12 మే, 2015

ఉక్కు వృక్షం


ఉక్కు వృక్షం (కవితల సుమహారం-4)జ్యూరీ అవార్డ్

మనం నాటిన మొక్కలు చెట్టై ఫలాలిస్తే ఆనందం
మరి మనపెరట్లో ఉక్కుమొక్కల్ని నాటుకొని
ఉగ్రవాదపు మానుల్ని పెంచుకొని
పరాయి దేశాలలో విషపు బీజాలు జల్లుకుంటూ
ఎందఱో అమాయకుల ప్రాణాలను మట్టుపెట్టేస్తుంటే
ఈ ఉగ్రవాద ఉక్కువృక్షం నీ పెరట్లో మంచిపూలు పూస్తుందా
చేతుల్లో తుపాకులు,గుండెల్లో కర్కశత్వం
రక్తంనిండా హింసావాదం,తీరనిరక్తదాహం
కరకుచేతులకు పసికూనలు బలయితే కానీ

అది ఉగ్రవాదమని తెలియలేదు పాపం
ఏ పాపమెరుగని పసికందులే

నీ పవిత్రయుద్ధానికి సమిధలవుతుంటే

గుండె కరగలేదా,బండలే కరుగుతాయే
ఏ మతం చెప్పింది రక్తంతో దాష్టీకం చెయ్యమని
చరిత్రచెబుతోంది సంస్కృతిని రచించింది మానవుడని
దాన్ని తరతరాలకు పంచమని,మంచిని పెంచమని
ప్రపంచాన్ని శ్మశానం చేసి సమాధుల రాజ్యమేలుతావా ?
సమాదుల పునాదులపై మరో రాజ్యం నిర్మిస్తావా ?
నీవు నాటిన మొక్కను పెకలించడానికి నీకు ధైర్యం లేదు
ఇప్పటికైనా మించిపోయింది లేదు
ఉగ్రవాద వృక్షానికి మానవత్వపు మందు చల్లు
దాని మూలాలలో మలాలా లాంటి శాంతి కపోతాలు వాలనివ్వు
వెయ్యిగొడ్లను తిన్నరాబందు కూడా ఒక్కగాలివానకు రాలినట్లు
మనుషులంతా ఏకమైతే,సౌభ్రాత్రుత్వపు గీతమాలపిస్తే
ప్రపంచం నలుమూలలా వున్న ఉగ్రవాదం వేళ్ళతో కూలిపోతుంది.
యువతరం విశ్వ శాంతికి బాట వేస్తే నవసమాజపు తోట పూస్తుంది


'సాహితీ సేవ' కవితల పోటీ - 9 ఉగ్రవాదం - నిర్మూలన....పై నాకవిత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి