12 మే, 2015

* ఆడ పిల్ల *



సాహితీ సేవ చిత్ర కవితల పోటీ - 8 లో 'అబల - సబల' అంశంపై * ఆడ పిల్ల * అనే కవిత కు " ప్రత్యేక బహుమతి.

( కవితల సుమహారం-18 )


ఆడపిల్లగా పుట్టానని తెలిసి ఆనందంతో కేర్ కేర్ మంటావు
"ఆడ" పిల్లవై పుట్టావని తెలియక పాపం
అమ్మ తనబాదల గాధలకు మరోరూపమనుకుంటే
నాన్న గుండెలపై కుంపటిగా కుంటిసాకు చెబుతుంటే
నువ్వు మాత్రం కిలకిలలాడుతూ షోడశ కళలతో.
ఎదుగుతున్న నిన్నుచూసి,ఎద పొంగునిచూసి
చొంగ కార్చుకొనే క్రూరమృగాలు వీధికొక్కడు
నిన్నుతాకాలని తడిమెయ్యాలని ఆప్యాయత ముసుగులో
పండుముదుసలి దగ్గరనుండి పాఠాలు చెప్పే పంతులుదాకా
వయసువచ్చిందన్న బిడియంతో వొదిగి వొదిగి ఎవరికీ చెప్పుకోక
పైశాచిక ప్రవృత్తుల్ని భరిస్తూ వీలైనంత తప్పించుకుతిరుగుతూ
చదువులతో ముందుకు సాగుతుంటే, ప్రేమ పేరుతొ నినువెంటాడే
మరో రకం మృగాల నుండి తప్పుకోలేక తప్పించుకు తిరిగితే
నీ మానసిక సౌందర్యాన్ని గెలవలేక ఆసిడ్ దాడులతో
నీ అందమైన ముఖారవిందాన్ని అందవికారంగా చేసి
అధికారమదంతో ఎన్నెన్నో అకృత్యాలు చేస్తుంటే
పెళ్లి పేరుతొ నీకళ్ళల్లో ఆనందం చూడాలని
కట్నాలకు వెరవక ఆర్భాటంగా పెళ్ళిచేస్తే
అక్కడ మరోరూపంలో నరరూపరాక్షసులు
అత్తమామా,ఆడపడుచుల రూపంలో ఆరళ్ళు
ఆడపిల్ల గాపుట్టడం ఏమి పాపమో
అడుగడుగునా వరకట్న చావులో,అనుమానపు వేధింపులో
కసుగాయని తెలిసినా "మృగ" తృష్ణ తో మానభంగాలు
మేలుకో చెల్లెలా మేలుకో !ఏమగాడు నీకు తోడురాడు
నువ్వే మగాడిగా మారి మనుగడ సాగించు
నీవైపు వక్ర దృష్టితో చూసిన వాడి కళ్ళు పొడువు
మానభంగం చెయ్యాలనుకున్న వాడికి మూలం తెగగొట్టు
మౌనంగావుండకు అన్యాయంజరిగితే,ఎలుగెత్తి చాటు
మానమేపోయినప్పుడు నీకు పోయిందేమిలేదు
పోరాడితే భవిష్యత్తులోనైనా ఆడదాని బ్రతుకు బాగుపడుతుంది

- టి.వి.ఎస్.ఆర్.కే.ఆచార్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి