12 మే, 2015

సేద్యం



సేద్యం(కవితల సుమహారం-13)

నాకూ సేద్యం చెయ్యాలని ఉంది
హలంతో కాదు కలంతో
సమాజమనే భూమినిదున్ని
అక్షరాలనే విత్తులునాటి
చిరుకవితల మొక్కలు పెంచి
చీడ పీడల రుగ్మతలను
కలుపుమొక్కల సమస్యలను
పదునైనపదాల పురుగు మందులతో తొలగించి
చక్కని పదసంపద ఎరువులతో ఏపుగా పెంచి
కావ్యసౌరభాల పంటనూర్చి
ఆకలితో ఆవురావురంటున్న
భావితరానికి పుష్టి కలిగించే
తెలుగు భాష విందుభోజనం
అలంకారాల మమకారం రంగరించి
పసందైన భావాల పిండి వంటలతో
వడ్డించి కొసరికొసరితినిపిస్తా
అన్నదాత రైతులా
తెలుగు భాష కు సేవచేసే
సేవకుడిని నేనవుతా
సేద్యమంటే హలమే కాదు
కలం కూడా అని ఎలుగెత్తి చాటుతా
టి.వి.ఎస్.ఆర్.కే .ఆచార్యులు 10.12.14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి