18 ఏప్రి, 2013

రాముడు

రాముడతడు - కౌసల్య రాముడతడు 
రాముడతడు - దశరథ తనయుడతడు
రాముడతడు - గురు భక్తి పరాయణుడతడు
రాముడతడు -సకలవిద్యా పారంగతుడతడు
రాముడతడు -యాగరక్షణా ధర్మ నిరతుడతడు
రాముడతడు-రాక్షస సంహార దురంధరుడతడు
రాముడతడు -అహల్యా శాప విమోచనుడతడు
రాముడతడు -కళ్యాణ గుణాభిరాముడతడు
రాముడతడు -శివ ధనుర్భంగ చతురుడతడు
రాముడతడు -సీతా ప్రియవల్లభుడతడు 
రాముడతడు -అయోధ్యా జన ప్రియ భాంధవుడతడు 
రాముడతడు -కైకా వర శాపగ్రస్తుడతడు 
రాముడతడు -పితృ వాక్య పరిపాలనాభిలాషియతడు
రాముడతడు -సౌమిత్రీ పరివేష్టితుడతడు
రాముడతడు-సీతా సమేత వనసంచారి యతడు 
రాముడతడు - దైత్య జన నిర్జనుడతడు
రాముడతడు -సీతా వియోగ శోకితుడతడు 
రాముడతడు -హనుమసేవితుడతడు 
రాముడతడు -సుగ్రీవ ప్రియ స్నేహితుడతడు
రాముడతడు -వాలి సంహారకుడతడు
రాముడతడు -వారధి బందనుడతడు
రాముడతడు -దశకంఠ మర్ధనుడతడు
రాముడతడు -విజయ రాముడతడు 
రాముడతడు -సకలగుణాభి రాముడతడు                    

14 ఏప్రి, 2013

నేను

ఒకప్పుడు నేను ధీరుడిని
కానీ నేడు భీరువుని !

కొండంత సమస్యను సైతం 
గుండె నిబ్బరం తో ఎదుర్కొనే నాకు 
గుండెలోతుల్లో నేడు భయం 
పడగవిప్పి బుసకోడుతోంది

మండే ఎండను సైతం
లెక్కచేయని నేను
మంచు బిందువుని సైతం
మోయలేక పోతున్నాను

చిరునవ్వు చిద్విలాసమైన నన్ను
గరళకంఠునిలా
కక్కలేక మింగలేక
ఈతిబాధల విషం బాధిస్తోంది

ఏ క్షణాన ఏమిజరుగుతుందో
తెలియని భయంతో
ఓర్పుతో అన్నీ సహించిన నేను
ఓదార్పుకోసం ఎదురు చూస్తున్నాను.

అందుకే
ఒకప్పుడు నేను ధీరుడిని !
కానీ నేడు భీరువుని!!

11 ఏప్రి, 2013

ఉగాది

ఉదయకాంత  నునులేత స్పర్శతో 
కనులు తెరిచిన నాకు
ఉగాది వచ్చిందంటే 
ఆశ్చర్యమేసింది 
ఏది ?ఎక్కడ? అని ఇల్లంతా వెతికాను
ఎక్కడా కనిపించలేదు !

పెరిగిన ధరల ముసుగులో 
తీపి,పులుపు ,ఉప్పు ,కారం 
కాలుష్యపు కోరలలో 
వేపపువ్వు ,మామిడికాయ 
ముఖం చాటేసాయి 

షడ్రుచులు నోరూరించే రుచులుకావని ,
షడ్చక్రం లో  నలిగిన జీవనరసాలని ,
ఉగాది కావాలంటే ధనం గాది కావాలని ,
తెలియని పసిమనసుకు ఏదో రుచి చూపించి 
ఇదే ఉగాది పచ్చడని ,ఉగాది వచ్చిందని ,
వచ్చి వెళ్లిపోయిందని 
సర్ది చెప్పి ,సమాదానపరచుకొని 
కాసేపలా కళ్ళు మూసుకున్న నాకు 
కనులు తెరిచి చూస్తే 
నిజంగానే ఉగాది వెళ్లి పోయింది !