24 అక్టో, 2015

ప్రేమంటే-తరువాయి భాగం -3


ప్రేమంటే-తరువాయి భాగం -3
అబ్బాయిలంతా వాళ్లకి కేటాయించిన రూములకి వెళ్ళారు.ఆడపిల్లలు వాళ్లకి కేటాయించిన అవుట్ హౌస్ కి వెళ్ళారు. వారి వెనకే అపర్ణ కూడా వెళ్ళింది.అప్పటికే ఆ అమ్మాయిలందరూ పరిచయమయిపోయారు."రాధికా ..రాధికా ! మద్యాహ్నం ఫీల్డుకి వెళ్ళేప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటావు ? నేను ఏం వేసుకోనూ ? "అంటూ చిన్న పిల్లలా రాధికని అడిగింది కోటేరు ముక్కు ,తెల్లగా మెరుపు తీగలా ఉన్న ఆ అమ్మాయి.స్వరం కూడా వీణ మీటినట్లుంది.
"అలాగే నీలహంసా ! ఇప్పుడే కదా వచ్చాము ,అయినా నీకేమి కావాలో నువ్వు చూసుకోవచ్చు కదా !అదీ నేనే చెప్పాలా!"అంది రాధిక
అదికాదే నువ్వైతే నాకేది నచ్చుతుందో కరెక్ట్ గా చెప్పగలవు.నాకేది ఇష్టమో నాకే తెలియదు"అంది బుంగమూతి పెట్టి నీలహంస.
"ఏమండోయ్ నీలహంసగారు చూడబోతే మీకు కాబోయే వాడిని కూడా మీ ఫ్రెండే సెలెక్ట్ చెయ్యలనేట్టు ఉన్నారే? "అంది అపర్ణ.
అందరూ గొల్లున నవ్వారు.పాపం నీలహంస సిగ్గుపడిపోతూ రాధికని గిల్లుతూ" ఎందుకే ఇంత రాద్ధాంతం చేశావూ ..ఉండు ఇంక నిన్నేమైనా అడుగుతానేమో చూడు "అంది.
"అయ్యో అపర్ణ గారు దానికి ఇంకా అమాయకత్వం పోలేదు.అన్ని నన్నే అడుగుతుంది.తొందరగా చిన్న బుచ్చుకుంటుంది "అందిరాధిక .
" అయ్యో సరదాకి అన్నానండి నీలహంసగారు సారీ "అంది అపర్ణ." ఫరవాలేదండీ "అంది నీలహంస.
అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.ఇంక అపర్ణ కబుర్ల నిండా వాళ్ళ బావ సురేంద్ర మీద అభిమానం ఆప్యాయత కనిపిస్తున్నాయి.ఆమె మాటల ద్వారా సురేంద్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేసేసుకున్నారు అమ్మాయిలు.
మద్యాహ్నం ఒంటిగంట కల్లా భోజనాలకి అందరూ కలిసారు.అప్పుడు అమ్మాయిలు సురేంద్ర ని తేరిపార చూసారు.అపర్ణ మాటల్లో సురేంద్ర ని ఇక్కడ సురేంద్ర ని కంపేర్ చేసుకుంటున్నారు.సురేంద్ర అందరితో కలివిడిగా మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు.రెండు కళ్ళు తననే గమనిస్తున్నాయని గుర్తించలేదతడు .భోజనాలయ్యాయి.మద్యాహ్నం మూడు గంటలకి లెక్చరర్ తొ కలిసి పొలాలవైపు వెళ్ళారు విద్యార్థులు ,కావలసిన నోటుపుస్తకాలు పట్టుకొని. అలా ప్రారంభమైన వాళ్ళ ఫీల్డ్ వర్క్ రోజూ ఉదయం టిఫిన్ల దగ్గర, భోజనాల దగ్గర తప్ప మిగతా సమయమంతా వ్రాసుకొనే పనిలో బిజీ అయిపోయింది .
కాలం విచిత్రమైనది.ఎక్కడెక్కడి వారినో ఒక్కటి చేస్తుంది.గత నాల్గురోజులుగా సురేంద్రకు దగ్గర దగ్గరగా ఉంటూ ఆ రెండు కళ్ళూ అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
5 వరోజు అందరూ టిఫిన్ల దగ్గర ఉన్నారు.సురేంద్ర లేడక్కడ.అందరూ అతనికోసం ఎదురు చూసారు.అప్పటిదాకా కళ్ళతోనే వెదుకుతున్న నీలహంస రాధికతో
" ఏమే అతను రాలేదేమిటీ? ఏమయ్యిందీ" అంది గుసగుసగా
."ఏమో నాకేం తెలుసు.అయినా నీకెందుకే ?"అంది రాధిక.
"అది కాదే రోజూ వచ్చేవాడుకదా అని ,అవును అపర్ణ కూడా లేదే! ఏమయింది "అని ఆత్రత పడిపోతోంది.ఇంతలో రంగారావుగారు "అయ్యో ఇంకా టిఫిన్లు చెయ్యలేదేమర్రా! ఓహో సురేంద్ర కోసమా ! తనకి కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఇంటిదగ్గరే ఉన్నాడు.మా అమ్మ్మాయి వెళ్ళింది చూడ్డానికి.మీరు కానివ్వండి.బాగుంటే అలా పొలాల దగ్గరకి వచ్చేస్తాడు ,మీరు తిని బయలుదేరండి నేను బయటికి వెళ్తున్నాను "అని వెళ్ళిపోయారు .
" అయ్యో ఒంట్లో బాలేదా పాపం" అంది నీల హంస."అవునట సరే రా టిఫిన్ చేద్దాం"అంది రాధిక."లేదే నాకు తినాలనిలేదు నువ్వు తినేయి"అంది నీలహంస".ఏమిటే ఇప్పడి దాకా బాగానే ఉన్నావు కాదే ".
అబ్బే ఏమిలేదే తలనొప్పిగా ఉంది నేను ఈ పూట ఫీల్డ్ కి రాలేను "అంది నీలహంస
.రాధిక పెద్దగా గమనించలేదు."సరే అపర్ణ వస్తే తనదగ్గర ఉండు "అని టిఫిన్ చేసి వెళ్లి పోయిందిరాధిక.(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి