12 మే, 2015

పాలుగారే పసిప్రాయం



పాలుగారే పసిప్రాయం (కవితల సుమహారం-11)

పాలుగారే పసిప్రాయం పనిపాటల్లో బుగ్గైపోతోంది
పలకాబలపం పట్టే చిన్నారిచేతులు చివికి పోతున్నాయి
ప్రమోదాల బాల్యం ప్రమాదాల నెలవవుతోంది
అమ్మా నాన్నా గోరుముద్దలు తినిపించడం మాని
ఆ చిన్నారుల స్వేదాన్నే ఆధారంచేసుకొంటుంటే
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తామన్న నేతలకు
రోజూ రోడ్డుపక్కన ఇల్లాంటి దిక్కులేని పిల్లలు కనబడరా ?
ఎందరి అమాత్యుల ఇళ్ళల్లో ఇలాంటి బాలలు లేరు ?
చర్యలకు రానిచట్టాలు ఎవరికోసం?ప్రచారాలకోసమా ?
లెక్కల్లో బాలకార్మికులే వుండరు మామూళ్ళు ఇస్తే
బాణసంచా తయారీలో కాలిబూడిదైన బాలలెందరు ?
బాలకార్మిక వ్యవస్థ ను రూపుమాపడానికి
యంత్రాంగానికిచేసే ఖర్చుతో ఎందరికో బ్రతుకునివ్వవచ్చు
కాగితాలలో లెక్కలు,జేబుల్లోకి నిధులు
మరి రోడ్లపై ఎప్పటిలాగే వీధి బాలలు
చదువనేది ప్రాధమిక హక్కు కానీ వారికిఎవరుదిక్కు
ఇది సామాజిక భాద్యతే కానీ ఎవరికీ పట్టదు
అందుకే చిదిమేయకండి బాల్యాన్ని,
అదిమిపెట్టకండి వాళ్ళ ఆశలను,ఆశయాలను
భావిభారతానికి కావలసింది బాలకార్మికులుకాదు
నైపుణ్యాలు కలిగిన నవతరం, యువతరం
తీర్చిదిద్దుదాం వారి నైపుణ్యాలను విద్యద్వారా !
తిరగరాద్దాం వారి తలరాతను బంగారు బాటగా !


సాహితీ సేవ కవితల పోటీ -7 కి కవిత
టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు .9 .11 .14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి