వపాపహరణం
అయోధ్యాపురమ్మది దశరథ పాలితమ్మది
మానవాళికి మధుర చరిత మందిచినది
కౌసల్యా సుమిత్రా కైకలకు జన్మించిరి మహావిష్ణు అంశగ
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ముదిమి మీరగ
అల్లారుముద్దుగ పెరిగినారు రాకుమారులు నల్వురు
దశరథుని కంటిపాపడై నింగి చంద్రునే కోరినాడు రాముడు
వసిష్టుని కనుసన్నలలో విద్యలెన్నియోనేర్చి
విశ్వామిత్రుని ఆజ్ఞమేర యాగ సంరక్షణ నెపమున
రామలక్ష్మణులు బల అతిబల లను నేర్చి
తాటకాది రాక్షససంహారము కావించి
గురువు వెంట మిథిలకేగి స్వయంవర మంటపమున
రమణి సీతను కాంచి రాఘవుడు శివధనుర్భంగము చేసె
పరశురాముని శక్తి గొని అతని అహమడంచి
లోక కళ్యాణమునకై సీతను చేపట్టి
అయోధ్యానగర మరుదెంచి ఆనంద మొందగా
రామపట్టాభిషేక మభిలషించి దశరథుడు ఆనందముప్పొంగ
రామజన్మ సార్థకత తెలిసి మంధర కైక నొప్పించి
దశరథుని వరమడుగునట్లు చేసి
రామవనవాసమునకు శ్రీకారము చుట్టె
పతివెంట సతి అన్నవెంట సౌమిత్రి వెడలె వనాటవులకు
రామమోహమున శూర్ప్హణఖ ముక్కుచెవులను కోల్పోయి
అన్న రావణు జేరి సీతాపహరణము నకు ఆజ్యముపోసి
బంగారు లేడికై సీత మొహించునట్లు చేసే
సీతగొని రావణుడు లంకజేరుచు జటాయువు సంహరించ
సీతా విరహాగ్నిదహించు చుండ సీతాన్వేషణ కై
జటాయువు జాడ తెల్ప చిత్రకూటముజేరి
హనుమంతునక్కున చేర్చుకొని ,సుగ్రీవునకు సాయమందించి
వాలిసంహారముచేసి వానర సేన గొని
హనుమంతు సహకారమున సీత జాడగొని
వారధి బంధించి లంకాపురముజని
రావణు పీచ మడంచి విభీషణునకు రాజ్య మిచ్చి
సకల వానర సేనా సమేతుడై సీతాలక్ష్మణ విరాజితుడై
అయోధ్యా నగరవాసుల ఆనందముప్పొంగ
పట్టాభిషిక్తుడయ్యె రఘుకులతిలకుడు శ్రీరాముడు
లోకములెల్ల ఆనందమునతేలె రామరాజ్యమునుచూసి
జయజయరామ సీతారామ జయ శ్రీ రామ

అంతా వ్యాపారమే



(కవితల సుమహారం-59)

అంతా వ్యాపారమే
గుప్పెడు వేప పూవు
చిన్న మామిడి పిందే
దేవుడికి కొట్టే కొబ్బరికాయ
అవకాశ వాద వ్యాపారం
దేముడి మీద భక్తీ ఉంటె
కొంటావా చస్తావా ?
ఈ రోజు దాటితే విలువ ఉండకపోయినా
ఈ రోజే సొమ్ము చేసుకోవాలి
అందుకే సామాన్యుడి నడ్డివిరుస్తూ
ఏది ఎప్పుడుఅవసరమో అప్పుడే
ధర పెంచేసి దోచేస్తే సరి
ప్రజానాయకులు మాత్రం అసెంబ్లీల్లో
వీధి రౌడీల్లా కొట్టుకుంటూ
ప్రజలని మేమే ఉద్ధరిస్తామంటే
మేమే ఉద్ధరిస్తామని చొక్కా నలగకుండా
గుండెలు బాదుకొని ,బల్లలు చరుచుకొని
మల్ల రాబోయే ఎన్నికల దాకా
శవ రాజకీయాలు చేస్తూ
ఎన్నికలలో ఏమి లబ్ది పొందుతారో
ఒక్కొక్కవోటుని వేలకు వేలు కుమ్మరించి కొంటూ
తాత్కాలిక సుఖానికి అలవాటుపడ్డ వెలయాలిలా
ఆ సొమ్ముల కాశపడి అనర్హులను అందలమెక్కించే
విద్యావంతులు అజ్ఞానవంతులు
ఏమిసాదిస్తాం ఎటుపోతున్నాం?
ఇప్పటికైనా కళ్ళు తెరవలేమా ?
మనని మనంకాపాడుకోలేమా ?
అంతా వ్యాపారమే
మనదన్నది ప్రతీది గ్లోబల్ కి అప్పగించి
మేమే అభివృద్ధి అని గోబెల్ ప్రచారం
ముప్పావలా కోడిపిల్లకి మూడు రూపాయలు ప్రచారం చేసి
ముప్పై రూపాయాలు మనదగ్గరగుంజుతుంటే
సబ్బురాసుకుంటున్న హీరోయిన్ అర్ధనగ్నత్వం మోజులో మనం

ఉగాది



(కవితల సుమహారం-58)

వెలుగురేఖలు విచ్చుకొని
జిలుగు కాంతులు చిమ్ముతూ
జగాన అంధకారమును తరిమి
జవసత్వాలకు ఊపిరులూది
వినిపించెనదివో కోయిలకూజితము
కొత్త మామిళ్ళ కొంటె సోయగము
వలపు పులుపుల మేళవింపుతో
వయ్యారి నడకల నడచివచ్చెనదివో
వసంత యామిని కొత్త ఆశల పలకరింపుతో
షడ్రుచులసమాహార సేవనముతో
పంచాంగ శ్రవణాల భక్తి పారవశ్యముతో
రానున్నకాలాన్ని సుఖమయం చేసుకుంటూ
ఈ ఉగాది కోర్కెల రేడు మన్మధుని ఆశీస్సులతో
అందరికీ ప్రమోదాలను తేవాలని ఆశిస్తూ

చెలి -వసంతం



(కవితల సుమహారం-57)

వసంత మొస్తూనే వుంది
ఎన్నో వసంతాలను మోసుకొని
కోయిలకూస్తూనే ఉంది
కొమ్మలమాటున దాగుంటూ
గున్నమావి పూస్తూనేవుంది
ఎన్నోకాయలుగా మారాలని ఆశతో
మల్లెలు విరబూస్తూనే ఉన్నాయి
విరహాలను రెచ్చగొడుతూ
నా చెలి నవ్వు వెల్లి విరుస్తోంది
హృదయంలో మరులు గొల్పుతూ
కానీ నాజీవితంలో
ఎన్నో వసంతాలు మోడువారాయి
ఎద కోయిల గొంతు నొక్కేస్తూ
నా ఆశల మామిళ్ళు నేలరాలాయి
పిందెలు గానే వడ దెబ్బలు తగిలి
మల్లెలు మూగగా రోదిస్తున్నాయి
వేసవివేడికి మలమలమాడుతూ
నా చెలి చిరునవ్వు మాత్రం వెల్లి విరుస్తోనే ఉంది
నా హృదయానికి స్వాంతన చేకూర్చుతూ

రంగుల ప్రపంచం



(కవితల సుమహారం-56 )

రంగు రంగుల ప్రపంచం
రమణీయ ప్రకృతి సౌందర్యం
కనులు మూసినంతనే కలలై
మనసు పొరలలో నిక్షిప్తమైన
ఊహలవూసులను పొదువుకొని
ఎక్కడికైనా విహరించగలిగే
మనసు విహంగం కనే అద్భుత దృశ్యం
మనసుకు ఆహ్లాదంకలిగించే కళలు
మనోనేత్రంపై తీర్చి దిద్దిన చిత్రాలు
విశ్వాన్ని తాదాత్మ్యంలో ముంచే సంగీతం
నటరాజ నీరాజనం నాట్యసౌరభం
బ్రహ్మ సృష్టికి ప్రతిగా శిల్పకళా చాతుర్యం
ఇలా కళలన్నీ మనసును ఆహ్లాదపరిస్తే
మరి కలలు కంటూ కళలను సార్ధకం చేస్తూ
కళా నైపుణ్యాలతో కలలను సాకారం చేసుకుందాం


మనతెలుగు మనసంస్కృతి

ఓ మహిళా



(కవితల సుమహారం-55 )

ఓ మహిళా అందుకో నీరాజనాలు
నీ ప్రతిభకు గుర్తింపు ఈ సన్మానాలు
నీ లో లేవుఎ భేషజాలు
కానరావు ఎక్కడా రాజసాలు
ఇంత చేసినా ఇంటివద్ద మొదలు
తల్లిగా ఆలిగా నీనిత్య కృత్యాలు
రోడ్డుపైకి వస్తే క్రూరమృగాల వాలకాలు
అదును చూసి కాటేసే కాల సర్పాలు
నిను కాపాడేందుకు కానరావు ఏ శాసనాలు
అందుకే తిరగాబడాలి మృగాళ్ళపై కాళిక వై
సాధించుకోవాలి సాధికారిత నీకునువ్వై

నేను



(కవితల సుమహారం-54)

నిత్యంలా నేను
సత్యంలా నేను
నిర్భయంగా నేను
నిశీధిలో నేను
వేకువకై నేను
వేదనలో నేను
శోధన గా నేను
వేటాడే నేను
వెంటాడే నేను
వెన్నెలనై నేను
కన్నులలో నేను
కౌగిలిలో నేను
కనిపించే నేను
నేనే నేను
నీలో నేను
లేనే లేను

మహిళా దినోత్సవం



(కవితల సుమహారం-53 )

అమ్మను అమ్మా అని పిలవలేక
పక్కింటి కెళ్లి మాదా కోళంతల్లీ అన్నట్లు
ఆడదాన్ని వయసుతోనిమిత్తంలేకుండా
నఖశిఖ పర్యంతం చూపులతో తడిమేస్తూ
అవకాసందొరికితే స్పర్శతో తడిమేస్తూ
ఆడదాన్ని నిత్యం ఆటబొమ్మగా చేస్తూ
అర్ధనగ్నచిత్రాలను ఆబగాచూస్తూ
బట్ట ఎందుకు కట్టుకున్నారో తెలీక
బట్టలు సిగ్గుపడేలా వలువల విలువలు తీస్తూ
సంవత్సరానికొక్కసారి మాత్రం స్త్రీ జనోద్దరణ
రాత్రైతే పక్కలోకి ఏ అభాగ్యురాలినోబలిచేస్తూ
వేదికపై మాత్రం పరమ సాదువుల్లా ఫోజులిస్తూ
రాజ్యంగ సూత్రాలు వల్లెవేస్తూ మహిళారక్షణ
ఆడది అడుగు బయట పెడితే అది పగలైనా రాత్రైనా
అమ్మైనా, అవ్వైనా ,ముక్కుపచ్చలారని పసికూనైనా
కబళించడమే ,కామించడమే,కాముకలోకం
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిస్తేనే గాంధీ కలలుకన్న స్వాతంత్రం
అరగుడ్డకట్టుకునినడిరోడ్డులో పట్టపగలే తిరిగుతారని కాదు
పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం నైతికవిలువలను పాతర వేస్తుంటే
ఆడది అత్యున్నత శిఖరాలను ఎక్కుతుంటే ఒకపక్కనీరాజనాలు
అదే ఆడదాన్ని విలాసవస్తువుగా వాడుకునే నీచజనాలు
మహిళా దినోత్సవాలు జరుపుకుందాం ,ఏ సంవత్సరం
ఒక్కమానభంగం కేసు నమోదవ్వ దో అప్పుడు
ఒక్క వరకట్నపు చావుకూడా నమోదవ్వ దో అప్పుడు
ఆడదే ఆడదాన్ని శత్రువుగా ఎప్పుడు చూడదో అప్పుడు
ఆడపిల్ల పేరుతొ ఒక్క భ్రూణ హత్య గాని,కుప్పతొట్టి న వెయ్యడంగాని
ఎప్పుడుజరగదో అప్పుడూ ,ఆడదాని కన్నీరు ఎప్పుడు ఆగుతుందో అప్పుడూ

ప్రేమ -"విశ్వ" రూపం



(కవితల సుమహారం-52)

ప్రపంచాన్నిఆడించేది డబ్బు అంటారు అందరూ కానీ
ప్రపంచాన్ని నడిపించే మంత్రం మాత్రం ప్రేమ
రూపమేదైనా అపురూపమైనదేభావం
తల్లిగర్భంలో ప్రేమ అనే పేగుబంధం
లోకంలోకివచ్చాక తల్లి వొడి అనుబంధం
అమ్మ,నాన్న,అక్కా,అన్నా,చెల్లి
చుట్టూఉండే బంధాలు ప్రేమకు ప్రతిరూపాలు
నాది అనేభావమే ప్రేమకు పునాది
అది వస్తువైనా బంధమైనా,జీవరాసులైన
మనబడి పై ప్రేమ,మనగురువుపై ప్రేమ
చదువుపై ప్రేమ ,సాధించాలనుకున్న లక్ష్యం పై ప్రేమ
ఇవన్నీ ఒకెత్తైతే యవ్వనారంభంలో మొలక లెత్తే ప్రేమ
జీవనగమనాన్ని నిర్దేశించే చుక్కాని
ప్రేమలోమాధుర్యాన్ని గ్రోలవలసిందే కానీ
ఒక ప్రేమకోసం మరెన్నో ప్రేమలను త్యాగం చేయాలా
బంధాలకోసం మనసులో పుట్టిన ప్రేమను వదిలెయ్యాలా
ప్రేమ ఆకర్షణ కాకుంటే పుట్టిన ప్రేమకు మరణంలేదు
ప్రేమకు పరాకాష్ట పెళ్ళే కానఖ్కరలేదు
ప్రేమంటే రెండు శరీరాల వేడి చల్లార్చుకోడం కాదు
ప్రేమంటే ఎదుటివారి సుఖాన్ని కోరుకోవడం
వారి ఆనందాన్నిమనం అనుభవించడం
కానీ నేడు వెర్రితలలు వేస్తున్నప్రేమ
దానికి ఆజ్యంపోస్తున్న మాధ్యమాలు
మనిషిని మనిషిగా ప్రేమించాలనే భావంతో
విశ్వమానవ ప్రేమకు ఊపిరులూదాలి
చివరిగా అన్నిటినీ మించి మనందరికీ ఒక్కటే ప్రియమైనది
ఎవరుఅవునన్నాకాదన్న మన ప్రాణం పై ప్రేమ
ఎవరున్నాలేకున్నా ప్రాణం లేకుంటే ప్రేమేది?


సాహితీసేవ చిత్రకవితల పోటీ -13 "ప్రేమ"

హస్త కళా బొమ్మలు



(కవితల సుమహారం-51)

కళలకు కాణాచి మనతెలుగుతల్లి
అందునా హస్తకళలకు మేటి
రంగురంగుల కొయ్యబొమ్మలైనా
రంగరించిన సంస్కృతీ చిత్రాలైనా
కళాప్రేమికుల మనసుదోచేట్లుగా
చిన్నపిల్లల ఆటబొమ్మలు
అందంగా అలంకరించుకునే
బొమ్మలకొలువు బుట్ట బొమ్మలు
జానపదా కళారూపాలుగా
వీధివీధినా అలరించే తోలు బొమ్మలు
విదేశీ వ్యాపరంమోజులో పడి
మరుగున పడుతున్నసంస్కృతీ చిహ్నాలు
పొట్ట గడవక పోరాడుతున్నజీవితాలు
ప్రభుత్వాలైనా ఆదరించి అండగా నిలిస్తే
కళా పిపాసులు అక్కున చేర్చుకుంటే
కలకాలం నిలిచి మనగలుగుతాయి
లేదంటే గతకాలపు స్మృతులుగా నే మిగిలుంటాయి


మన తెలుగు మన సంస్కృతి
చి త్ర క వి త – 75 -హస్త కళా బొమ్మలు

చదువది ఎంతగల్గిన



సాహితీ సేవ చిత్ర కవితల పోటీ -12 లో 'నేటి విద్యార్ధి 'అంశంపై* చదువది ఎంతగల్గిన * " ఉత్తమ తృతీయ కవిత" .
_________________/\________
(కవితల సుమహారం-50)


అన్నప్రాసన నాడే ఆవకాయచందంలా
అ ఆ లబదులు ఏ,బి,సి,డి లు
వర్ణక్రమాలు తెలియకపోయినా వల్లెవేసే చదువు
పల్లెలలోసైతం ఇంగిలీసు చదువు
వాడిబరువు పదిహేనుకేజీలు మోసేది పాతిక
పొద్దున్నే చద్దన్నం మూటలా లంచ్ బాక్స్
పొద్దున్నేపోతే పోద్దోయాకే ఇంటికి
అస్సుబుస్సంటూ వస్తూనే హోమ్ వర్కులతో భేటీ
ఓ ఆటా లేదు పాటా లేదు నిత్యం సిలబస్సు లతో కుస్తీ
రేంకు లవేటలో అమ్మానాన్నా ఒకటే హడావిడి
వీధికో విద్యాలయం ఊరికో ఇంజనీరింగ్ కాలేజీ
ఏటేటా కుప్పలుతెప్పలుగా నిరుద్యోగుల ఉత్పత్తి
నేర్చేవిద్యలో ఎక్కడా కానరాదు క్రమశిక్షణ
సంస్కృతీ సాంప్రదాయాల విలువలూ హుళక్కి
గతకాలం చదువులలో జ్ఞానం ,విజ్ఞానం,విలువలు
ఇప్పుడు పూర్తిగా వొంటిమీద నిలబడని వలువలు
తెలుగు సంస్కృతం విలువలు లేని విషయాలు
మిగిలినవన్నీ విద్యార్థికి అర్ధంకాని వలయాలు
సెల్లు,బైకు,సినిమావ్యామొహం
చదువది ఎంతగల్గిన సమాజహితములేని చదువు
అర్ధ వ్యామోహముతో కూనారిల్లుతున్నచదువు
అందుకే పెద్దబాలశిక్షలుకావాలి మనం నేటితరానికి
పిల్లలచదువులే వారసత్వసంపద కావలి భావితరానికి.

"శూన్యం



మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన 74 వ చిత్ర కవిత పోటీ –
"శూన్యం " – నందు ప్రథమ విజేతగా నిలిచిన కవిత (కవితల సుమహారం-49 )

శూన్యం అంటే ఒక నిరాశ
శూన్యం లోకి చూస్తూ జీవితాన్ని గడిపేస్తూ
ఎందఱో నిరాశాజీవులు
న్యూనతా భావానికి శూన్యతే ఆధారం
కానీ శూన్యం అంటే సున్నా అనిఅర్ధం
అది ఒక్కటే ఉంటె శూన్యమే
మరో అంకెపక్కకు చేరితే ఆ అంకెకూవిలువే
శూన్యానికి విలువే
మనజీవితంకూడా అంతే
శూన్యాన్ని నీ ఆశల అంకెలపక్కకుచేరిస్తే
అది పూర్ణం అవుతుంది
నీజీవితం పరిపూర్ణమవుతుంది
శూన్యం నేర్పే జీవిత సత్యమిదే
శూన్యం లో ఎన్నోవింతలు
జీవితంలోని శూన్యాన్ని శోధిస్తే
ఆవిష్కరించబడే ఎన్నోఅద్భుతాలు
అందుకే శూన్యాన్ని చూస్తూ కూర్చోకు
నిన్నునీవు తిట్టుకోకు

సాయి ప్రభో



(కవితల సుమహారం-48 )

నిరతము నీనామ జపము ,నీ సత్
చరితము పారాయణంబు ,నీ కరుణా
సముద్రమున స్నానంబు ,నీపాద ధూళి సోకిన
ద్వారకామాయి దర్శనంబు ,నీ మహిమ
నోచుకున్న ఊది ప్రసాదంబు ,మాబోంట్లకు
పెన్నిదికాదా,సదాధ్యానింతుము సాయి ప్రభో

పయనం



(కవితల సుమహారం-47 )

నీపయనం ఎంతదాకా ?
గమ్యంతెలుసా?
ఎప్పుడుముగుస్తుందో తెలియని జీవితం
అంతదానికే ఏదో సాధించాలని పేరాశ
ఏదైనా అనుకోనిదిజరిగితే నిరాశ
ఒక్కచిన్నవిజయం పొందితే
ఇంకా ఎదో పొందాలని దురాశ
ఇచ్చినదానితో తృప్తి పడలేము
ఎక్కువిచ్చినా అనుభవించలేము
పందెంలో విజయం పొందాలంటే
నీకొక లక్ష్యంకావాలి కానీ
బుద్బుద ప్రాయమైన జీవితంలో
కోటానుకోట్లు గడిస్తూ
నీచుట్టూ విషవలయాలను ఏర్పరచుకొని
శత్రువులను పెంచుకొని
శాంతి లేకుండా గడపాలా ?
నేడో రేపో నీకు పిలుపు వస్తుంది
అంతదాకా తృప్తి గా జీవించు
గమ్యంరాగానే నీపయనం ఆగిపోతుంది

****మహాత్ముడు ****



(కవితల సుమహారం -46 )మన తెలుగు మన సంస్కృతి- చి త్ర క వి త – 73


భారతీయుల హక్కు మహాత్ముడు
సామాన్యుడుగా పుట్టిన మోహన్ దాస్
బిడియస్తుడైన ఒకయువకుడు
దక్షిణాఫ్రికా లో నల్లజాతి వారిబాధలుచూసి
భారతావనిలో తెల్లజాతి పీడనపై
సత్యాగ్రహ బ్రహ్మాస్త్రమెక్కుపెట్టి
కొల్లయిగట్టి శాంతీ అహింసల మంత్రంతో
జాతి జాగృతంచేసి ,పరపీడన పిశాచాన్ని
పారద్రోలేందుకు దండి వైపుగా అడుగువేసి
సహాయనిరాకరణ తో సాగిపోతూ
క్విట్ ఇండియా నినాదంతో జాతిని ఉర్రూతలూగించి
స్వాతంత్ర మహాపలాన్ని భారతమాతకు నివేదించి
కులమతవర్గ విభేదాలను రూపుమాపే దిశగా
జాతిసమైక్యతకు జీవంపోసిన జాతిపిత
నాథూరం తూటాలకు బలి అయ్యి
ధ్రువతారగా అందనితీరాలకు చేరిన "మహాత్ముడు"
నేడు మాత్రం వీధి వీధిన విగ్రహంగా
కుళ్ళు రాజకీయ నాయకుల నెత్తిన టోపీ గా మారి
నిరాదరణకి గురవుతుంటే ,అశ్రు నివాళి తప్ప
జయంతి వర్ధంతులకు మనమేమివ్వగలం మహాత్మునికి

ఆగమార్ధంతు



(కవితల సుమహారం-45 )

సాహితీ సేవ చిత్ర కవిత -11 పోటీ లో ద్వితీయ ఉత్తమకవిత

ఎందఱో భరతమాత ముద్దుబిడ్డల త్యాగఫలము
ఎర్రకోటపై ఎగురుతున్న మువ్వన్నెల పతాకం
మరిఎందరో మేధావుల ప్రసవ వేదనల
మేదోఫలము మన రాజ్యాంగం
రాజ్యాంగం పుట్టినరోజు మనకు పండుగరోజు
ప్రతి ఏటా జాతిని మమైకంచేసే వేడుకరోజు
పల్లెపట్టణం రాజధానినగరం సర్వాంగ సుందరం
రాష్ట్రాలనుండి శకటాల వయ్యారినడకలతో
దేశ రాజధాని కళకళలాడే వైనం
త్రివిధ దళాల వందన స్వీకరణతో
ఆకాశాన వైమానికి దళాల విన్యాసాలతో
రాష్ట్రపతి జాతికి ఇచ్చే సందేశంతో
ప్రజలంతా ఎంతో ఆనందానుభూతిని పొందుతుంటే
ముష్కర మూకలు జాతిసమైక్యతను సవాల్ చేస్తూ
విధ్వంసాలు సృష్టిస్తామని విర్రవీగుతుంటే
లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యమై
ప్రపంచంలోనే అతి పెద్ద శాంతి కాముక దేశమై
పొరుగువాడి పగకు బలిఅవుతూ ఇంకెందరిని
ఈ క్షుద్ర కుటిల ఉగ్రవాదానికి బలిపెట్టుకుందాం ?
మన న్యాయసూత్రాల లొసుగులతో ఆడుకుంటూ
ఆర్ధిక రాజధానిలోనే తెగబడేందుకు సిద్ధమైతే
హడావిడి తనిఖీలతో చేతులుదులుపుకొంటూ
చేతులుకాలాక ఆకులుపట్టుకోవడం
ప్రజా రక్షణకన్నా ప్రజానాయకుల రక్షణే ధ్యేయంగా
రాజకీయనాయకులకు కొమ్ము కాయడం
ఇంకెక్కడ గణతంత్రం,అంతా ధనతంత్రం ,అందుకే
ఆగమార్ధంతు ప్రజా తంత్రం గమనార్ధంతు ఉగ్రవాదం
గణగణ గణగణ మోగాలి గణ తంత్రపు జేగంటలు

కరిగించిన నాగుండె



(కవితల సుమహారం-44 )

కరిగించిన నాగుండెను
నీగుండెలో పోశా
నా పై నీ ఆశలు
ఊపిరులుగా ఊదా
నా భావ వీచికలు
నిన్ను తాకేలా చేశా
నన్నువదిలి వెళ్ళిపోతానంటే
ప్రేమ పాశం తో నిను బంధిస్తా
రా ప్రియతమా !
బంధాలను తెన్చుకోకు
మన జన్మజన్మల బంధాన్ని
ఈజన్మలోను వదలబోను

కలం బలం



(కవితల సుమహారం-43)మన తెలుగు మన సంస్కృతి---- చి త్ర క వి త – 72 ---
****కలం****
..కవితా సేద్యపు హలం

మానవత్వపు విలువలనే నీరుకొరవడి
ఎండి బీడువారుతున్న పొలంలా సమాజం
విదేశీ సంస్కృతీ ఎరువులతో
పిచ్చిమొక్కలు బలం పుంజుకొని
వెర్రిపూలు పూస్తున్నాయి
సమాజమంతా దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి
ఈ పొలాలని దున్నడానికి హలాలు కాదు
పదునైన అక్షరాలు నిండిన కలాలు కావాలి
మానవత్వమనే సిరాను పోసి
మమతలమాధుర్యాల అక్షర విత్తులు జల్లి
అసమానతల చీడపురుగులను ఏరిపారేసి
సామరస్యమనే ఎరువువేసి
శాంతి పూలుపూయించి సమైక్యతా పరిమళాలు
వెదజల్లి ,భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల
బంగారు పంటను విశ్వ వ్యాప్తం చేద్దాం
విశ్వ శాంతి కిరీటం భారతమాత శిరస్సున
సగర్వంగా అలంకరిద్దాం.కలం బలం చాటుదా

నాహృదయపు తలుపు



కృష్ణా తరంగాలు (కవితల సుమహారం-42 )

తెరిచాను నాహృదయపు తలుపు
అప్పుడే వినిపించింది ఒక తీయని పిలుపు
నాజీవితంలో అదే ఒకపెద్ద మలుపు
నీహృదయం మల్లెపూవు తెలుపు
నీ నుదిటి సింధూరం ఎరుపు
నాజీవితంలో నీనవ్వే మేలుకొలుపు
ఎప్పుడూ నామనసంతా నీ తలపు
అందుకే నీపై కలిగింది నాకు వలపు
నేనంటే నీకెందుకు అంత మరుపు
ఒక్కసారి నాచూపుతో నీచూపు కలుపు
నాపై నీ భావన కాస్త తెలుపు
అప్పుడే నే సాధిస్తాను గెలుపు

పండుగ భోజనం



(కవితల సుమహారం-41 ).మన తెలుగు మన సంస్కృతి
చి త్ర క వి త – 71ద్వితీయ ప్రోత్సాహక బహుమతి

పండుగ భోజనం పసందైన భోజనం
పప్పులోన కమ్మనైన నెయ్యివేసి
నంజుకోను పచ్చడొకటి తోడు చేసి
గుత్తివంకాయ వంటి ముద్దకూర
రకరకాల ముక్కలతో దప్పళం
అందులోకి వేయించిన అప్పడం ,
గారెలు,పులిహోర,బొబ్బట్లు
ఒకదానిని మించినది ఒకటి
తిన్నకొద్దీ తినాలనిపించే
ఘుమఘుమలాడే పిండివంటలు
కమ్మనైన పెరుగుతో ముక్తాయింపు
ఆపై తాంబూలంతో తీర్చుకోవాలి
భుక్తాయాసం,అరటి ఆకు మనసాంప్రదాయం
ఆరోగ్యానికి సోపానం ,అందరితో కలిసి చేస్తే
ఆనందానికి అదే తార్కాణం

చిరు ఆశ



(కవితల సుమహారం-40 )

ఎద తల్లడిల్లి పోతుంది
ఎదురు దెబ్బలకు తట్టుకోలేక
ఎక్కడో చిరు ఆశ
ఎలాగైనా ఈ కష్టాలు తీరుతాయని
గతమంతా చేదు అనుభవం,కానీ
ఇప్పుడు గరళం కూడా అమృతం
జీవితాన్ని జీవించడం ఒకవరం
జీవిస్తున్నందుకు ఎదో ఒకటి
సాధించడం నీ జీవనధర్మం
అందుకు ఎంచుకోవాలి ఒక లక్ష్యం
లక్ష్య సాధనకు కావాలి ఒక పధకం
నిరంతర శ్రమ,నిజాయితీ పరమమంత్రం
తగిలే ప్రతి ఎదురు దెబ్బా శిలపై ఉలి దెబ్బ
రగిలే ప్రతినిప్పురవ్వా ఎగిసే అగ్నిజ్వాల
సాధనతో శ్రామికుడై లక్ష్య సాధన చేస్తే
అప్పుడే నీజీవితం తెరిచిన పుస్తకం

జాగు

(కవితల సుమహారం-39 )
జాగు చేయవద్దనుచు
జాము రాతిరి దరి చేరె నీర
జాక్షి ,నిరతము నీ ధ్యాసయే యనుచు
జాలిగొలుపుచూపుల తోడ .విర
జాజి పూల గుభాళింపుల,మరుని
జాలము విసిరి,సిగ్గు పూసిన కెం
జాయి బుగ్గల తోడ ,పైట కొంగు విం
జామరగ చేసి సేద తీర్చు,మురిపంపు
జాడ తెలుపుచు జవ్వని
జాణతన మునుచూపు,, రాతిరంత
జాగారమే యనుచు విలాసముగ
జాతరనే మరిపించు కులుకుల వయ్యారి
జావళీలు పాడుకొనుచు
జాబిల్లి అదిచూసి అలుక చెందు

* ప్రకృతి -మనం*



(కవితల సుమహారం-38 )
'సాహితీ సేవ ' చిత్ర కవితల పోటీ - 10
* ప్రకృతి -మనం* " తృతీయ ఉత్తమ కవిత


ఉత్తరాన హిమవత్పర్వతాల ధవళవర్ణ శోభితం
తూర్పు పడమటి కనుమల పచ్చదనం
దక్షిణాన కన్యాకుమారీ ప్రపుల్లితం
ఎటుచూచినా అలరారు ప్రకృతి సోయగం
భువిపై స్వర్గమే ననుగన్న నాభారతం
వివిధ ఫలభార శాఖా శిఖా తరువరాలతో
సురభిళ పుష్ప సౌరభాలతో శోభాయమానం
నానావిధ పక్షులకూజితాలతో పరవశం
పవిత్రనదీనదాల నాదాలతో శ్రవణ్మధురం
చతుర్వేద పారంగతమైన కోనసీమ అందం
కోమలి చిరునవ్వులాంటి సుప్రభాత సమీరం
కవ్వింతల పులకింతలతో సాగరసంగమం
ఎలమావి చిగురుమెసవిన కోకిలల గానం
ఎద లోతుల్లో విభవించు భావతరంగం
కలబోసి ఇలలోన వెలయించు స్వచ్చ భావనం
ఏ జన్మ పుణ్యమో ఈభువిపైన జననం
కానీ కాలుష్యపు విషసర్పం కాటుతో
కానున్నది ఈ భూతల స్వర్గం సర్వం భస్మం
మానవాళి మనుగడకే ఇది మహాశాపం
మానవుడే తనకుతానుచేసుకున్న పాపం
కృత్రిమ సుఖసౌఖ్యాల మోజులో
ప్రాకృతిక సుమసౌరభాలను కాల రాస్తున్న వైనం
నిదుర మత్తు వదలి మేల్కొనవలసిన కాలం
ఒక్కచిన్నమొక్క నాటినా అది నీవంతు సహకారం
అదే మరోతరానికి నీవుచేసే మహోపకారం

ఆడబిడ్డ



ఉపశమన తరంగాలు (కవితల సుమహారం-37 )

పుట్టెనొక ఆడబిడ్డ నాయింట
నట్టింట నడయాడు లక్ష్మిలా
అరచేత పెంచితి అల్లారుముద్దుగా
అక్షరాలుదిద్దించి మురిసినాను
చదువుల సరస్వతి నాబిడ్డయని
ఎదిగినంతనె తెలియవచ్చినది
ఆడ బ్రతుకెంత కష్టమో
అడుగుబయట పెట్ట,కోర చూపులతోడ
కబళించు తోడేళ్ళు,కాంక్షతో చూచెడు
క్రూర మృగాళ్ళు,ఎటులో దాటుకొనుచు
గండమ్ములు,ఈడు వచ్చెనని పెండ్లిచేయ
అత్త ఆడబడుచులే ఆమె పాలిటి
మృత్యుదేవతల అవతారమెత్త
ఎక్కడ "ఆడ" బ్రతుకు,నీడనైన
కబళించు వేటగాళ్ళు,ఆడ జాతికి
కీడు ఆడతనమే,అర్ధనగ్న దృశ్యాలతో
ఆడతనమును అంగటి పాలుచేయు
సినిమాల ప్రభావమ్ము,అత్తా కోడళ్ళ
ఎత్తుపై ఎత్తులతో కుయుక్తులతో
దూరదర్సన ధారావాహికల
ప్రసారాలు,విరగ గొట్టిన సమాచారాల
(బ్రేకింగ్ న్యూస్ )తో ఆడదాని మానభంగ
దృశ్యాల ప్రసారములుచేయు వార్తా చానెళ్ళు
ఇందరుకలసి ఆడదానిని హీన పరచుచుండ
ఎక్కడ 'యత్ర నార్యంతు పూజ్యతే "

ఓ మానవుడా !



(కవితల సుమహారం-36 )

పండుగ పేరుచెప్పి ఓ మానవుడా !
మమ్మల్ని మంటగా వేసి
నీ చలి తీర్చుకుంటావు
నీలోవున్న అహంకారాన్ని
తగలబెట్టుకో
నీ జీవితానికి వెలుగుతెచ్చుకో
కోళ్ళను రెచ్చగొట్టి
పందాల పేరుతొ
కొట్టుకొనిచావమంటావు
నీ మనసు పొరలలో వున్న
మత్సరాన్ని మట్టుబెట్టి
మానవత్వం పెంచుకో

నీ జిహ్వ కోరిక తీర్చుకోడానికి
జీవాలనుదారుణంగా
కోసుకొని తింటావు
జీవ కారుణ్యాన్ని పెంచుకో
జీవా వరణాన్ని కాపాడుకో

ఉగాది (జయనామ)



కృష్ణా తరంగాలు (కవితల సుమహారం-35 )

నవనవోన్మేష నవమోహన సమ్మోహన ఉగాది కన్యకా
నవరస సంగీత సాహిత్య సమ్మిళిత రాగ సారికా
ప్రక్రుతి రమణీయ కమనీయ సౌందర్య మాలికా
సరస శృంగార చైత్రమాస సుశోభిత వసంత గీతికా
ఉషోదయాన చెరకువిల్లు పట్టిన మన్మధ రాణి వలె
మధురమైన మావి చివురుల మెసవిన కోయిల రాగంతో
గుబురు మావిళ్ళ చిరు ధరహాసాల మేళవింపుతో
మత్తెక్కించే వేపపూల పరిమళాల గుభాళింపు తో
జీవన సారపు షడ్రుచుల మధించిన పచ్చళ్ళతో
సంవత్సర ఫలితాలతెలుపు పంచాగ శ్రవణాల తో
తెలుగు వారి ఇల్లిల్లు వెలుగొందు దివ్య శోభతో
ప్రతి మది నిండు మృదుల తరంగ భావాలతో
నడయాడ వచ్చిన నవ వసంత యామినీ
జయ నామ రూప ధారిణీ జయము జయము
నీ క్రీగంటి చూపులో ప్రజలెల్లరకు కలుగు శుభము

పెంకుటిల్లు



ఉపశమన తరంగాలు (కవితల సుమహారం-34 )

పెంకు పెంకు పేర్చిన అనుబంధాల ఇళ్ళు
నాల్గు వాకిళ్ళు కలిసున్న మండువా లోగిళ్ళు
ఆనందాలు వెల్లివిరియు చలువ ఇళ్ళు
ఎన్నో పక్షులకు ఆవాసాలు
ఇళ్ళల్లో కట్టే పిచ్చుకగూళ్ళు
మమతానురాగాలకు ఆనవాళ్ళు
తాతముత్తాతల వారసత్వాలు
తరగని సాంప్రదాయ సంపదల భోషాణాలు
చిన్నారుల ఆటపాటల పూదోటలు
కాలం మారుతున్నా ఇంకా అక్కడక్కడా
మేమున్నామంటూ గర్వంగా
తలెత్తుకు నిలిచే ఈ పెంకుటిళ్ళు

అంత్యాక్షర కవిత



కృష్ణా తరంగాలు (కవితల సుమహారం-34 )అంత్యాక్షర కవిత

స్తన్యంబు నిచ్చి పెంచిన తల్లి
స్తన్యంబు పంచుకున్న చెల్లి
ముచ్చటగా అనుబంధమల్లి
ఇంట వెల్లి విరియించు పాలవెల్లి
మాపూదోటలో విరబూయు మల్లి
కల ఏర్చి కూర్చి పూమాలలల్లి
ఇంటి ముంగిళ్ళ కళ్ళాపి జల్లి
అందమైన రంగులతో రంగవల్లి
కలు దిద్ది ,పండుగ సంబరాలు వెల్లి
విరియపూజలుచేతురు భగవంతునకు ప్రణమిల్లి

సంకురాత్రి



మనతెలుగు మనసంస్కృతి చిత్ర కవిత 69 ప్రథమ బహుమతి పొందిన కవిత (కవితల సుమహారం-33)

తెలుగులోగిళ్ళు -వెలుగువాకిళ్ళు
మంచుతెరల మాటున పల్లె అందాలు
పంటపండించి గాదెల కెత్తే రైతన్నలు
పట్టుపావడాలతో నడయాడే నయాగరాలు
పసుపు పూసిన గడపలతో లక్ష్మీనివాసాలు
భోగి మంటల అందాలతో వీధి కూడళ్ళు
పిడకల దండలతో చిన్నారుల సోయగాలు
అత్తవారింట కొత్త అల్లుళ్ళకు స్వాగతాలు
పిండివంటల ఘుమఘుమల ఆస్వాదనాలు
బొమ్మలకొలువుల పేరంటాల సంబరాలు
చట్టాలు ఎన్నివున్నా కోడిపందాల కవనాలు
గోమాతల నుదుట పసుపు కుంకుమల తో
పశుసంపదకు పూజా పునస్కారాలు
భోగభాగ్యాలు తెచ్చే ఈ పండుగలే
మన సంస్కృతీ సంప్రదాయాల ఆనవాళ్ళు
కావాలి ప్రతి ఇంటా కొత్తకాంతుల సంక్రాంతులు

మంగళ కరమౌ



ఉపశమన తరంగాలు (కవితల సుమహారం-32 )

మంగళ కరమౌ ప్రతి ఇల్లు
మందిరమున కొలువైవున్న
దేవతల దివ్య ఆశీస్సులతో
నిత్యము దూపదీపనైవేద్యాలతో
కోరికొలిచెడి కొంగుబంగారు
అష్టైశ్వర్యాలనిచ్చు శ్రీలక్ష్మి
అమెవెన్నంటి వుండు శ్రీనివాసుడు
మనసును పవిత్రమొనర్చి
మాలలుగా గుచ్చి దేవదేవునికి
ప్రేమతో అర్పించి ,శివుని ప్రీతికరమైన
మారేడు దళముల అర్చించి
ఆదిశక్తిని,గణాధిపుని సేవించి తరించు
మన హృదయమందిరమే పూజమందిరము
మన లోగిళ్ళ వెలయు మందారదామం

అందంతో



కృష్ణా తరంగాలు ద్వితీయ బహుమతి (కవితల సుమహారం-31 )రెండవ అక్షరం "దం "

అందంతో వలవేస్తావు ,మక
రందం రుచిచూపిస్తావు.నీ
డెందం లోచోటిస్తావు ,ఆ
నందం గా విహరిస్తావు ,జాబిలి
చందంగా కనిపిస్తావు ,నాహృదిలో
వేదం పలికిస్తావు ,నా మనసుకు
మోదం కలిగిస్తావు , లయవిన్యాసాలతో
పాదం కదిలిస్తావు ,మృదంగ
నాదం తో సరి నాట్యం చేస్తావు
కదంకలిపి నను మురిపిస్తావు
స్వేదం చిందిననీమోములో
ఖేదం కనబడనీయక ,నాకు ప్ర
భోదం చేస్తావు ,నీప్రేమకు నా ఆ
మోదం తెలుపమని నను తొందర చేస్తావు
సూదంటు రాయల్లే నను లాగేస్తావు

12 మే, 2015

ఆకాశవాణి

కృష్ణా తరంగాలు ప్రధమ బహుమతి (కవితల సుమహారం-30 )
ఆకాశవాణి అందరి ఆత్మీయ వాణి
ఉదయాన వందేమాతర గీతంతో నిదురలేపి
సంప్రతి వార్తాహ సూయంతాం అంటూ సంస్కృతంలో వార్తలందించి
చిత్రలహరులు,చిత్రగీతికలతో మనసుకు ఆహ్లాదం కలిగించి
ఏకాంబరం, అక్కయ్యల తమాషా మాటలతో కార్మికుల కార్యక్రమాలు
రేడియో అన్నయ్య, అక్కయ్యలతో బాలానందాలు
మధ్యాహ్నపు వేళ మీనాక్షీ పోన్నుదరై
ఆత్మీయ పలకరింపుతో సిలోన్ కార్యక్రమాలు
చల్లనిసాయంత్రపు వేళ ఆకట్టుకొనే
ఏమండోయ్ బావగారు అంటూ కబుర్లు
వారం వారం ఆదివారం రేడియో నాటికలు
బుర్రకధలు హరికధలు,నవలా ధారావాహికలు
ఇంకా ఎన్నెన్నో బుల్లిపెట్టె లో అద్భుతాలు
మానవుని మనోరంజనానికి తీపిగురుతులు

రా (చ )జధాని



రా (చ )జధాని (కవితల సుమహారం-29 )

వస్తున్నాయ్ వస్తున్నాయ్
రాజధాని రధా చక్రాల్ వస్తున్నాయ్
ఊరవతల వేలల్లో ఎకరాలకుఎకరాలు
సర్కారీ భూములెన్నో పడివుంటే
కోట్లల్లో కూడెట్టే భూముల్ని కొల్లగొట్టే
పధకాలను రచించి పందేరం సిద్ద్డం చేసి
రైతన్నను సుఖాలలో ముంచి తేలుస్తారట
చెమటోడ్చి భరతావనికి అన్నంపెట్టే రైతన్న
సమశీతోష్ణ భవనాలలో సేదతీరుతాడా?
వారి సుఖం మాట అటుంచితే
మరి మనకూడు సంగతేమిటి ?
ఆంధ్ర ప్రదేశ్ ను సింగ"పూరు"గా మారుస్తామంటే
అర్ధం వ్యవసాయానికి పాడి కడతామనా
అవునులే ఒకప్పుడు వ్యవసాయందండగన్న ఏలిక
ఒకప్పుడు రాజులలోసమన్వయం లేక ఆంగ్ల ఏలికలొస్తే
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని చిల్లరగా విదేశాలకు అమ్మేసి
మళ్ళా మరో నాల్గు శతాబ్ధాలకు బానిసలనిచేసే పధకాలు
ఓట్లేసే దాకా ఓటు మల్లయ్య ,ఓటేసాక వోటిమల్లయ్య
రాచరికపు సౌకర్యాలలో ప్రభువులు మునిగితేలుతారట
ప్రభువులకి సామంతులకి మంత్రులకి
ప్రజాధనం దిగమింగడం తప్ప ప్రజలగోడు పట్టేనా
చెట్టుకిందైనా కూర్చుని పరిపాలిస్తానన్న అన్న
అన్నన్నా! ప్రస్తుతానికి ఉమ్మడి రాజదానిలో
ఏలినవారి పరిపాలనాభవనాలకి కొంగొత్త సొబగులు
మననేతలకు కరెంటు,రెంటు,రైలుచార్జీలు బస్సుయాతనాలు
గాస్ కష్టాలు ఉండనే వుండవు ,ఎందుకంటే
వారు అసామాన్యులు అమాత్యులు,మనం సామాన్యులం

మంచు కురిసే వేళలో



మంచు కురిసే వేళలో (కవితల సుమహారం-28)

మనసునిండా మధురోహలునిమ్పుకొని
రాలిపడుతున్న హిమసుమాలలో
రాగాలాపనని ఆనందిస్తూ
రాబోయే వసంతాన్ని ఆహ్వానిస్తూ
మంచుకురిసే వేళలో జాబిల్లి అందాలను ఆస్వాదిస్తూ
మదిదోచిన కాంత ఏకాంతాలను అనుభవిస్తూ
పొద్దెక్కి వచ్చిన సూరీడు నులివెచ్చని స్పర్శలో
పొలం గట్లపై చలికాగుతూ
వేడివేడి పొగలుకక్కే కాఫీలకు ప్రణమిల్లుతూ
భక్తి పారవశ్యాలతో చన్నీటిస్నానాలతో
ధనుర్మాస వ్రతాలనాచరిస్తూ
తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలసందళ్ళతో
ఆనందోత్సాహాలతో గడిపేసి
శివశివ అంటూ శివ రాత్రిజాగారంతో
ఈ చలి పులికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుదాం


మనతెలుగు మనసంస్కృతి చిత్ర కవిత 68 ...టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యు

సా (అ)క్షర కవిత



సా (అ)క్షర కవిత (కవితల సుమహారం-27)

సాహితీ వనములో చరితార్ధము కాద ,
సారంగములవోలె పూదోటలో విహరింఛి ,
సామీప్యమునుజేరు రాధామనోహరివోలె
సాన్నిత్యము తెల్పెడు సరసునివోలె
సాగర సమీరాల కదలాడు కురులవోలె
సామవేద గాన మాధుర్యమువోలె
సాకేత పురాధీసుని కోదండము వోలె
సాధుజనుల సాంగత్యము వోలె
సాకారమౌ సకలము నేడు
సాక్షాత్కారముపొందిపరమశివుని
సాటి ఎవడు ముల్లోకముల ముక్కంటికి

వామనుడు



వామనుడు (కవితల సుమహారం-26 )

వేలెడంత లేడని వెర్రితలంపుతోడ
మూడడుగులనేల ధారపోయ
ముజ్జగాలనుకొలిచి మురిసినావు
వామనాకారమై,భూమండలమున
ప్రాకారమై,ఆకసమున ఓంకారమై
పాతాళమున బలికి అధికారమిచ్చి
పరమపూజ్యుడవై ప్రజలగాచి
దానవేంద్రుని దానగుణమును చాటి
దయా సముద్రుడవన్ననీకునీవె సాటి
శరణు వేడెద నీ చరణారవిందములె శ్రీహరీ !

రెండవ అక్షరం ఏకాక్షరం



కృష్ణా తరంగాలు లో కొత్త ప్రక్రియ రెండవ అక్షరం ఏకాక్షరం గా కవిత
(కవితల సుమహారం-25)

కలంకారీ పనితనముతో
అలంకృతమైనమేలిముసుగుతో
ఫలంబుల పళ్ళెరము చేబూని
శైలంబుల కావల దేవళములో పవిత్ర
జలంబులతో అభిషేకింప వెడలితి ,ప్రభుని
ఆలంబనమునకు ఆర్తితోడ ,మరి
విలంబముచేయక తోడు కూడి
సాలంకృతముగ రావదే ధీర !నీ
బలంబున భయమెరుగక దర్సనంబుచేయ
గలందాన సతతము నిను మదిన్
తలంతు నే మనోహర మందారా

వీధి బడి



వీధి బడి (కవితల సుమహారం-24)

వీధిబడి అని తక్కువగా చూడకు
స్వచ్చమైన గాలి వెలుతురు
ప్రక్రుతి వొడిలో పలకరింపులు
మనసుపెట్టినేర్చిన పెద్దబాలశిక్ష
ఎందఱో మహానుభావులను తీర్చిదిద్దిన
మహోన్నత స్థానం ఈబడి
కంప్యూటర్లు టెక్నాలజీల చదువులు
బందికానాలకి ప్రతిరూపాలు నేడు
వీదిఅరుగులపై చింతపిక్కలతో లెక్కలు
చింకిచాపలపై కూర్చుని చదివే చదువులు
మరచిపోని మదురానుభూతులు
విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలు

అమ్మ-అమ్మాయి



అమ్మ-అమ్మాయి (కవితల సుమహారం-23)

అమ్మ తోడులేనిదే క్షణమైనా గడవదు
అల్లిన జడ లోను,నుదిటి బొట్టు దిద్దడం లోను
కంటికాటుక రేఖ పెట్టడం లోనూ
కాలుకదిపి బయటకు అడుగుపెట్టే తరుణంలో
జరభద్రం అంటూ జాగ్రత్త చెప్పడంలోనూ
కోరచూపులనించి ఎలా తప్పించుకోవాలో
ఎదిగే వయసులో ఎలా వొదిగి ఉండాలో చెప్పడంలోను
అమ్మే కదా నీకు సర్వస్వం,ఆమె మాటే నాగస్వరం
సహనాన్ని,సామరస్యాన్ని నేర్పి
భావితరానికి మరో అమ్మని అందించడమే
అమ్మగా తనకర్తవ్యం అప్పుడే ఆమె జన్మ ధన్యం
అందుకే అమ్మప్రేమ కల్మషం లేని పాలకుండ

ప్రియా!



14 December 2014 21:18
ప్రియా! (కవితల సుమహారం-22)

నీవులేనినాడు నేనున్నానని ఎలా అనుకుంటావ్ ?
నీ ఊపిరినే నేనైతే వూపిరిఆగిపోతుందని ఎలా అంటావ్ ?
నీధ్యానమే నాదైతే నీపై ధ్యాసలేదని ఎలా అంటావ్ ?
నీ నీడనే నేనైతే నీకు నీడలేదని ఎలా అంటావ్ ?
నీతోడుగా నేనుంటే నువ్వెలా వెళ్ళిపోతావ్ ?
నీకంటి రెప్పనై నేనుంటే కన్నీరెందుకు కారుస్తావ్ ?
నీ కలలలో నేనుంటే నిదుర లేదని ఎందుకంటావ్ ?
నీకు ప్రేమామృతాన్ని పంచుతుంటే దాహమని ఎలా అంటావ్ ?
నీలోసగం నేనైవుంటే నేనెక్కడని ఎలావెతుకుతావ్ ?
నీ వేకువనే నేనైతే ఇంకా తెలవారలేదని ఎందుకంటావ్ ?
నీ జాబిలినే నేనైతే వెన్నెల కోసం ఎందుకు ఆరాట పడతావ్ ?
నీకోసం నా సర్వస్వం నువ్వే నా సర్వస్వం ,కాదని ఎలా అంటావ్ ?
ఇంతగా పెనవేసుకున్న బంధం తెంచుకు నేపోతే నువ్వెలా వుంటావ్?

తొలిరాత్రి-పాన్పు



తొలిరాత్రి-పాన్పు (కవితల సుమహారం-21)
8 December 2014 22:08

పరిణయమనగానే మదినిండు భావం
మధురాతి మధురోహల తొలిరాత్రి వైభవం
వధూవరుల ఎదురుచూపుల పరమార్ధం
తొలి స్పర్సకై మనసుల ఆరాటం
అందంగా అలంకరించిన అద్భుత తల్పం
అగరు ధూపాల సుగంధ భరితం
పూలసౌరభాల తో మరింత మెత్తదనం
జీవిన పయనానికి నాంది ప్రస్థానం
ప్రతి దంపతుల తొలి సంగమ స్థానం
జీవనపర్యంతం గుర్తుండే జ్ఞాపకం
కావాలి నవదంపతుల జీవితంసార్ధకం
మరో తరం పునాదికి సోపానం

తెలుగమ్మాయి



చిత్ర కవిత-65
తెలుగమ్మాయి (కవితల సుమహారం-20)

పట్టుపావడా కట్టిన పరువాల చిన్నది
కాటుక దిద్దిన కోల కళ్ళతో
వాలుజడను పూలచెండుతో చుట్టి
వయ్యారాలు వొలకబోసే వగలతో
సింగారలనడుముతో సిగ్గు లొలుకుతూ
తేనెలొలుకు కులుకుల పలుకులతో
మధువులూరు లేలేత పెదవులతో
ఘల్లు ఘల్లను మంజీర నాదాలతో
సెల యేరల్లే తుళ్ళుతూ
మెత్తని కోనసీమ పూతరేకులా
రసాలూరే కాకినాడ కాజాలా
నడచివచ్చిన బాపూ బొమ్మ
అందాలుచిందే అపరంజి రెమ్మ
అపురూపముగ తీర్చిదిద్దె బ్రహ్మ
ప్రతివారి హృదిలో మ్రోగే సన్నాయి
ఆమే పదహారణాల తెలుగమ్మాయి


టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు 7.12.14

వార్ధక్యం



వార్ధక్యం (కృష్ణా తరంగాలు )కవితల సుమహారం-19 )

ముడుతలు పడ్డ శరీరం
మందగించిన చూపు
సహకరించని కాలూ చేతులు
కనికరమేలేని బిడ్డలు
ఈ రక్తమాంసాలే జన్మనిచ్చాయని
ఈ ఎండిన గుండెలే స్తన్యాన్నిచ్చి
పెంచి పోషించాయని తెలిసీ
వార్ధక్యాన్ని అసహ్యించుకుంటూ
దానికి మనం అతీతులమన్నట్లు
ఎల్లకాలం ఈ శరీరం ఇలాగేవుంటుందని
అహంకారంతో ఎందఱో అభాగ్యులను
అనాధలుగా చేస్తోంది ఈ సమాజం

* ఆడ పిల్ల *



సాహితీ సేవ చిత్ర కవితల పోటీ - 8 లో 'అబల - సబల' అంశంపై * ఆడ పిల్ల * అనే కవిత కు " ప్రత్యేక బహుమతి.

( కవితల సుమహారం-18 )


ఆడపిల్లగా పుట్టానని తెలిసి ఆనందంతో కేర్ కేర్ మంటావు
"ఆడ" పిల్లవై పుట్టావని తెలియక పాపం
అమ్మ తనబాదల గాధలకు మరోరూపమనుకుంటే
నాన్న గుండెలపై కుంపటిగా కుంటిసాకు చెబుతుంటే
నువ్వు మాత్రం కిలకిలలాడుతూ షోడశ కళలతో.
ఎదుగుతున్న నిన్నుచూసి,ఎద పొంగునిచూసి
చొంగ కార్చుకొనే క్రూరమృగాలు వీధికొక్కడు
నిన్నుతాకాలని తడిమెయ్యాలని ఆప్యాయత ముసుగులో
పండుముదుసలి దగ్గరనుండి పాఠాలు చెప్పే పంతులుదాకా
వయసువచ్చిందన్న బిడియంతో వొదిగి వొదిగి ఎవరికీ చెప్పుకోక
పైశాచిక ప్రవృత్తుల్ని భరిస్తూ వీలైనంత తప్పించుకుతిరుగుతూ
చదువులతో ముందుకు సాగుతుంటే, ప్రేమ పేరుతొ నినువెంటాడే
మరో రకం మృగాల నుండి తప్పుకోలేక తప్పించుకు తిరిగితే
నీ మానసిక సౌందర్యాన్ని గెలవలేక ఆసిడ్ దాడులతో
నీ అందమైన ముఖారవిందాన్ని అందవికారంగా చేసి
అధికారమదంతో ఎన్నెన్నో అకృత్యాలు చేస్తుంటే
పెళ్లి పేరుతొ నీకళ్ళల్లో ఆనందం చూడాలని
కట్నాలకు వెరవక ఆర్భాటంగా పెళ్ళిచేస్తే
అక్కడ మరోరూపంలో నరరూపరాక్షసులు
అత్తమామా,ఆడపడుచుల రూపంలో ఆరళ్ళు
ఆడపిల్ల గాపుట్టడం ఏమి పాపమో
అడుగడుగునా వరకట్న చావులో,అనుమానపు వేధింపులో
కసుగాయని తెలిసినా "మృగ" తృష్ణ తో మానభంగాలు
మేలుకో చెల్లెలా మేలుకో !ఏమగాడు నీకు తోడురాడు
నువ్వే మగాడిగా మారి మనుగడ సాగించు
నీవైపు వక్ర దృష్టితో చూసిన వాడి కళ్ళు పొడువు
మానభంగం చెయ్యాలనుకున్న వాడికి మూలం తెగగొట్టు
మౌనంగావుండకు అన్యాయంజరిగితే,ఎలుగెత్తి చాటు
మానమేపోయినప్పుడు నీకు పోయిందేమిలేదు
పోరాడితే భవిష్యత్తులోనైనా ఆడదాని బ్రతుకు బాగుపడుతుంది

- టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు

ప్రకృతి



ప్రకృతి (కవితల సుమహారం-17)

పచ్చాపచ్చని చేలు రెపరెప లాడే
పైరగాలికి పరవశించే నా మనసే
పల్లెపల్లెలో కదలాడు ఈ ప్రకృతే
వడిసెల పట్టిన వయ్యారిని కలిసే
వలపంత వొలకపోసి పులకించే
ఏకాంత స్థలము మంచేకదా
పంటపండితే కడుపునిండే
వలపుపండితే మనసు నిండే
ప్రశాంత ప్రకృతిలో పలికే భావమైన
వానజల్లులో తడిసే పైరైనా
మనసుకు ఆహ్లాదమే కాదా
పుడమితల్లికి ఆనందమేకాదా

మరోసమిధ



మరోసమిధ (కవితల సుమహారం-16)

ఎవడో కరకుగుండె కసాయి
ప్రేమపేరుతో నిను వంచనచేసి
నువ్వు లేనిదే లోకంలేదని
నీప్రేమకై ప్రాణాలైనా ఇస్తానని
వెంటపడి వేధించి హింసించి
వశ పరచుకునే ప్రయత్నాలుచేసి
నువ్వు లొంగి రాకపోతే
నిండు చందమామలాంటి నీ మోముపై
ఆమ్లద్రవాన్ని కుమ్మరించి
పైశాచిక ఆనందంతో విర్రవీగే
మానవ మృగాల సమాజంలో
నువ్వు మరో సమిధవవుతున్నావా
ఉపశమన తరంగాలు4 12 14

రాక్షస కాండ



రాక్షస కాండ (కవితల సుమహారం-15)

నిత్యం చెమటోడ్చి కష్టపడి వెళ్ళ బోసే జీవితాలు
రేపటికోసం కలలుకనేసామాన్యుడి సంసారాలు
పసిపాపలనవ్వులకోసం వెంపర్లాడే మమకారాలు
ఇది ప్రపంచ మాన చిత్రంలో ఒక పార్శ్వం
ప్రపంచమేదో అయిపోతోందని ఉద్దరించేది మేమని
మతమౌడ్యం తో పవిత్రయుద్దాలపేరుతో రక్కసులై
కులమతాలకతీతంగా పసికూనలని సైతం
కాలరాసి, చిగురించే జీవితాలు చిదిమేసి
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని విస్మరించి వికృతాకారులై
రాక్షసానందం తో భూమాతకు పెనుభారంగా పరిణమించి
ప్రకృతిలో పెరుగుతున్న కాలుష్యాలకు తోడు
మానవత్వపు కాలుష్యంతో మారణ కాండలు మరో పార్శ్వం
ఒకపక్క ఉగ్రవాదానికి కొమ్ముకాస్తూ
మరోపక్క కొంగజపంచేస్తూ ధర్మపన్నాలను వల్లిస్తూ
వైస్వీకరణ మహామంత్రం జపిస్తూ అగ్రరాజ్య అహంకారం
ఎక్కడో కాలుతున్న శవాల కమురుకంపు
నెత్తురోడుతున్న పిశాచాల కబళింపు
ఓ మానవుడా !ఏది దిక్కు అని పరితపిస్తూ కూర్చోకు
శాంతి వనాల సృష్టించు ,ఉగ్రవాదకాలుష్యం తుదముట్టించు


టి.వి.ఎస్.ఆర్ .కే.ఆచార్యులు 23.12.14.మనతెలుగు మనసంస్కృతి చిత్ర కవిత 67

రైతన్నా-ఓ రైతన్నా



రైతన్నా-ఓ రైతన్నా (కవితల సుమహారం-14)

పొద్దుగాలే నిదురలేచి చద్ది అన్నం మూట పట్టి
కాడి భుజాన ఎత్తి పట్టి దుక్కిదున్న పోయినావే
భూమిదున్ని దమ్ముచేసి విత్తుజల్లి
నింగితల్లి చినుకుతోన కనికరిస్తే
పుడమితల్లి పులకరించి మొలకలెత్తె విత్తులన్నీ
మొలకలన్నీ నారుచేసి నాట్లు వేసి
కలుపులోస్తే ఏరివేసి పురుగులోస్తే మందులేసి
అప్పుచేసి ఎరువువేసి ఏపుగానే పంటపెంచి
పోట్టపోసిన పంటచూసి కోతకోసే వేళకోసం ఎదురుచూస్తే
ఉరిముఉరిమి మెరుపుమెరిసే,నీగుండె లోన పిడుగు లేసె
కుండపోతగ వానలోస్తే చెరువుగట్టు కోత పడితే
నీబడుగు గుండెకు నొప్పిలేచే ,కంటనీరే కాల్వలాయే
ఉన్న పంటను కోతకోసి కుప్పనూర్చి అమ్మబోతే
రంగుమారిన గింజలని రంగుమార్చి
దళారిబాబు నాల్గురూకలు చేతబెడితే
అప్పులిచ్చిన అప్పులోడే దారిలోనా అడ్డుపడితే
ఆలుబిడ్డల కడుపు నింపే దారిలేక
అన్నదాతగ పేరుమోసి మింగ మెతుకే దిక్కులేక
దిక్కుతోచక దిగులుపడుతూ వుసురునీవుతీసుకొంటే
నీపీనుగు పైనే పైసలేరుక రాజకీయం చేస్తరందరు
భారతజాతికి అన్నమెట్టే రైతు దేవుడ
చేతులెత్తి మొక్కుతున్నా చావుమాటను ఎత్తబోకు
వెన్ను ముక్కే లేకపోతే జీవమున్నా చచ్చినట్టే
దేవుడొక్కడే తోడునీకు మంచిరోజులోస్తాయ్ ముందుముందు
నీబాగు కోసం దేవులందరికి మొక్కుతుం డా రైత న్నా- ఓ రైతన్నా( సాహితీసేవ చిత్ర కవితలపోటీ -6 కి కవిత టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు

సేద్యం



సేద్యం(కవితల సుమహారం-13)

నాకూ సేద్యం చెయ్యాలని ఉంది
హలంతో కాదు కలంతో
సమాజమనే భూమినిదున్ని
అక్షరాలనే విత్తులునాటి
చిరుకవితల మొక్కలు పెంచి
చీడ పీడల రుగ్మతలను
కలుపుమొక్కల సమస్యలను
పదునైనపదాల పురుగు మందులతో తొలగించి
చక్కని పదసంపద ఎరువులతో ఏపుగా పెంచి
కావ్యసౌరభాల పంటనూర్చి
ఆకలితో ఆవురావురంటున్న
భావితరానికి పుష్టి కలిగించే
తెలుగు భాష విందుభోజనం
అలంకారాల మమకారం రంగరించి
పసందైన భావాల పిండి వంటలతో
వడ్డించి కొసరికొసరితినిపిస్తా
అన్నదాత రైతులా
తెలుగు భాష కు సేవచేసే
సేవకుడిని నేనవుతా
సేద్యమంటే హలమే కాదు
కలం కూడా అని ఎలుగెత్తి చాటుతా
టి.వి.ఎస్.ఆర్.కే .ఆచార్యులు 10.12.14

బాల్యం



బాల్యం (కవితల సుమహారం-12)

అమ్మ అల్లారుముద్దు వొడిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు
అమ్మ ముఖంచూస్తూ చందమామగా తలపోయడం
అమ్మ కొంగుచాటు చేసుకొని దోబూచులాడడం
అమ్మచేతి గోరుముద్దలు కొసరి కొసరితినడం
బుడిబుడి అడుగులతో అల్లరి పరుగులతో
అమ్మచేతినివదిలి పెట్టి పలకాబలపం చేపట్టి
అ,ఆ,లను దిద్దేవేళ ఎంతెంతో ఆనందం
తరగతిలో ఫస్టు మార్కులొస్తే ఎగిరి గెంతేయడం
మరోతరగతి,మరోతరగతి దాటేయడం
వేసవి సెలవలలో ఊళ్ళో చెట్లంట పుట్లంట
పొలాలగట్లంటా బలాదూర్ తిరిగేయడం
తాటి ముంజెలు చెరుకు గడలను లాగించేయడం
చెక్క బేట్ తో గుడ్డ బంతితో క్రికెట్టు ఆడేయడం
దొంగచాటుగా బెల్లంముక్కలు మింగేయడం
అమ్మ అరిస్తే నాన్నచరిస్తే అలిగి ముసుగెయ్యడం
కలలాగడిచిపోయిన కాలం తిరిగి రాని బాల్యం
ఈకాలం పిల్లలనిచూస్తూ వీళ్ళెంత అదృష్టవంతులో అనుకుంటాం
కానీ మనకాలంతో పోలిస్తే వీళ్ళకేమున్నది ఆనందం
నిత్యం చదువుల పోరాటం ,ర్యాంకుల ఆరాటం
అమ్మా నాన్నవుద్యోగాల దేవులాటలో ఇల్లేపట్టని వైనం
ఏదేమైనా బాల్యం ఒక అద్భుత వరం ,అందుకే
ఆలోచనల లోనైనా వుండిపోదాం అలామనం
టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు 29.10.2014 -సాహితీ సేవ చిత్రకవిత పోటీ -5

పాలుగారే పసిప్రాయం



పాలుగారే పసిప్రాయం (కవితల సుమహారం-11)

పాలుగారే పసిప్రాయం పనిపాటల్లో బుగ్గైపోతోంది
పలకాబలపం పట్టే చిన్నారిచేతులు చివికి పోతున్నాయి
ప్రమోదాల బాల్యం ప్రమాదాల నెలవవుతోంది
అమ్మా నాన్నా గోరుముద్దలు తినిపించడం మాని
ఆ చిన్నారుల స్వేదాన్నే ఆధారంచేసుకొంటుంటే
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తామన్న నేతలకు
రోజూ రోడ్డుపక్కన ఇల్లాంటి దిక్కులేని పిల్లలు కనబడరా ?
ఎందరి అమాత్యుల ఇళ్ళల్లో ఇలాంటి బాలలు లేరు ?
చర్యలకు రానిచట్టాలు ఎవరికోసం?ప్రచారాలకోసమా ?
లెక్కల్లో బాలకార్మికులే వుండరు మామూళ్ళు ఇస్తే
బాణసంచా తయారీలో కాలిబూడిదైన బాలలెందరు ?
బాలకార్మిక వ్యవస్థ ను రూపుమాపడానికి
యంత్రాంగానికిచేసే ఖర్చుతో ఎందరికో బ్రతుకునివ్వవచ్చు
కాగితాలలో లెక్కలు,జేబుల్లోకి నిధులు
మరి రోడ్లపై ఎప్పటిలాగే వీధి బాలలు
చదువనేది ప్రాధమిక హక్కు కానీ వారికిఎవరుదిక్కు
ఇది సామాజిక భాద్యతే కానీ ఎవరికీ పట్టదు
అందుకే చిదిమేయకండి బాల్యాన్ని,
అదిమిపెట్టకండి వాళ్ళ ఆశలను,ఆశయాలను
భావిభారతానికి కావలసింది బాలకార్మికులుకాదు
నైపుణ్యాలు కలిగిన నవతరం, యువతరం
తీర్చిదిద్దుదాం వారి నైపుణ్యాలను విద్యద్వారా !
తిరగరాద్దాం వారి తలరాతను బంగారు బాటగా !


సాహితీ సేవ కవితల పోటీ -7 కి కవిత
టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు .9 .11 .14

చీకటి



చీకటి (కవితల సుమహారం-10)
చుట్టూ చిక్కటి నిరాశ
అలుముకున్నకటిక చీకటిలా
మినుకు మినుకు మంటూ
ఎక్కడో దూరంగా చిన్నపాటి ఆశ
ఎంతగా అడుగులువేస్తున్నా
అందకుండా పరుగెడుతూ ఆశ
నా వెనుకే పెనవేసుకుని
నను అంటిపెట్టుకుని వస్తూ నిరాశ
అడుగులు వేగంపెరిగాయి
అయినా దూరం తరగటం లేదు
నాకు ,ఆశ కి నిరాశ కి మధ్య
ఆశ లెన్ని వున్నాఅయోమయంలో నేను
ఆశయాల తీరం చేరేదేన్నడో నని
వోర్పుగా వేచివున్నా
నిరాశకి విసుగొచ్చిందేమో
ఒక్కసారిగా చతికిలపడింది
నాలో రెట్టించిన ఉత్సాహం
ఊపిరి గట్టిగాపీల్చుకొని పరుగందుకున్నా
ఇంతలోనే వెలుగు రేఖ దగ్గరయ్యింది
ఆశ నావంక రెండుచేతులూ చాస్తూ
ఆర్తిగా నన్నల్లుకుంది
అమ్మలావోదార్చింది
నిన్నెప్పుడూ వదిలి వెళ్ళనంటూ
టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు .13.12.14

మనబాల్యం(తీపి గుర్తులు)



మనబాల్యం(తీపి గుర్తులు)
మన తెలుగు మనసంస్కృతి చిత్రకవిత-64 మొదటి స్థానం పొందినకవిత
(కవితల సుమహారం-9)

ఎవరుచెప్పినా బాల్యం తీపిగుర్తే అందరికి
బుడిబుడి నడకల తో మొదలయ్యే పరుగుల ప్రవాహం
గలగలసెలయేరల్లె పారుతూ ఎగిరిదుమికే జలపాతం
అమ్మకొంగు పట్టుకొని ఆడినా పాడినా
నాన్నవేలు పట్టుకొని నిర్భయంగా నడిచినా
జో కొడుతుంటే గుండెలపై ఆదమరచి నిదరోయిన
మల్లెల లాంటిమనసులు మమతల ఉషస్సులు
ఆటేదైనా పాటేదైనా అరమరికలు లేని ఆనందం
ఆడామగా తేడాలెరుగక అమ్మా నాన్నాటలాడినా
భయానికి వెరవనివెర్రి కోర్కెల సాహసాలు
చెట్లెక్కినా కోతికొమ్మచ్చిలాడినా చిక్కే ఆహ్లాదం
చిన్నచిన్న అబద్ధాలు,చిలిపితగాదాలు
కాకెంగిళ్ళు,పచ్చిమామిడి ముక్కలపంపకాలు
ఎన్నని ,ఎన్నెన్నెనని ఈమధురానుభూతులు
కానీ నాణానికి మరోపార్స్వం అనాధలబాల్యం
అమ్మ ఆప్యాయతలకు నాన్న ఆదరణకు నోచుకోని
ఆటపాటల ఆహ్లాదాలు చిదిమేసిన జీవితాలు
మరోజన్మకే కాదు మరేజన్మకి వారికొద్దిలాంటి బాల్యం
అందరిలానే ఆనందానుభూతుల బాల్యం కావాలి వారికి
చేతనైతే వారికందిద్దాం బాల్యపు మధురస్వప్నాలు

'ల 'అనే అక్షరం పై కవిత



కృష్ణా తరంగాలు అక్షరకవిత -6 లో తృతీయ బహుమతి పొందిన నాకవిత

'ల 'అనే అక్షరం పై కవిత (కవితల సుమహారం-8)




లతా మనోభిరామ లావణ్య
లలనా మణీ,నీ అధర రసా
లముల గ్రోలు కీరమునై నీమ్రో
ల వాలి నిరతము నీ ప్రేమ లా
లనలలో మునిగి తేలు నేను,నీ
లలితమగు మోము పై చిరునవ్వు
లక్షణముగా విరియ మురిపెము
ల నీవు మురిసి విరియగా కలువ
ల రేడది గని తారలతో సయ్యాట
ల మరచి మనల తేరిపార చూడ సిగ్గు
ల మొగ్గయితివి గదా నా సఖీ,చారు
లతాంగీ నినుచూచి కలువలుచిన్నబోయే గదా

కడలి



కడలి (కవితల సుమహారం-7)
విశ్వ వృష్టికి ఆధారామీ కడలి
విశాల ఆవరాణానికి ప్రతీక ఈకడలి
మానవుని హృదయ ఘోషకు ప్రతిరూపమీ కడలి
ప్రశాంతతకు ప్రళయానికీ ఆలవాలమీ కడలి
ఆశలకు నిరాశలకు నిదర్శనమీ కడలి
సాధకులకు ఔత్సాహికులకు రంగస్థలమీ కడలి
ఉషోదయాలకు చంద్రోదయాలకు నెలవీకడలి
అపార సంపదలకు నిలయం ఈ కడలి
అమృతాన్ని హాలాహలాన్ని అందిచినదీ కడలి
అపార సంపదలకునిలయమీ కడలి
ఎందరికో జీవనోపాధి ఈ కడలి
మరెందరికో మృత్యు కుహరమీ కడలి
బడబాగ్నిని భరించే ఈ కడలి
సునామీలుసృస్టించే ఈ కడలి
మానవాళికి ఆదర్శం ఈ కడలి
ఆటుపోట్లకు తట్టుకుంటూ నిరంతరం
నీజీవనంసాగించమని సందేశమిస్తుంది ఈ కడలి
కడలి వొడ్డున కూర్చుంటే కాలమే తెలియదు
కష్టాలను తలుచుకుంటూ కూర్చుంటే జీవితం సాగదు
అందుకే కడలి తల్లిని తలుచుకుంటూ సాగిపో ముందుకు


మన తెలుగు మనసంస్కృతి చిత్రకవిత -60

ఏమి వ్రాయను?



ఏమి వ్రాయను? (కవితల సుమహారం-6)

కవిత వ్రాయలని వుంది,కానీ ఏమివ్రాయను ?
కనులు మూసి ఆలోచిస్తే ఎన్నో అంశాలు
నా మనోఫలకం పై కదలాడుతున్నాయి
సమాజంలో ఎన్నోరుగ్మతలు ,ప్రపంచవ్యాప్తంగా ఉన్నరోగాల్లా
పుట్టే రోగాలుపుడుతున్నాయి ,మందులతో నివారణ వుందివాటికి
లంచగొండితనం,అబలా అత్యాచారాలు,పెచ్చరిల్లిన పాశ్చాత్యత
యువతరాన్ని చెడగొట్టే సినీమాధ్యమాలు,వీటికి అంతేది,మందేది ?
గురజాడలు,వీరేశ లింగాలు మార్చలేరు ఈసమాజాన్ని
చైతన్యం కావలసిన యువతరం విలాసాలవ్యామోహంలో
దిశా నిర్దేశం చేయాల్సిన పెద్దలు నిర్వేదంతో నిర్వీర్యమవుతుంటే
మొగ్గ దశ లో బాల్యం సామాజిక పైత్యాలకు చిదిమివేయబడుతుంటే
వలువల విలువలను నడివీదిలో సిగ్గువిడిచి వదిలేస్తుంటే
అర్ధనగ్నంగాతిరుగుతున్నా ఆడదానికి స్వేచ్చ కావాలనడం
గాంధీజీ కలలుకన్న స్వతంత్రం ఇంకా రాలేదని శోకించాలా?
ఏమీచేయలేనని చేతులుముడుచుకు కూర్చోవాలా ?
సాహిత్యం సామాజిక దర్పణం అన్న మాటకు ఊతమిస్తూ
నా వేదనను కవిత రూపంలో ఆవిష్కరించాలా
నేటిసమాజానికి ఈ ప్రక్రియ కూడా ఆకతాయి అంశమని
నిట్టూర్పువిడుస్తూ నిరాశగా ఎదురుచూడనా ?


సాహితీ సేవ 'అంతర్వేది సాహితీ పండుగ -సాహితీ సేవకవితల పోటీ కి
టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు .6 .11 .14

శిల్పి



శిల్పి (కవితల సుమహారం-5)

ఉలి పట్టి సుతిమెత్తగా మలచె శిల్పి
విభిన్నభంగిమలతోడ వెలయించె

సాహిత్య శృంగార రసములనెల్ల
రంగరించి గుహలలో,మందిరములపై
తెలియజెప్పెనవి ఎన్నోరసరమ్య కావ్యముల
రామాయణేతిహాసముల భావమెల్ల
మన సంస్కృతీ వారసత్వ సంపదయై
భావితరములకు అందించు భాగ్యమ్ము
భారతీయ శిల్పకళా నైపుణ్యమనిన
విశ్వ విఖ్యాతమే జక్కనాదులు
మతమేదైనా మందిరాలనలరించు
విశిష్ట శిల్పచాతుర్యం మన సొంతం

ఉక్కు వృక్షం


ఉక్కు వృక్షం (కవితల సుమహారం-4)జ్యూరీ అవార్డ్

మనం నాటిన మొక్కలు చెట్టై ఫలాలిస్తే ఆనందం
మరి మనపెరట్లో ఉక్కుమొక్కల్ని నాటుకొని
ఉగ్రవాదపు మానుల్ని పెంచుకొని
పరాయి దేశాలలో విషపు బీజాలు జల్లుకుంటూ
ఎందఱో అమాయకుల ప్రాణాలను మట్టుపెట్టేస్తుంటే
ఈ ఉగ్రవాద ఉక్కువృక్షం నీ పెరట్లో మంచిపూలు పూస్తుందా
చేతుల్లో తుపాకులు,గుండెల్లో కర్కశత్వం
రక్తంనిండా హింసావాదం,తీరనిరక్తదాహం
కరకుచేతులకు పసికూనలు బలయితే కానీ

అది ఉగ్రవాదమని తెలియలేదు పాపం
ఏ పాపమెరుగని పసికందులే

నీ పవిత్రయుద్ధానికి సమిధలవుతుంటే

గుండె కరగలేదా,బండలే కరుగుతాయే
ఏ మతం చెప్పింది రక్తంతో దాష్టీకం చెయ్యమని
చరిత్రచెబుతోంది సంస్కృతిని రచించింది మానవుడని
దాన్ని తరతరాలకు పంచమని,మంచిని పెంచమని
ప్రపంచాన్ని శ్మశానం చేసి సమాధుల రాజ్యమేలుతావా ?
సమాదుల పునాదులపై మరో రాజ్యం నిర్మిస్తావా ?
నీవు నాటిన మొక్కను పెకలించడానికి నీకు ధైర్యం లేదు
ఇప్పటికైనా మించిపోయింది లేదు
ఉగ్రవాద వృక్షానికి మానవత్వపు మందు చల్లు
దాని మూలాలలో మలాలా లాంటి శాంతి కపోతాలు వాలనివ్వు
వెయ్యిగొడ్లను తిన్నరాబందు కూడా ఒక్కగాలివానకు రాలినట్లు
మనుషులంతా ఏకమైతే,సౌభ్రాత్రుత్వపు గీతమాలపిస్తే
ప్రపంచం నలుమూలలా వున్న ఉగ్రవాదం వేళ్ళతో కూలిపోతుంది.
యువతరం విశ్వ శాంతికి బాట వేస్తే నవసమాజపు తోట పూస్తుంది


'సాహితీ సేవ' కవితల పోటీ - 9 ఉగ్రవాదం - నిర్మూలన....పై నాకవిత

దీపావళి (కవితల సుమహారం-3)



దీపావళి (కవితల సుమహారం-3)

అమావాస్య చీకట్లను చీల్చుతూ వెలుగురేఖలు చిమ్ముతూ
అణగారిన జీవితాలలో ఆశావహ దృక్పదం నింపుతూ
పున్నమంటి పండుగ వెన్నెలంటి పండుగ
ఇంటింటా ప్రమిదలలో వెలిగే దీపాలు మన హృదయాలు
అందులోవున్న నూనె మనలోని ఆశ
ఆశలు తీరిన మనసుల ఆనందం దీపం
చిరునవ్వులు పూయించే మతాబులు ,కాకరలు
మన ఆనందపు హద్డులుతెలిపే చిచ్చు బుడ్లు
మన అంతరంగాల అనుభూతుల భూ ,విష్ణుచక్రాలు
మనతీరనికోర్కెల భావప్రతీకలు తారాజువ్వలు
చిన్నారుల ముద్దు మురిపాలవెన్నముద్దలు
అల్లరిచేసేకుర్రకారులా సిసింద్రీలు
చిటపటలాడే నాన్నలా  సీమటపాసులు
, అలిగిముక్కుచీదే అమ్మలాచీదేసే టపాసులు
జీవన రససారంలా సాగిపోయే ఈ దీపావళి
అధర్మం పై ధర్మం విజయానికి
మనః క్లేశాల పై మనోధైర్యాల విజయాలకి
అభివృద్ధికి, ఆకాంక్ష కి ,ఆశకి, ఆశయానికి
మానవత్వానికి మహిళాభ్యుదయానికి
నిలువెత్తు నిదర్శనం ఈ దీపావళి
సాహితీ సేవ సమూహంలో దీపావళి ప్రత్యేక కవితలపోటీలో ప్రధమ బహుమతి పొందినకవిత

అలుకల చిలుక



అలుకల చిలుక (కవితల సుమహారం-2)

అలుకమానవే తరుణీమణి
అలసిన నీ కనురెప్పలు
అరుణారుణ మందారమై
అగ్నికణాలనువెదజల్లుతూ
అతిలోకసుందరమైన నీమోము
అలా కలవరపడుతుంటే
అమృతా లూరే నీపెదవులు
అనూహ్యంగా వణికి పోతుంటే
అదంతా నీకు నాపై కోపమనుకోనా
అలవోకగా నాపై చూపించే ప్రేమనుకోనా
అక్షరకవితలో నీరూపుచూసుకోనా !
అచ్చర కన్యకా! అక్కునచేర్చుకోనా !

భగినీ హస్త భోజనం



భగినీ హస్త భోజనం (కవితల సుమహారం-1)

అనుబంధాలకు ఆప్యాయతలకు
అరమరికలులేని అనురాగాలకు
నిలువెత్తు నిదర్శనం భగినీహస్తభోజనం
వివాహభందాలతో దూరమైన సోదరిని
కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని
వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ
ఎన్నిపనులున్నా వదలరాదు ఈ సంప్రదాయం